- ఫిబ్రవరి 10 తర్వాత అందరికీ చెప్తం
- పాలకమండలి గడువు ముగిశాక సమస్యల పరిష్కార బాధ్యత ఆఫీసర్లదే
- అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్ష
- రోడ్లపై గుంతలు ఎందుకు పూడ్చడం లేదని ప్రశ్న
- వాటర్ బోర్డే కారణమన్న కమిషనర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ విభజనపై నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనున్నది. బల్దియా విభజనపై ఫిబ్రవరి10న ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. విభజన విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని, ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ఉందని స్పష్టం చేశారు. వచ్చేనెల10తో ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగియనున్న నేపథ్యంలో బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఆర్డీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి అధికారులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కేవలం పాలనాపరమైన అంశాలే కాకుండా, నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కూడా మంత్రి చర్చించారు. ప్రతిష్టాత్మక హెచ్-సిటీ, వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ) సహా జీహెచ్ఎంసీ చేపట్టిన ఇతర ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.
హెచ్ సిటీ, ఎస్‌ఆర్‌డీపీ, ఎస్ఆర్డీపీ, రోడ్లు–స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, సానిటేషన్, ప్రజారోగ్యం, ఐటీ, టౌన్ ప్లానింగ్, మహిళా సంక్షేమం, పట్టణ స్వయం సహాయక సంఘాలకు చేయూత, పర్యావరణం, గాలి నాణ్యత వంటి అంశాలను, పురోగతిని, ఫీల్డ్సమస్యలు, ప్రభుత్వ సహకారాన్ని అధికారులు మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పొన్నం మాట్లాడుతూ భూగర్భ జలాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇంటి నిర్మాణ టైంలోనే ఇంకుడు గుంతలను తప్పనిసరిగా నిర్మించుకునేలా చూడాలన్నారు. స్ర్టీట్ లైట్లు పూర్తి స్థాయిలో వెలిగేలా చూడాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణపైనే హైదరాబాద్ స్వచ్ఛ బ్రాండ్ ఇమేజ్ ఆధారపడి ఉందని చెప్పారు. అడిషనల్కమిషనర్లు సృజన, వినయ్ కృష్ణారెడ్డి, అనురాగ్ జయంతి ,హేమంత్ కేశవ్ పాటిల్, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఇకపై అధికారులదే బాధ్యత.
పరిపాలనా సౌలభ్యం కోసం మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లుగా విభజించిన నేపథ్యంలో ఆయా జోనల్ కమిషనర్లు, సర్కిల్ ఆఫీసర్లను, వివిధ విభాగాల ఉన్నతాధికారులను మంత్రి పరిచయం చేసుకున్నారు. పాలకమండలి గడువు ముగిసిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కార బాధ్యత పూర్తిగా అధికారులపైనే ఉంటుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు ఉండరు కాబట్టి ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుందని, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు వంటి అంశాలపై ప్రశ్నించేవాళ్లు ఎక్కువవుతారని, వారి ప్రశ్నలకు బదులిచ్చేందుకు, సమస్యల పరిష్కారానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తం
నగరంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు. గ్రేటర్ లో 72, 942 పైగా ఉన్న స్వయం సహాయక సంఘాలను లక్ష వరకు పెంచాలన్నారు. బీపీఎల్కుటుంబానికి చెందిన ప్రతి మహిళా సంఘంలో సభ్యులుగా చేర్చాలన్నారు. సెట్విన్ సహకారంతో సిటీలోని మహిళా సంఘాలకు వివిధ జీవనోపాధులపై ట్రైనింగ్ఇచ్చి ..వారి కాళ్లపై వారు నిలబడేలా ఉపాధి కల్పిస్తామన్నారు. ఇప్పటికే గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ఆదాయం వచ్చేలా చేశామన్నారు. అదేవిధంగా గ్రేటర్ లో 40 నుంచి 50 బస్సులు స్వయం సహాయక సంఘాలకు ఇస్తామని తెలిపారు. ఈసందర్భంగా తమ ఐదేండ్ల పాలనలో సహకరించిన అధికారులకు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు.
రోడ్లపై గుంతలకు కారణం వాటర్ బోర్డే
నగర రోడ్లపై గుంతలు ఏర్పడుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని మంత్రి అధికారులను ప్రశ్నించారు. వెంటనే వాటిని వెంటనే పూడ్చాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు పూడ్చినా జలమండలి పనుల పేరుతో తవ్వుతోందని, అందుకే కొన్ని చోట్ల గుంతలు ఏర్పడుతున్నాయని, ఆ పనులు వారితోనే చేయిస్తామని కమిషనర్ బదులిచ్చారు.
హైదరాబాద్ లో కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఎయిర్ క్వాలిటీని కాపాడడంలో జీహెచ్ఎంసీ ప్రధాన బాధ్యత తీసుకోవాలని, ఢిల్లీ తరహాలో ఎయిర్ క్వాలిటీ పడిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాలుష్యానికి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో మరిన్ని ఎలక్ట్రికల్బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
సర్కిల్ ఆఫీస్ ప్రారంభం
ముషీరాబాద్: దోమలగూడలో కవాడిగూడ, ముషీరాబాద్‌కు సంబంధించిన జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బల్దియాలో పెరిగిన వార్డుల ప్రకారం దళితులకు 45 సీట్లు కేటాయించాలని తెలంగాణ దళిత ఐక్యవేదిక సంఘం నిరసన తెలిపింది. అనంతరం ఐక్యవేదిక ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
