కుక్కల నియంత్రణలో జీహెచ్ఎంసీ ఫెయిల్ : మన్సూరాబాద్ కార్పొరేటర్

కుక్కల నియంత్రణలో జీహెచ్ఎంసీ ఫెయిల్ : మన్సూరాబాద్ కార్పొరేటర్

కుక్కల కుటుంబ నియంత్రణ లో జీహెచ్ఎంసీ సక్రమంగా పనిచేయడం లేదని మన్సూరాబాద్ కార్పొరేటర్ నర్సింహా రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ ట్విట్టర్ ద్వారానే స్పందిస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీలో కుక్కల నియంత్రణలో జీహెచ్ఎంసీ ఫెయిల్ అయ్యిందన్న ఆయన... డాక్టర్లు, సిబ్బంది కొరత ఉందని తెలిపారు. హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని, విశ్వనగరంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం వచ్చి చనిపోతున్నారన్నారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ చాయ్, నీళ్ళకోసమేనా అని ప్రశ్నించారు. అధికారుల బినామీ పేర్లతోనే కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారని నర్సింహా రెడ్డి ఆరోపించారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ లంచాల రూపంలో పోతోందని, కమిషనర్ లోకేష్ కుమార్, మేయర్ డమ్మీలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు డమ్మీలను పెట్టి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ బినామీ సంస్థలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రదీప్ అనే బాలుడి చావుకు కారకులు ఎవరంటూ కార్పొరేటర్ నర్సింహా రెడ్డి ప్రశ్నించారు. అధికారులు, మేయర్ కమిషన్ లకోసమే పనిచేస్తున్నారన్న ఆయన.. సికింద్రాబాద్ ఫెయిర్ యాక్సిడెంట్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని నిలదీశారు. మంత్రి తలసాని తప్ప మరెవరూ ముందుకు రాలేదన్నారు. జోనల్, సర్కిల్ అధికారులు ఏం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. సిటీలో మనుషులకంటే కుక్కలే ఎక్కువగా ఉన్నాయని సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఎన్జీవో సంస్థలకు కుక్కల నిర్వహణ ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ప్రదీప్ కుటుంబాన్ని సర్కారే ఆదుకోవాలని నర్సింహా రెడ్డి డిమాండ్ చేశారు.