హైదరాబాద్: విదేశీ భాష నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న యువతకు మంత్రి వివేక్ వెంకటస్వామి గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముందుగా 2026, జూన్ 15న హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. తన సొంత నియోజకవర్గం చెన్నూరు, మందమర్రిలోనూ జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ కోర్స్ తెస్తామని తెలిపారు.
విదేశాల్లో ఉద్యోగాల కోసం ఇప్పటికే ప్రత్యేకంగా టామ్ కామ్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. టామ్ కామ్తో యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈఎస్ఐ హాస్పిటళ్లలో కార్మికులకు మంచి సేవలు అందిస్తున్నామన్నారు. ఈఎస్ఐలలో కార్మికుల కోసం స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2026, జూన్ 8వ తేదీతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా వివేక్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గిగ్ వర్కర్ల కోసం చట్టం తీసుకురావడం ఆణందంగా ఉందన్నారు.
►ALSO READ | యువత ఉపాధి లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్డ్స్ ట్రైనింగ్ సెంటర్లు (ATC)
రాహుల్ గాంధీ హామీ ప్రకారం గిగ్ వర్కర్లకు చట్టపరమైన భద్రత కల్పించామన్నారు. రాహుల్ గాంధీ చేతుల మీదుగా గిగ్ వర్కర్ల చట్టం అమలుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో కార్మికుల కనీస వేతనాల అమలును పట్టించుకోలేదని.. అధికారంలో ఉన్న పదేండ్లు కాంట్రాక్టర్లను రక్షించటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన నేతృత్వంలో కమిటీ వేసిందని గుర్తు చేశారు.
ఇటు కార్మికులు.. అటు ఇండస్ట్రీ వారితో మాట్లాడి కనీస వేతనాలు పెంచామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా రాష్ట్రంలోని 65 ఐటీఐలను రూ.2500 కోట్లతో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ (ఏటీసీ)గా అప్ గ్రేడ్ చేశామని తెలిపారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 ఏటీసీలు ఏర్పాటు చేశామన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్ విద్యార్థులకు ఏటీసీల ద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
