
- మ. 3 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
ఇండోర్: విమెన్స్ వరల్డ్ కప్‌లో రెండు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో పడిన ఇండియా జట్టు.. కీలక పోరుకు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో బలమైన ఇంగ్లండ్‌తో తలపడనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో బౌలింగ్‌పైనే ఎక్కువగా దృష్టి సారించింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాపై 251, 330 రన్స్ చేసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోవడంతో ఇప్పుడు ఆరో బౌలర్ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. బౌలింగ్‌లో మరింత బ్యాలెన్స్ తీసుకురావాలని టీమ్ మేనేజ్‌మెంట్ ప్లాన్స్ రెడీ చేస్తోంది. ఈ వరల్డ్ కప్‌లో ఐదుగురు బ్యాటర్లు, వికెట్ కీపర్, ఐదుగురు బౌలర్ల (ఇందులో ముగ్గురు ఆల్‌రౌండర్లు) స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అయ్యింది.
కానీ సౌతాఫ్రికా, ఆసీస్‌తో మ్యాచ్‌ల్లో ఇది ఘోరంగా బెడిసి కొట్టింది. దీనికి తోడు టాప్ టీమ్స్‌తో తలపడేటప్పుడు బౌలింగ్ వేరియేషన్స్ కూడా ఉండటం లేదు. స్పెషలిస్ట్ బౌలర్ లేకపోవడంతో సౌతాఫ్రికా, ఆసీస్ భారీ స్కోర్లను ఛేదించాయి. ఎక్కువ మందిఆల్‌రౌండర్లతో బ్యాటింగ్ బలం పెరుగుతున్నా.. తుది జట్టులో చోటు లేక పేసర్ రేణుకా సింగ్ బెంచ్‌కే పరిమితమవుతోంది. రేణుకా గైర్హాజరీతో బౌలింగ్ డైమెన్షన్ పూర్తిగా మారిపోతున్నది. దాంతో యంగ్ పేసర్ క్రాంతి గౌడ్ ఒత్తిడిని జయించలేకపోతున్నది. ఇక లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధా యాదవ్, పేసర్ అరుంధతి రెడ్డిలో ఒకర్ని ఆడించడం కూడా మరో ప్రత్యామ్నాయం. ఇండియా టాపార్డర్ బ్యాటింగ్‌పై కూడా ఆందోళన కొనసాగుతోంది. టోర్నీకి ముందు సూపర్ ఫామ్‌లో ఉన్న టాప్ బ్యాటర్లందరూ ఇప్పుడు తేలిపోతున్నారు. ఓపెనర్లలో స్మృతి మంధాన, ప్రతీకా రావల్ మెరుస్తున్నా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రొడ్రిగ్స్ వైఫల్యం టీమ్‌ను వెంటాడుతోంది. మెరుగైనా ఆరంభం లభిస్తున్నా దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోవడం కూడా మైనస్‌గా మారింది. ఆస్ట్రేలియాపై 36 రన్స్ తేడాతో చివరి ఆరు వికెట్లు పడటమే ఇందుకు ఉదాహరణ. మరోవైపు ఇంగ్లండ్ కూడా భారీ విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఇంగ్లండ్ అమ్మాయిలు సెమీఫైనల్ చేరుకుంటారు.