ఫోన్ ట్యాపింగ్ పై లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ పై లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని మహబూబ్​ నగర్​ ఎమ్మెల్యే  శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్‌‌‌‌పై కేటీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.  బుధవారం ఆయన గాంధీ భవన్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు.  

లై డిటెక్టర్​ పరీక్షకు సిద్ధమా?

ఫోన్​ట్యాపింగ్​ వ్యవహారంలో లై డిటెక్టర్​ పరీక్షకు సిద్ధమా? అని కేసీఆర్, కేటీఆర్‌‌‌‌కు శ్రీనివాస్​రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అందరూ చదువుకోసం విద్యాలయాలను ఏర్పాటు చేస్తే..  బీఆర్ఎస్ పదేండ్ల పాలన‌‌‌‌లో ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీ‌‌‌‌లు ఏర్పాటు చేసిందని ఎద్దేవా చేశారు. శ్రవణ్ రావు, నవీన్ రావు ఇద్దరూ ఫోన్ ట్యాపింగ్ తో పలువురిని బెదిరించి, వందల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయం‌‌‌‌లో సిట్ వేసి.. లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్​ చేశారు.

 నవీన్​రావు పేరుపై ధరణి‌‌‌‌లో కొన్ని వందల ఎకరాలు బదలాయించారని ఆరోపించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం  నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిపారు.  తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాత్ర ఏంటని ప్రశ్నించారు.  తెలంగాణ  ఉద్యమంలో కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు పెరిగినయ్ తప్పా.. తగ్గలేదని అన్నారు. 'కవిత తీహార్ జైలుకు వెళ్తే.. కేటీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో చిందులు వేస్తున్నారు.

 సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత కేటీఆర్‌‌‌‌కు లేదు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబెర్స్ పోటీ చేయడం కాదు.. ఇప్పుడు ఎందుకు చేయడం లేదు. లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో ముగ్గురు కుటుంబ సభ్యులు మూడు చోట్ల పోటీ చేయాలి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలామంది బాధితులున్నారు. ఈ వ్యవహారంపై నేను డీజీపీకి ఫిర్యాదు చేశా. బాధితులంతా ఫిర్యాదు చేయాలి' అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 

ప్రతి జిల్లాలో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసి, ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులు స్వీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం‌‌‌‌లో బీఆర్ఎస్ ఆగడాలు తెలిసి కూడా కేంద్రంలో ఉన్న వ్యక్తులు మౌనంగా ఎందుకు ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న చందంగా.. గత పదేండ్లలో బీఆర్ఎస్, బీజేపీ వ్యవహరించాయని దుయ్యబట్టారు.