లింగోజిగూడ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు

లింగోజిగూడ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు
  • కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డికి 1272 ఓట్ల మెజారిటీ

గ్రేటర్ హైదరాబాద్ హహానగరం పరిధిలోని లింగోజి గూడ డివిజన్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్థిపై 1272 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. గత డిసెంబర్ లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఖాళీ అయిన ఈ డివిజన్ కు గత నెల 30వ తేదీన పోలింగ్ జరుగగా ఇవాళ ఓట్ల లెక్కింపు జరిగింది. గత డిసెంబర్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి మరణించడంతో జరిగిన ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసుకునేందుకు బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యులు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ పోటీ నుంచి తప్పుకున్నా కాంగ్రెస్ తోపాటు మరికొందరు స్వతంత్రంగా నామినేషన్ వేసి పోటీకి దిగారు. దీంతో ఎన్నిక అనివార్యం అయింది. కరోనా ఉధృతి పతాక స్థాయికి చేరిన సమయంలో పోలింగ్ రావడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓట్లేసేందుకు ఆసక్తి కనపరచలేదు. దీంతో అతితక్కువ ఓటింగ్ నమోదైంది. 
కోవిడ్ నిబంధనల మేరకు కట్టుదిట్టంగా కౌంటింగ్
లింగోజిగూడ లో మొత్తం 49 వేల 203 ఓట్లకు గాను 13 వేల 591 పోలయ్యాయి. కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనన్న కోర్టు ఆదేశాలతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా మూడు గదుల్లో ఐదు టేబుల్స్ చొప్పున మొత్తం 15 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ముందుగా 25 ఓట్ల చొప్పున బండల్స్ కట్టి ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కించారు. కరోనా టెస్ట్ చేయించుకొని నెగెటివ్ వచ్చిన వారినే కౌంటింగ్ హల్ లోకి అనుమతిచ్చారు. మొత్తం పోలైన 13 వేల 629 ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి 7 వేల 240 ఓట్లు రాగా బీజేపీ కి 5 వేల 968 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్ధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి 1272 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.