 
                                    - ప్రతి చుక్కా లెక్కగట్టాలని వాటర్ బోర్డు నిర్ణయం
- గ్రేటర్ పరిధిలో తాగునీటి సరఫరాలో టెక్నాలజీ వినియోగం
- బోర్డు ఆదాయం పెంచడంపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్‌పరిధిలో సరఫరా అవుతున్న తాగునీటికి ప్రస్తుతం సరైన లెక్కలు లేవు. దీంతో సరఫరా చేస్తున్న నీటికీ, వచ్చే ఆదాయానికి పొంతన లేకుండా పోతోంది. ప్రస్తుతం గ్రేటర్‌పరిధిలో 550 ఎంజీడీల నీటి సరఫరా జరుగుతుండగా, నెలకు రూ. 230 కోట్ల వరకూ ఆదాయం రావాల్సి ఉంది. కానీ, ఇందులో 50 శాతం ఆదాయం మాత్రమే వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. నగరం విస్తరిస్తుండడం, నీటి డిమాండ్పెరుగుతున్న నేపథ్యంలో కోల్పోతున్న ఆదాయంపై దృష్టి పెట్టాలని వాటర్‌బోర్డు అధికారులు నిర్ణయించారు.
నీటి పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడానికి, సరఫరా అయ్యే ప్రతీ చుక్క లెక్కించడానికి స్మార్ట్ మీటర్ల టెక్నాలజీని ప్రవేశ పెట్టాలని డిసైడ్అయ్యారు. ఈ టెక్నాలజీపై ఇటీవలే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి, ఐటీ, రెవెన్యూ అధికారులు లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. బోర్డు ఆదాయం పెంచడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఈ క్రమంలో ఐటీ కారిడార్‌లో స్మార్ట్మీటర్టెక్నాలజీని అమలు చేయాలని నిర్ణయించారు. అక్కడ సక్సెస్అయితే, నగరమంతా ఇంప్లిమెంట్చేయనున్నారు.
టెక్నాలజీ వాడితేనే ఉపయోగం
సిటీలో దాదాపు15 వేల చిన్న, పెద్ద వాల్వ్ లు ఉంటాయి. అందులో 35 శాతం వాల్వ్ లు మాత్రమే తరుచూ ఆపరేట్ చేస్తూ ఉంటారు. వీటిని లైన్మెన్లు మెయింటెయిన్చేస్తుంటారు. అధిక శాతం వాల్వులు రోడ్లపైనే ఉన్నాయి. నీటి సరఫరాకు, సరఫరాను ఆపడానికి వాల్వులను తిప్పడం తప్పదు. పలుసార్లు వాహనాల రాకపోకల వల్ల పలువురు లైన్ మెన్లు ప్రమాదాలకు గురవుతున్నారు.
కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి దుర్ఘటనలు నివారించడానికి స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీతో (ఆటోమేటిక్ వాల్వ్ ఆపరేషన్ పద్ధతి) ప్రయోగాత్మకంగా సనత్ నగర్ లో ఏర్పాటు చేసి విజయం సాధించారు. ఇప్పుడు ఇదే పద్ధతిని నగరంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ స్మార్ట్ వాల్వ్ టెక్నాలజీ వినియోగంలోకి వస్తే లైన్ మెన్లు ఫీల్డ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మొబైల్యాప్ఇన్స్టాల్చేసుకుని తిప్పొచ్చు.
ఇందులోనే వాల్వ్ ఆపరేషన్, వాటర్ క్వాలిటీ, క్వాంటిటీ, క్లోరిన్ శాతం వివరాల్ని తెలుసుకోవచ్చు. ఈ టెక్నాలజీ పూర్తిగా సోలార్ ఎనర్జీతో పని చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ సైతం ఉండడం వల్ల నిర్వహణలో విద్యుత్‌సమస్యలు ఉండవు. ప్రస్తుతం సనత్ నగర్ లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం సమర్థవంతగానే పని చేస్తోందని అధికారులు చెప్తున్నారు. అలాగే, రిజర్వాయర్ అవుట్ లెట్ వద్ద, బల్క్ కనెక్షన్లు ఉన్న ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి, సరఫరా అయ్యే ప్రతీ చుక్కను లెక్కలోనికి తీసుకురావాలని చూస్తున్నారు.
హెడ్డాఫీసులో కంట్రోల్ రూమ్ ద్వారా వాల్వ్ ల ఆపరేషన్, కంట్రోల్ చేయడం, పర్యవేక్షించేలా వ్యవస్థను రూపకల్పన చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ మీటర్ల పనితీరు, పంపిణీ చేసిన క్వాంటిటీ, క్వాలిటీతో పాటు బిల్లింగ్ వివరాలను సైతం ఈ వ్యవస్థకు అనుసంధానం చేసేలా టెక్నాలజీని రూపొందిస్తున్నారు.

 
         
                     
                     
                    