డబ్బులు పంచుడు షురూ…

డబ్బులు పంచుడు షురూ…

విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్న క్యాండిడేట్లు

పలుచోట్ల టీఆర్ఎస్​ నేతలను పట్టుకున్న బీజేపీ కార్యకర్తలు

ఒక్కో డివిజన్​లో రూ. కోట్ల పంపిణి

పంచుతున్న దానిలో దొరుకుతున్నది నామ్​కే వాస్తేనే..

లిక్కర్​ సీసాలకు లెక్కేలేదు..

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎలక్షన్​ ప్రచారం ముగియడంతో డబ్బులు పంచుడు షురువైంది. ఓట్లకోసం క్యాండిడేట్లు ఎంతయినా ఖర్చుపెట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే తమ సన్నిహితులను, అనుచరులను రంగంలోకి దింపి.. డబ్బు పంపిణీ మొదలుపెట్టారు. వారు గల్లీలు, కాలనీలు, అపార్ట్​మెంట్లలో తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. తమ క్యాండిడేట్​కే ఓటేయాలంటూ పాంప్లెట్లు, డబ్బులు చేతిలో పెట్టి.. మాట తీసుకుంటున్నారు. ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయి, ఓటుకెంత అని లెక్కగట్టి పైసలు పంచుతున్నరు. నేరుగా క్యాష్​ ఇవ్వడంతోపాటు ‘గూగుల్​పే, ఫోన్​పే, పేటీఎం’వంటి యాప్​ల ద్వారా ఓటర్లకు డబ్బులు ట్రాన్స్​ఫర్​ చేస్తున్నారు. టీఆర్ఎస్​ నేతలు పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు ముప్పై, నలభై డివిజన్లలో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్​ వారిని కాంగ్రెస్, బీజేపీల నేతలు, స్థానికులు పట్టుకున్నారు. మరోవైపు భారీగా లిక్కర్​ పంచేందుకు క్యాండిడేట్లు రంగం సిద్ధం చేసుకున్నారు. పలుచోట్ల లిక్కర్​ పంచుతున్నవారిని స్థానికులు పట్టుకున్నారు.

ఎలక్షన్​ ప్రచారం టైం ముగిసిన వెంటనే నేతలు ఓట్ల కొనుగోళ్ల మీద పడ్డారు. ఓటర్ల లిస్టులు పట్టుకుని డబ్బులు, లిక్కర్​ పంచేందుకు ఏర్పాట్లు రెడీ చేసుకున్నారు. చాలా చోట్ల రూ.రెండు వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న డివిజన్లలో అయితే ఓటుకు పదివేలకుపైగానే పంచుతున్నారు. కొన్నిచోట్ల బియ్యం, ఇతర నిత్యాసవరాలను కూడా ఇండ్లకు పంపుతున్నారు. ప్రధానంగా బస్తీలు, చిన్న కాలనీలపై నజర్​ పెట్టారు. వారంతా కచ్చితంగా పోలింగ్​ సెంటర్​కు వస్తరని, వాళ్లకు డబ్బులు ఇస్తే ఓట్లు పడ్తయని భావిస్తున్నారు.

సెటిలర్లున్న చోట ఫుల్ డిమాండ్

జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉండగా.. సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, ఎల్ బీ నగర్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో ఓట్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇక్కడ ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఎక్కువగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లోని డివిజన్లలో పోటీ చేస్తున్న క్యాండిడేట్లు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు. ఓటుకు రూ.10వేలు కూడా ఇస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు.

గుడిమల్కాపూర్ ఓయో హోటల్ వద్ద ఆందోళన

గుడిమల్కాపూర్ ఓయో హోటల్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆనంద్, క్యాండిడేట్ ప్రకాశ్ తమ అనుచరులతో కలిసి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టిం చుకోవడం లేదని నిరసనకు దిగారు. ఎమ్మెల్యేను, టీఆర్ఎస్ నేతలను పంపి హోటల్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాసేపటికి ఆసిఫ్ నగర్ పోలీసులు వచ్చి బీజేపీ నేతలు, కార్యకర్తలను పంపించేశారు.

లిక్కర్​పారుతోంది!

పైసలు పంచడంతోపాటు లిక్కర్​ పంపిణీపైనా క్యాండిడేట్లు నజర్​ పెట్టారు. ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం (1న) సాయం త్రం వరకు వైన్ షాపులు మూసేయాలని ఎస్​ఈసీ ఆదేశించింది. అయితే క్యాండిడేట్లు ముందుగానే పెద్ద ఎత్తున లిక్కర్​ కొని స్టాక్​ పెట్టుకున్నారు. సన్నిహితులు, అనుచరుల ఇండ్లలో దాచిపెట్టి.. ఓటర్లకు పంచుతున్నారు. బస్తీల్లో లిక్కర్​ పంపిణీ యథేచ్చగా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. అంబర్ పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిదిలోని బస్తీల్లో జోరుగా మద్యం పంపిణీ చేసినట్లుగా స్థానిక నేతలు ఆరోపించారు. ‘‘వైన్ షాపులు బంద్ పెడ్తరని తెలిసి.. క్యాండిడేట్లు ముందే లిక్కర్​ కొనిపెట్టుకున్నారు. గ్రేటర్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి సేల్స్ పెరిగినయి’’అని అంబర్ పేట కు చెందిన ఓ వైన్స్ ఓనర్ చెప్పారు.

సూరారంలో 300 కార్టన్ల లిక్కర్

సూరారం (129 నంబర్) డివిజన్​లోని సంజయ్​గాంధీనగర్​లో ఉన్న ఓ షాపులో టీఆర్ఎస్​ క్యాండిడేట్​ భారీగా లిక్కర్​ స్టాక్​ పెట్టి, పంచేందుకు రెడీ చేశారని కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఇన్ఫర్మేషన్​ వచ్చింది. దీంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని షాపును తెరవాలని ఆందోళన చేశారు. పోలీసులు షాపును ఓపెన్​ చేయగా.. 300 కార్టన్ల లిక్కర్​ దొరికింది.

సరూర్ నగర్, రహ్మత్ నగర్, రామచంద్రాపురం, చింతల్, బంజారాహిల్స్, జగద్గిరిగుట్ట సహా గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని చాలా డివిజన్లలో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఆందోళనలకు దిగారు. పలు చోట్ల పోలీసులకు కంప్లైంట్​ చేశారు.

సరూర్ నగర్ డివిజన్ లో టీఆర్ఎస్ క్యాండిడేట్​ అనుచరులు ఓ ఇంట్లో డబ్బు పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న బీజేపీ నేతలు వెళ్లి అడ్డుకున్నారు.

యూసఫ్ గూడ డివిజన్లోనూ పైసలు పంచుతున్న టీఆర్ఎస్ కార్యకర్తలను స్థానికులు అడ్డుకున్నారు.

జగద్గిరిగుట్ట సంజయ్ పురి కాలనీలో నగదు పంచుతున్నవారిని బీజేపీ కార్యకర్తలు పట్టుకుని ఆందోళనకు దిగారు.

రహ్మాత్ నగర్ లో టీఆర్ఎస్​ కార్యకర్తలు డబ్బులు పంచుతుంటే కాంగ్రెస్ నేతలు పట్టుకున్నారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహంతో వారిపై దాడి చేశారు.

అడిక్​మెట్ డివిజన్​లోని వడ్డెర బస్తీలో టీఆర్ఎస్ లీడర్​ మల్లికార్జున్ రెడ్డి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొందరు డబ్బు పంచుతున్నారని బీజేపీ నాయకులకు సమాచారం అందింది. దీంతో వారు వెళ్లి ఆందోళనకు దిగడంతో.. టీఆర్ఎస్​ నేతలు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లోనికి పరుగెత్తారు. బీజేపీ నేతలు తమపై దాడి చేస్తున్నారని టీఆర్ఎస్​ వాళ్లు కంప్లైంట్​ చేయగా.. టీఆర్ఎస్​ డబ్బులు పంచుతున్నారని బీజేపీ లీడర్​ ప్రకాశ్​ గౌడ్, ఇతర నేతలు ఫిర్యాదు చేశారు. అయితే టీఆర్ఎస్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ పోలీస్​స్టేషన్​కు వచ్చి టీఆర్ఎస్​ నేతలతో మాట్లాడారు.

మౌలాలిలో బియ్యం బస్తాల పంపిణీ

మౌలాలి డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ క్యాండిడేట్ ఫాతిమా అమీనుద్దీన్ ఇంటింటికీ బియ్యం పంపిణీ చేస్తున్నారంటూ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఓటర్లకు టోకెన్లు ఇచ్చి, బియ్యం తీసుకుపోవాలని ఆమె సూచించారని స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం బయటికి రావడంతో ప్రతిపక్షాల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ జెండాలకు నిప్పు

హస్తినా పురం డివిజన్ లో టీఆర్ఎస్ క్యాండిడేట్ సీనియర్ కార్యకర్తలను పట్టిం చుకోవడం లేదంటూ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పార్టీ కార్యాలయం ఎదుటే టీఆర్ఎస్ జెండాలను, పాంప్లెట్లను వేసి నిప్పంటించి, ఆందోళన చేశాయి. కాసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆందోళన చేస్తున్నవారిని పంపించారు.