ఆదాయం పెంచుకునేందుకు బల్దియా ప్లాన్

 ఆదాయం పెంచుకునేందుకు బల్దియా ప్లాన్
  •     సీడీఎంఏ ప్రతిపాదిత వసూలుకు అసెస్​మెంట్​ఫార్ములా
  •     బల్దియాలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని ఆలోచన
  •     సర్కార్ ఆమోదం తెలిపితే మున్సిపల్​చట్టంలో సవరణలు
  •     ఆ తర్వాత సీడీఎంఏ ప్రతిపాదిత పన్నులు వసూలు షురూ

హైదరాబాద్, వెలుగు: అప్పుల్లో కూరుకుపోయిన బల్దియా ఆదాయం పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఎట్లనైనా రాబట్టాలని వివిధ మార్గాలను ఎంచుకుంటోంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అమలయ్యే సీడీఎంఏ(కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) అసెస్ మెంట్​ఫార్ములాను ఇక్కడ కూడా వర్తింప చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అధికారులు చర్చించినట్లు తెలిసింది. దీన్ని అమలు చేయాలంటే బల్దియాకు చట్ట సవరణ చేసి, ప్రభుత్వం ఓకే చెబితే వెంటనే అమలు చేసుకునే వీలుంటుంది. దీంతో  మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రాపర్టీ ట్యాక్స్​ తరహాలో ఇక్కడ పెంచుకునే అవకాశముంది.  బల్దియాతో  పోలిస్తే ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే ఆస్తి పన్ను ఎక్కువగా ఉంది. ఇక్కడి ఖరీదైన ఏరియాలోని ఇండ్ల​ పన్నులకు సమానంగా ఉంటుంది.  బల్దియా కంటే శివారు కార్పొరేషన్లలో 30 నుంచి 40 శాతం​ వరకు ఫీజులు అధికంగా ఉన్నాయి. ఉదాహరణకు బల్దియాలోని అల్వాల్​సర్కిల్ లోని ఇండ్లకు చదరపు ఫీటుకు రూ.4 నుంచి రూ. 5  పన్ను ఉంది. అదే పక్కనున్న జవహర్ నగర్​ కార్పొరేషన్​లో రూ. 7 నుంచి రూ. 8  వరకు ఆస్తిపన్ను ఉంది.  సీడీఎంఏ ప్రాపర్టీ ట్యాక్స్​ఫీజు చార్జీలను గ్రేటర్​లోనూ అమలు చేస్తే ఆదాయం పెరిగే అవకాశం ఉండగా, దీనిపైనే బల్దియా ఫోకస్​చేసినట్టు సమాచారం. 

ఏరియాను బట్టి ఒక్కో విధంగా.. 

గ్రేటర్ లో  రెసిడెన్షియల్​, కమర్షియల్​, ఓపెన్ ల్యాండ్స్ కేటగిరీల్లో పన్నులు కట్టేవారు మొత్తం17 లక్షల మంది ఉన్నారు.​ఇందులో ఓపెన్ ల్యాండ్లకు మార్కెట్ విలువలో 0.50 శాతం ప్రాపర్టీ ట్యాక్స్ ను ఏటా వసూలు చేసుకుంటుండగా, రెసిడెన్షియల్ భవనాలకు చదరపు ఫీటుకు 60 పైసల నుంచి రూ.1.20  పైసల వరకు, కమర్షియల్ భవనాలకు కనిష్టంగా రూ. 1 నుంచి , గరిష్టంగా  రూ.70 వరకు వసూలు చేస్తోంది. ఏరియాని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా బల్దియా పన్ను వసూలు చేస్తోంది. అధికంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, మాదాపూర్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. పన్ను పెరిగితే ఉదాహరణకు జూబ్లీహిల్స్ లో ఉండే ఒక ఏటీఎంకు ప్రస్తుతం ఏడాదికి రూ.26 వేలు చెల్లిస్తుండగా, పెరిగితే రూ36 నుంచి రూ.38 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇండ్లకు కూడా 30 నుంచి 40 శాతం పెరిగే అవకాశం ఉంటుంది.

అమలు చేస్తే అందరిపైన..

సీడీఎంఏ ఫార్ములాను బల్దియాలో అమలు చేస్తే ప్రాపర్టీ ట్యాక్స్​ అన్ని కేటగిరీల్లో పెరుగుతుంది. ఇది కమర్షియల్, ఓపెన్ ల్యాండ్స్​తో పాటు బస్తీలు, కాలనీల రెసిడెన్షియల్​ఓనర్లపైన కూడా పడుతుంది. ప్రస్తుతం కమర్షియల్​ట్యాక్స్​పేయర్స్ 2.50 లక్షలు, మురికివాడల్లోని 3 లక్షల మంది నిరుపేదలు రూ.101 పన్ను చెల్లిస్తుండగా, మిగతా 12 లక్షలు రెసిన్షియల్​, ఓపెన్ ల్యాండ్స్​ ఓనర్లు ఉన్నారు. పన్ను పెంచితే మురికివాడల్లోని నిరుపేదలకు కాకుండా మిగతా అందరిపైన భారం పడనుంది. 2020–21 ఆర్థిక ఏడాదిలో రూ.1,704 కోట్ల ఆస్తి పన్ను బల్దియా వసూలు చేసింది.  గత ఆర్థిక ఏడాదిలో  రూ.1850 కోట్ల టార్గెట్ గా పెట్టుకోగా  రూ.1,635 కోట్లు వచ్చింది.  ప్రతిఏటా అధికారుల టార్గెట్​పెరుగుతూనే ఉండగా, వసూళ్లలో మాత్రం చేరుకోవడంలేదు.  సీడీఎంఏ పన్నులు వసూలు చేస్తే ఏడాదికి రూ.2,500 కోట్లకుపైగా వచ్చే అవకాశం ఉంది. 

ముందుగా సౌలతులు కల్పించాలి

బల్దియా కౌన్సిల్ ​ఆమోదంతో ఆస్తిపన్ను పెంచుకోవచ్చు.  ప్రభుత్వం చట్ట సవరణతో  సీడీఎంఏ ఫార్ములా ని ఇక్కడ కూడా అమలు చేసుకోవచ్చు. అంతకు ముందు బల్దియా కల్పిస్తున్న సౌలతుల గురించి ఆలోచించాలి. పన్నులు పెంచే ఆలోచన ఉంటే ఆ తరహాలో సదుపాయాలు కల్పించాలి. వాటర్, డ్రైనేజీ, రోడ్లు, నాలాలు ఇలా అన్నింటిపై దృష్టి పెట్టిన తర్వాత పన్ను పెంచినా జనం కడతారు.   ఇప్పుడున్న అన్ని ప్రాపర్టీల నుంచి పన్నులు వసూలు చేస్తే బల్దియాకు అదే పెద్ద ఆదాయం. ఆ విషయంపైన ఫోకస్​ చేయదు. 
- పద్మనాభరెడ్డి, 
ఫోరం ఫర్ గుడ్​ గవర్నెన్స్ సెక్రటరీ