- టార్గెట్‌కు నెల ఉండగానే రూ.115 కోట్లు వసూలు
- పక్కాగా వసూలు చేస్తే రూ.500 కోట్లు వచ్చే చాన్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్రేడ్ లైసెన్స్ కలెక్షన్స్విషయంలో జీహెచ్ఎంసీ జోరు పెంచింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగ్గొడుతున్న వారిని గుర్తించి యాక్షన్తీసుకుంటూ వసూళ్లను పెంచుకుంటున్నది. జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా రూ.వంద కోట్ల మార్కును దాటింది. గ్రేటర్ లో ప్రాపర్టీ టాక్స్ డేటా బేస్ ప్రకారం నాన్ రెసిడెన్షియల్ పరిధి లో 3,17,033 ప్రాపర్టీలున్నాయి. ఇందులో చిన్నచిన్నవి వదిలిపెట్టినా అధికారికంగా 2 లక్షల ట్రేడ్ లైసెన్స్ లైనా జారీ కావాల్సి ఉంది.
అయితే, బల్దియా ఇప్పటివరకు 1,10,000 ట్రేడ్స్ నుంచి రూ.115 కోట్లను కలెక్ట్ చేసింది. మరో 90 వేల ట్రేడ్స్‌కు సంబంధించిన డ్రైవ్ కొనసాగుతోంది. ఇందులో ఎన్ని మూసివేశారు? ఎన్ని కొనసాగుతున్నాయో గుర్తించే పనిలో అధికారులున్నారు. మొత్తంగా డిసెంబర్ లోపు మరో రూ.5 కోట్ల వరకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
కలెక్షన్ బాధ్యతలు వారికి ఇవ్వడంతోనే..
గ్రేటర్ లో మెయిన్‌రోడ్ల నుంచి మొదలుపెడితే కాలనీల వరకు ప్రతిరోడ్డుపై రెండు వైపులా వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇలా చిన్నవి, పెద్దవి కలిపి దాదాపు 10 లక్షలకు పైగానే ఉంటాయి. కానీ, బల్దియా మాత్రం కేవలం 3 లక్షల వ్యాపారాలున్నట్లు మాత్రమే గుర్తించింది. ఇందులో 1,20, 000 వ్యాపారాలకు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఫీజు కలెక్ట్ చేస్తోంది. సర్కిల్ స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారులతో కుమ్మక్కై లైసెన్సులు జారీ చేయకపోవడం, కొందరు వ్యాపారులు పేర్లు మార్చి బిజినెస్‌లు చేస్తుండడం వల్ల అనుకున్నంత ఆదాయం రావడంలేదు.
క్షేత్రస్థాయిలో తనిఖీలు కూడా చేయకపోవడంతో ఇన్‌కం తక్కువగా వస్తోంది. గ్రేటర్ లో ప్రస్తుతం సింగిల్ రోడ్డున్న చోట స్క్వేర్ ఫీటుకి రూ.3, డబుల్ రోడ్డు అయితే రూ.4,..నాలుగు లేన్లకి మించిన మెయిన్‌రోడ్డు ఉంటే రూ.6 చొప్పున లైసెన్స్‌ఫీజు తీసుకుంటున్నారు. దీని ఆధారంగా అన్నింటి నుంచి పక్కాగా ట్రేడ్ లైసెన్స్ కలెక్ట్ చేస్తే రూ.500 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని కొందరు ఉన్నతాధికారులు చెప్తున్నారు.
ఈ విషయంలో బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ కూడా సిరీయస్ గానే ఉన్నారు. వ్యాపారాలు చేస్తూ జీహెచ్ఎంసీకి ట్రేడ్ చెల్లించకుండా ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితం వరకు మెడికల్ ఆఫీసర్లకున్న ట్రేడ్‌లైసెన్సు కలెక్షన్బాధ్యతలను అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారు.
దీంతో వారు సర్కిల్లెవెల్లో ఎన్ని కమర్షియల్ భవనాలున్నాయో తెలుసుకుని, వాటి వద్దకు వెళ్లి వివరాలు తీసుకుంటున్నారు. ఒకవేళ వారు ట్రేడ్లైసెన్స్తీసుకోకుండా వ్యాపారం చేసినా, లేక ఎక్కువ విస్తీర్ణంలో బిజినెస్చేస్తూ తక్కువ కడుతున్నా పెనాల్టీలతో సహా వసూలు చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది 40 రోజులు మిగిలి ఉండగానే రూ.వంద కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకెళ్తున్నారు.
ట్రేడ్ లైసెన్స్ కలెక్షన్ ఇలా....
ఏడాది ట్రేడ్ లైసెన్స్ లు ఆదాయం రూ.కోట్లలో
2018–19 40,422 32
2019–20 39,501 34
2020–21 31,166 32
2021–22 34,813 46 (మార్చి నుంచి డిసెంబర్)
2022 74,561 72 (జనవరి నుంచి డిసెంబర్)
2023 1,06,333 81 (జనవరి నుంచి డిసెంబర్)
2024 1,10,015 94 (జనవరి నుంచి డిసెంబర్)
2025 1,10,000 115 (జనవరి నుంచి ఇప్పటి వరకు)
