- రూ.11,045 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం!
- ప్రస్తుత కౌన్సిల్ కి ఇదే చివరి సమావేశం
- వచ్చే నెల 10 తో ముగియనున్న గడువు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం శనివారంహెడ్ ఆఫీసులో జరగనున్నది. జీహెచ్ఎంసీ పరిధి విస్తరించిన తర్వాత మొదటిసారి భారీ బడ్జెట్ కౌన్సిల్ ముందుకు రానున్నది. సభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డికి నివాళులర్పించనున్నారు. అనంతరం 2026–27 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత బడ్జెట్‌ను రెండు విభాగాలుగా ప్రవేశపెట్టారు.
పాత జీహెచ్ఎంసీ పరిధిలో రూ.9,200 కోట్లు, కొత్తగా విలీనం అయిన 27 మున్సిపాలిటీల పరిధిలో రూ.2,260 కోట్లు ఖర్చు చేయాలని ఇలా మొత్తం రూ.11,460 కోట్లు ఖర్చు చేయాలని అధికారులు డిసైడ్ చేశారు. అధికార, విపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించిన తర్వాత బడ్జెట్ ను ఆమోదించి, తదుపరి ఆమోదం కోసం సర్కారుకు పంపనున్నారు.
ఈ కౌన్సిల్‌కు ఇదే చివరి సమావేశం...
ప్రస్తుత కౌన్సిల్‌కు ఇదే చివరి సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇతర సమస్యలపై చర్చించేందుకు అవకాశం లేదు. ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ బడ్జెట్‌నే ప్రధాన అజెండాగా ఈ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ బడ్జెట్ రూపకల్పన, కేటాయింపులు, పెట్టుబడులు, వ్యయం వంటి వాటిపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించిన తర్వాత బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదించనుంది. కేటాయింపులపై గళం విన్పించేందుకు ప్రధాన విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు సిద్దమయ్యాయి. మరోవైపు మిత్రపక్షమైన ఎంఐఎం కూడా ప్రశ్నించే అవకాశముంది.
ఈ బడ్జెట్ లెక్కలు సక్రమంగా లేవని ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కి వచ్చిన ప్రాంతాల్లో సౌకర్యాలతో పాటు జీహెచ్ఎంసీ కల్పిస్తున్న నిర్మాణ అనుమతుల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని, పది అంతస్తులకు పైబడ్డ నిర్మాణాలకు అనుమతులు హెచ్ఎండీఏ ద్వారా ఇచ్చి ఫీజులు సైతం వారే కలెక్ట్ చేసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్న ఆరోపణలు చేస్తున్నారు. ఇలా అయితే జీహెచ్ఎంసీకి ఆదాయం ఎలా వస్తుందని, ఈ బడ్జెట్లో సూచించిన లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన జీహెచ్ఎంసీ కి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ మరికొద్ది వారాల్లోనే జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లుగా విభజిస్తారననే టాక్ నడుస్తుందని, ఆ తరుణంలో ప్రస్తుతం ప్రతిపాదించిన బడ్జెట్ ఎలా ఖర్చవుతుందని ప్రశ్నిస్తున్నారు.
