
- ఇంటికే పరిమితమైన కేటీఆర్, హరీశ్‌రావు
- సదర్ ఉత్సవాల్లో కిషన్ రెడ్డి, ప్రైవేట్ కార్యక్రమాల్లో రాంచందర్ రావు
- ఇద్దరు ముగ్గురు మంత్రులదీ అదే తీరు
- బీసీలకు సంఘీభావం తెలిపిన మంత్రి తుమ్మల, జూపల్లి, వివేక్, సీతక్క, అడ్లూరి
హైదరాబాద్, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌తో బీసీ జేఏసీ శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్ కు మూడు ప్రధాన పార్టీల ‘అగ్ర’ నేతలు దూరంగా ఉన్నారు. వీరిలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచందర్ రావు, బీజేఎల్పీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు, కాంగ్రెస్ నుంచి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. బంద్కు సహకరించాలంటూ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్ని పార్టీల్లోని ముఖ్య నేతలను ముందే కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లు న్యాయమైన డిమాండ్అని, తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఆయా నేతలు హామీ ఇచ్చారు. తీరా బంద్‌లో పాల్గొని సంఘీభావం తెలపాల్సిన రోజు రాలేదు. ఇది బీసీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆయా నేతలంతా అగ్రవర్ణాలకు చెందిన వారు కావడం వల్లే బీసీ బంద్కు దూరంగా ఉన్నారనే విమర్శలు బీసీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో హైదరాబాద్‌లో జరిగిన బీసీ బంద్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ పాల్గొని బీసీలకు సంఘీభావం ప్రకటించారు.
సిటీలో ఉన్నా ముందుకు రాలే..!
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు శనివారం హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ బీసీ సంఘాల ఆందోళనలో ఎక్కడా పాల్గొనలేదు. వీరిద్దరూ ఇండ్లకే పరిమితమయ్యారు. కేటీఆర్ కిన్నెర వాయిద్యకారుడు మొగిలయ్యను కలిస్తే, హరీశ్‌రావు ఇంట్లో ఉండి రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు బీఆర్ ఎస్ ‘అగ్ర’ నేతలు జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ ఎస్ నుంచి బీసీ నేతలు ఎంపీ వద్దిరాజు రవించంద్ర, మాజీ మంత్రి గంగుల కమాలకర్, శ్రీనివాస్ గౌడ్ బంద్ లో పాల్గొని.. బీసీలకు సంఘీభావం తెలియజేశారు. జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత బీసీ బంద్కు మద్దతుగా ఖైరతాబాద్ సర్కిల్ లో తన కుమారుడితో కలిసి పాల్గొన్నారు. ఇక, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ సదర్ ఉత్సవాలకే పరిమితమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ బీసీ బంద్ కు దూరంగా ఉన్నారు. స్థానికంగా బాచుపల్లి లో జరిగిన ఓ నూతన షోరూమ్ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. బీజేఎల్పీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ బంద్ లో పాల్గొనలేదు. ఆ పార్టీకి చెందిన బీసీ ఎమ్మెల్యేపాయ ల్ శంకర్మాత్రం బర్కత్‌పురలో జరిగిన బీసీల ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనగా.. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ బంద్కు దూరంగా ఉన్నారు.
పాల్గొన్న బీసీయేతర మంత్రులు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి బీసీ బంద్ లో పాల్గొన్నారు. సాంకేతిక కారణాలతో బీసీ బిల్లును కేంద్రం అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్, కల్వకుర్తి, ఆమన్ గల్ లో నిర్వహించిన బంద్ లో పాల్గొని సంఘీభావం తెలిపారు.