మంత్రి  ఆదేశించినా పట్టించుకోని అధికారులు

మంత్రి  ఆదేశించినా పట్టించుకోని అధికారులు

మెదక్/ కొల్చారం/ పాపన్నపేట, వెలుగు:  ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపుతో భూములు కోల్పోయే రైతులకు పరిహారం పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. భూసేకరణ  ప్రక్రియ ఏడేండ్లుగా  కొనసాగుతుండగా, ఎంతో కాలం ఎదురు చూపుల తర్వాత ప్రభుత్వం ఆర్నెళ్ల కింద పరిహారం ఫండ్స్​ శాంక్షన్ చేసింది. కానీ సంబంధిత శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపంతో  రైతులు  పరిహారం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.   ఘనపూర్​ ఆనకట్ట (వనదుర్గా ప్రాజెక్ట్​) నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు కాగా, పూడిక పేరుకుపోయి.. కెపాసిటీ 0.135 టీఎంసీలకు తగ్గింది. దీంతో ఆయకట్టు పరిధిలోని భూముల సాగుకు ఇబ్బంది ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఆనకట్ట ఎత్తును 1.725 మీటర్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2015లో  ఎత్తు పెంచేందుకు రూ.43.64 కోట్లు శాంక్షన్​ అయ్యాయి. 

318 ఎకరాలు ముంపు 

ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపుతో పాపన్నపేట, కొల్చారం మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో 366 మంది రైతులకు సంబంధించిన 318 ఎకరాలు ముంపునకు గురవుతోంది. నాలుగేళ్ల కిందట అధికారులు సర్వే చేసి ఏ గ్రామ పరిధిలో ఏ రైతు భూమి ఎంత మునిగి పోతుందనేది గుర్తించారు.  ఇందులో పాపన్నపేట మండలం నాగ్సాన్​పల్లి, శేరిపల్లి, కొండపాక, గాజుల గూడెం గ్రామాల పరిధిలో 271 మంది రైతులకు సంబంధించి 256 ఎకరాలు, కొల్చారం మండలం చిన్నఘనపూర్​, సంగాయిపేట గ్రామాలకు చెందిన 95 మంది రైతులకు సంబంధించి 62.26 ఎకరాలు ఉంది. 

నిధులు మంజూరైనా ఆలస్యమే..

భూములు కోల్పోయే రైతులకు పరిహారం చెల్లించేందుకు రూ.13 కోట్లు అవసరం కాగా..  ప్రభుత్వం ముందుగా రూ.5 కోట్లు మాత్రమే మంజూరు చేయడంతో  కొందరు రైతులకే పరిహారం అందింది. అధికారులు అంత వరకే భూసేకరణ చేశారు. మరో రూ.8 కోట్లు  మంజూరు చేయకపోవడంతో భూసేకరణ ప్రక్రియ పెండింగ్ లో పడింది. ఇరిగేషన్ అధికారులు ఫండ్స్​కోసం ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపగా  మూడేళ్ల అనంతరం గత మార్చిలో ప్రభుత్వం రూ.8 కోట్లు శాంక్షన్ చేసింది. దీంతో  తమకు పరిహారం అందుతుందని సంబంధిత రైతులు ఆశించారు. ఆరు నెలలవుతున్నా.. ఇంత వరకు బాధిత రైతులకు పరిహారం పంపిణీ చేయడం లేదు. దీంతో భూ సేకరణ ప్రక్రియ పనులు ఏడియాడనే ఉన్నాయి. ఫలితంగా ఆనకట్ట ఎత్తు పెంపు పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు
పరిహారం ఇవ్వాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. నర్సాపూర్​ ఎమ్మెల్యే, మంత్రి హరీశ్​రావును  కలిసి వినతి పత్రం ఇచ్చాం. త్వరగా పరిహారం చెల్లించాలని మంత్రి కూడా అధికారులను ఆదేశించారు. అయినా ఇంతవరకు మాకు డబ్బులు రాలేదు.

- మధుసూదన్ రెడ్డి, రైతు, చిన్న ఘనపూర్

నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నా..

ఘనపూర్​ ఆనకట్ట ఎత్తు పెంపుతో నాది 1.10 ఎకరాల పొలం పోతోంది. అధికారులు సర్వేచేసి హద్దులు పెట్టారు. పరిహారం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు ఇయ్యలేదు.  పరిహారం అడిగినంత ఇవకున్నా, ఇచ్చేదేదో త్వరగా అయినా ఇస్తే బాగుండేది. ఈ విషయంలో అధికారులు సరైన సమాధానం 
చెప్పడం లేదు.
- కొమ్ముల విఠల్, రైతు, చిన్న ఘనపూర్

ఆదేశాలు రాగానే పంపిణీ

సర్వే, పరిహారం ఎంత ఇవ్వాలనే విషయంతో రైతులతో చర్చలు ఇదివరకే పూర్తయ్యాయి. భూములు ముంపునకు గురయ్యే రైతుల నుంచి డిక్లరేషన్​ కూడా తీసుకున్నాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ఆర్డీవో  ఆధ్వర్యంలో సంబంధిత రైతులకు చెక్కుల రూపంలో పరిహారం  అందజేస్తాం.
- చంద్రశేఖర్​, తహసీల్దార్, కొల్చారం