కొత్త ఓటర్లపై ఫోకస్​: యూత్ ​ఓట్లపై అన్ని పార్టీల నజర్​

కొత్త ఓటర్లపై ఫోకస్​: యూత్ ​ఓట్లపై అన్ని పార్టీల నజర్​

గ్రేటర్ లో యూత్ ​ఓట్లపై అన్ని పార్టీల నజర్​
డివిజన్ల వారీగా క్యాండిడేడ్స్​ప్లాన్లు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​ఎన్నికల్లో అన్ని పార్టీలు కొత్త ఓటర్లపైనే ఫోకస్​ చేశాయి.  వారిని తమవైపు తిప్పుకునేలా ఆయా పార్టీల క్యాండిడేట్స్​ క్యాంపెయిన్​ షురూ చేశారు. మొత్తం150 డివిజన్లలో ప్రస్తుతం 74.04 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2016 బల్దియా ఎన్నికలప్పుడు ఈసంఖ్య  74.23లక్షలుగా ఉంది. అప్పటి కంటే ఈసారి 20వేలకుపైగా ఓటర్లు తగ్గారు. డివిజన్ల వారీగా చూస్తే కొన్నింట్లో మాత్రమే ఓటర్లు తగ్గినా,  మెజార్టీ డివిజన్లలో సగటున1500కు పైగా కొత్త ఓటర్లు పెరిగారు. ఇక ఓటర్​ఎన్ రోల్ మెంట్ నుంచే అన్ని పార్టీలు కొత్త ఓట్లర్లపై ఫోకస్​ చేశాయి. ఎన్నికల సందర్భంగా వారిని తమ వైపు తిప్పుకునేలా పక్కా ప్లాన్​తో వెళ్తున్నాయి. ఇప్పటికే పార్టీల వారీగా ఓటర్​ లిస్ట్​లను పట్టుకుని గల్లీ లీడర్లు ఇల్లిల్లూ తిరుగుతున్నారు.  అయితే కొత్త ఓటర్లు ఎటు ఓటేస్తారోననేది ఇంట్రస్టింగ్​గా మారింది.

వివరాల సేకరణలో క్యాండిడేట్స్​

డివిజన్ల వారీగా పెరిగిన కొత్త ఓటర్లు ఉండే ప్రాంతాలు, కాలనీలు, బస్తీలు, అపార్టుమెంట్లలో మీటింగ్​లకు  క్యాండిడేట్స్​ రెడీ అవుతున్నారు. ఇప్పటికే కాలనీ ప్రెసిడెంట్లు, అపార్టుమెంట్ కమిటీల వివరాలు సేకరిస్తున్నా రు.  గత ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే కొత్త ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు స్టార్ట్​ చేశారు. ఓటర్లు పెరిగినా, తగ్గినా వచ్చిన నష్టం పెద్దగా లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.  టఫ్​  పోటీనిచ్చేందుకు సిద్ధమైన బీజేపీకి ఇది కలిసి వచ్చే అంశమని పొలిటికల్​ ఎక్స్​పర్ట్స్​ పేర్కొంటున్నారు.

కొన్ని డివిజన్లలోనే తగ్గిన ఓటర్లు

గ్రేటర్​పరిధిలోని 30 సర్కిళ్లలో 150 డివిజన్లు ఉండగా, కొన్ని డివిజన్లలోనే ఓట్లు తగ్గాయి. మెజార్టీ డివిజన్లలో 1,000 నుంచి 1,500 మంది ఓటర్లు పెరిగారు. ఈ లెక్కన గతం కంటే మెరుగ్గానే ఉన్నా,  ఏ మేరకు పోలింగ్ అవుతుందనే దానిపైనే క్యాండిడేట్స్​ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.  పోలింగ్ శాతం పెంచుకుని లబ్ధి పొందాలని అన్ని పార్టీల క్యాండిడేట్స్​ చూస్తున్నారు.  ఒకసారి పరిశీలించే చూస్తే 1వ సర్కిల్ కాప్రాలో కాప్రా, ఏఎస్ రావు నగర్, చర్లపల్లి, మీర్ పేట్ హెచ్బీ కాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్లు ఉన్నాయి. వీటిలో 2016లో 2,82, 220 మంది ఓటర్లు ఉన్నారు.  ఈసారి 2,79,772 మంది ఉన్నారు. ఇందులో ఎక్కువగా ఏఎస్ రావు డివిజన్ లోనే 6వేల పైగా ఓటర్లు తగ్గారు. కాప్రాలో 2 వేలు, నాచారంలో 3వేల ఓట్లను లిస్ట్​ల నుంచి తొలగించారు.  మిగిలిన మూడు డివిజన్లలో ఆ సంఖ్య వందల్లోనే ఉంది. అయితే మిగిలిన 29 సర్కిళ్ల పరిధిలో ఓట్లను తొలగించినా పెద్దగా మార్పు లేదు.