రోహిత్ పనైపోయింది..సిరీస్ గెలవడానికి ఇదే సరైన సమయం: ఇంగ్లాండ్ దిగ్గజం

రోహిత్ పనైపోయింది..సిరీస్ గెలవడానికి ఇదే సరైన సమయం: ఇంగ్లాండ్ దిగ్గజం

తొలి టెస్ట్ ఓడిపోయిన భారత్ కు కష్టాలు ఎక్కువైపోయాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం కావడంతో టీమిండియాను ముందుకు తీసుకెళ్లేవారు కరువయ్యారు. దీనికి తోడు రెండో టెస్టుకు ముందు ఆల్ రౌండర్ జడేజా, రాహుల్ గాయాలతో వైజాగ్ టెస్ట్ ఆడట్లేదు. వీరి స్థానంలో సెలక్టర్లు సర్ఫరాజ్, వాషింగ్ టన్ సుందర్, సౌరబ్ కుమార్ లను ఎంపిక చేశారు. మరోవైపు ఇంగ్లాండ్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. తొలి టెస్టులో ఓడించడంతో ఆ జట్టు కాన్ఫిడెన్స్ అమాంతం పెరిగిపోయింది.

స్టోక్స్, మెక్కలం ఇప్పటికే రెండో టెస్టులో భయపడేది లేదని.. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని చెప్పుకొచ్చారు. ఈ లిస్ట్ లో ఇంగ్లాండ్  దిగ్గజ ఆటగాడు బాయ్ కాట్ చేరిపోయాడు. భారత్ లో సిరీస్ గెలవడానికి ఇదే సరైన సమయమని సూచించాడు. కోహ్లీ లేకపోవడంతో భారత్ ను నడిపించాల్సిన బాధ్యత రోహిత్ శర్మ మీద పడింది. కానీ రోహిత్ మాత్రం తొలి ఇన్నింగ్స్ లో 24, రెండో ఇనింగ్స్ లో 39 పరుగులు చేసి భారత్ ను కష్టాల్లోకి నెట్టాడు. కెప్టెన్ గాను రోహిత్ అంత యాక్టివ్ గా లేడు. గత నాలుగు సంవత్సరాల్లో రెండే సెంచరీలు చేశాడు.అని ఈ ఇంగ్లాండ్ దిగ్గజం అన్నారు. 

భారత జట్టు ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటుంది. విరాట్ కోహ్లీ, రాహుల్, జడేజా సేవలను భారత్ కోల్పోనుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని ఇండియాలో 12 ఏళ్ళ జైత్రయాత్రకు ఇంగ్లాండ్ బ్రేక్ వేయాలని బాయ్ కాట్ టెలిగ్రాఫ్ లో సూచించాడు. ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ పనేసర్ 5-0 తో స్టోక్స్ సేన భారత్ పై గెలుస్తుందని జోస్యం చెబితే.. మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. భారత్ కోహ్లీ కెప్టెన్సీ సేవలను కోల్పోతుందని అభిప్రాయపడ్డాడు.       
     
ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 న వైజాగ్ లో జరుగుతుంది. ఈ టెస్ట్ కోసం ఇప్పటికే ఇరు జట్లు వైజాగ్ చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించేశాయి. రాహుల్ స్థానంలో రజత్ పటిదార్, జడేజా స్థానంలో సుందర్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఒక పేసర్ చాలు అనుకుంటే సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇంగ్లాండ్ నలుగురు స్పిన్నర్లతో ఆడొచ్చని కోచ్ మెక్కలం స్పష్టం చేశాడు. మొత్తానికి బాయ్ కాట్ చెప్పినట్టు ఇంగ్లాండ్ సిరీస్ గెలుస్తుందో లేకపోతే టీమిండియా కంబ్యాక్ ఇస్తుందో చూడాలి.