పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశాం : రోనాల్డ్ రోస్

పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశాం : రోనాల్డ్ రోస్

హైదరాబాద్, వెలుగు:   హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్లు,  కంటోన్మెంట్ అసెంబ్లీ బై పోల్ పోలింగ్ నిర్వహణకు     అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. మంగళవారం పోలింగ్ ఏర్పాట్లపై ఆయన సిటీ పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్  సెగ్మెంట్ల   రిటర్నింగ్ అధికారులు అనుదీప్, హేమంత్ కేశవ్ పాటిల్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సీనియర్ సిటిజన్స్ ఓటు వేసేందుకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు.

సాక్ష్యం యాప్  ద్వారా ఇప్పటికే 500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే 80 శాతం ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశామని వివరించారు.  పోలింగ్ రోజు  బూత్ లో క్యూ లైన్ తెలుసుకునేందుకు క్యూ మేనేజ్ మెంట్ యాప్ ద్వారా వెసులుబాటు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 3,986 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశామని, అన్నింట్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ శాతం పెరిగేలా పెద్ద ఎత్తున స్వీప్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బందికి 12,13 తేదీల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.  

సీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీఆర్ సీ, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  ఎన్నికల విధుల్లో 14,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. అనంతరం పోలింగ్ డేట్ తెలిపే ఓటరు స్టిక్కర్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు,  హోం ఓటింగ్ నోడల్ అధికారి డిప్యూటీ కలెక్టర్ అర్చన పాల్గొన్నారు.