సౌత్ కొరియాపై ఘనా ఖతర్నాక్ విక్టరీ

సౌత్ కొరియాపై ఘనా ఖతర్నాక్ విక్టరీ

పోర్చుగల్ చేతిలో ఓడిన ఘనా...సౌత్ కొరియాతో జరిగిన మ్యాచ్లో మాత్రం సత్తా చాటింది. అద్భుతంగా పోరాడి...3-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఘనా తరపున మొహమ్మద్‌ కుడూస్‌ రెండు గోల్స్ చేశాడు.  మొహమ్మద్‌ సలిసు ఓ గోల్‌ కొట్టాడు. సౌత్ కొరియా ఆటగాడు చో గూసంగ్‌ రెండు గోల్స్ సాధించాడు. 

ఆయూ పాస్..కుడూస్ గోల్..

ఆట ప్రారంభమైనప్పటి నుంచి ఘనా దూకుడుగా ఆడింది. 24వ నిమిషంలో ఘనా తొలి గోల్ సాధించింది.  జోర్డాన్‌ ఆయూ కొట్టిన ఫ్రీ కిక్‌ను  కెప్టెన్‌ ఆండ్రూ ఆయూ నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. దీన్ని మొహమ్మద్ సలిసు అద్భుతంగా గోల్ కొట్టాడు. దీంతో ఘనా ఆధిక్యం 1-0కు పెరిగింది. ఇక 34వ నిమిషంలో  జోర్డాన్‌ ఆయూ ఇచ్చిన పాస్‌ను కుడూస్‌ హెడర్‌తో గోల్‌గా మలిచాడు. జట్టు ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.  తొలి అర్ధభాగంలో ముగిసే సమయానికి  ఘనా 2-0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. 

పుంజుకున్న కొరియా..

రెండో అర్థభాగంలో సౌత్ కొరియా పుంజుకుంది. 58వ నిమిషంలో చో గూసంగ్ తొలి గోల్ చేసి ఘనా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. ఆ వెంటనే మరో 4 నిమిషాల వ్యవధిలో అంటే 61వ నిమిషంలో చో గూసంగ్ రెండో గోల్ కొట్టాడు.  లీ కాంగ్‌ ఇచ్చిన క్రాస్‌ను తొలి గోల్‌ గా మలిచిన చేసిన గూసంగ్.. రెండోసారి బంతిని అద్భుతంగా గోల్ పోస్టులోకి పంపించాడు. కిమ్‌ జిన్‌ ఇచ్చిన కిక్‌ను...గిడియాన్‌ మెన్సాను తప్పిస్తూ..గూసంగ్ గోల్‌ పోస్టులోకి పంపించడం హైలైట్‌గా నిలిచింది. 

కడూస్ కొట్టాడు..జట్టును గెలిపించాడు..

2-2తో స్కోర్లు సమం కావడంతో..ఇరు జట్లు ఆధిపత్యం కోసం హోరా హోరీగా పోరాడాయి.  అయితే కొరియా డిఫెన్స్‌ వైఫల్యాన్ని క్యాష్ చేసుకున్న  కుడూస్‌ మరో గోల్ సాధించాడు. 68వ నిమిషంలో గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కొరియా గోల్ కొట్టేందుకు పలు ప్రయత్నాలు చేసింది. అయితే  ఘనా గోల్‌కీపర్‌ లారెన్స్‌ అతీ జిగీ అద్భుతంగా బంతిని అడ్డుకోవడంతో  కొరియా గోల్ సాధించలేకపోయింది. ఇక గ్రూప్ H నుంచి పోర్చుగల్ నాకౌట్ చేరుకోగా... రెండో స్థానం కోసం ఉరుగ్వే, ఘనా పోటీ పడుతున్నాయి.