ఆరేండ్లుగా అందుబాటులోకి రాని మోడల్ ​మార్కెట్లు

ఆరేండ్లుగా అందుబాటులోకి రాని మోడల్ ​మార్కెట్లు

సికింద్రాబాద్, వెలుగు: చిరు వ్యాపారుల కోసం జీహెచ్ఎంసీ నిర్మించిన మోడల్​మార్కెట్లు నేటికీ అందుబాటులోకి రాలేదు. అలాట్​చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించినప్పటికీ జనావాసాలకు దూరంగా, అద్దె ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు వాటిలో షాపులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఉప్పల్, కూకట్​పల్లి, మల్కాజిగిరి, ముషీరాబాద్, అంబర్​పేట ప్రాంతాల్లో మోడల్​మార్కెట్లు నిర్మించి ఆరేండ్లవుతోంది. కానీ ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. బిల్డింగులు పూర్తయ్యాక కూడా వ్యాపారులు రోడ్లు, ఫుట్​పాత్​లు మీద అమ్ముకుంటున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్​సమస్య తలెత్తుతోంది. సీఎం కేసీఆర్​ఆదేశాలతో గ్రేటర్ వ్యాప్తంగా 200 మోడల్​మార్కెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు ప్రకటించారు. చెప్పిన ప్రకారం కట్టారా? ఎన్ని కట్టారు? కనీసం కట్టినవి జనాలకు ఉపయోగపడుతున్నాయా? లేదా అనే విషయాన్ని సీఎం కూడా పట్టించుకోలేదు.

డివిజన్​కు ఒకటని ప్రకటన

2016లో సీఎం కేసీఆర్​సికింద్రాబాద్ మోండా మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన టైంలో సిటీలోని మార్కెట్లను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా 200 మోడల్​మార్కెట్లు నిర్మించాలని, అందుకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. 2–3 అంతస్తుల్లో అతి తక్కువ స్థలంలో అన్నిరకాల సదుపాయాలు ఉండేలా ప్లాన్​చేశారు. మొదట విడతలో 165 మార్కెట్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు.119 మార్కెట్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు కాగా అందులో కేవలం 40 నుంచి 50 మార్కెట్లు మాత్రమే పూర్తయ్యాయి. 100 రోజుల ప్లాన్​తో మార్కెట్లు అందుబాటులోకి తెస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ పనులు జరగలేదు. 10 వేల మందికి ఒక మార్కెట్ ఉండాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదన ఉంది. కానీ కోటిన్నర జనాభా ఉన్న సిటీలో కూరగాయల మార్కెట్లు ఉంది30 లోపే. ఇవి కూడా నిర్వాహణ, మౌలిక సదుపాయాలు లేక అస్తవ్యస్తంగా ఉన్నాయి. మార్కెటింగ్ స్థలం, పార్కింగ్ లేక జనం, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.

కేటాయింపులు జరగలే

మొత్తం 40 మార్కెట్లు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కోదానిలో 10 నుంచి 19 షాపులు ఉన్నాయి. కూకట్​పల్లి జోన్​లో 9 మార్కెట్లు ప్రతిపాదించగా 8 మార్కెట్లు పూర్తయ్యాయి. వీటిలో ఒక్క షాపును కూడా కేటాయించలేదు. ఎల్బీనగర్​జోన్​పరిధిలో11 మోడల్ మార్కెట్లుకు గాను 10 పూర్తయ్యాయి. వీటిలోని 3 మార్కెట్లలో కొన్ని షాపులను వ్యాపారులకు కేటాయించారు. ఖైరతాబాద్​జోన్​పరిధిలో మూడు మార్కెట్లు నిర్మించగా ఒక్కదానిలో మాత్రమే షాపులు కేటాయించారు. చార్మినార్​జోన్​పరిధిలో 6 మార్కెట్లు నిర్మించారు. కానీ ఒక్కదానిలోని షాపులనే వ్యాపారులకు ఇచ్చారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో12 మార్కెట్లు ప్రతిపాదించగా 5 మార్కెట్లు పూర్తయ్యాయి. ఇక్కడ కూడా ఒక్కదానిలో మాత్రమే కేటాయింపులు చేశారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో 3 మార్కెట్లు నిర్మించి ఎట్టికి వదిలేశారు. షాపులు ఎవరికీ ఇవ్వలేదు. తార్నాక శాంతినగర్​లో నిర్మించిన మోడల్​మార్కెట్ ను రెండేండ్ల  కింద లాంఛనంగా ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు టెండర్లు పిలవలేదు. అడ్డగుట్టలో మార్కెట్​కు నిధులు మంజూరైనా ఇప్పటివరకు నిర్మించలేదు. మల్లాపూర్ లోనూ ఇదే పరిస్థితి. ఓల్డ్​బోయిన్​పల్లి డివిజన్ హస్మత్​ పేటలో జీ ప్లస్ టుగా నిర్మించిన మోడల్​మార్కెట్​కు కరెంటు సప్లై చేసేందుకు ట్రాన్స్​ఫార్మర్​ఏర్పాటు చేయలేదు. మల్లాపూర్​ మాడల్​ మార్కెట్​ మంజూరు అయినా ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టలేదు. ఉప్పల్​లో 4 ప్రతిపాదించగా రెండు మాత్రమే పూర్తి చేశారు. వాటిలోని షాపులకు రెండు సార్లు టెండర్లు పిచినా ఎవరూ ముందుకు రాలేదు. కారణం జనావాసాలకు దూరంగా, రెంట్లు ఎక్కువగా ఉండటమే. పాటిగడ్డ, భరత్ గర్, ఎల్బీనగర్, చింతల్, కూకట్​పల్లి, చార్మినార్ మార్కెట్లు అందుబాటులోకి రాగా వీటిలో కొన్నిషాపులు మాత్రమే రన్ అవుతున్నాయి.

అన్ని హంగులతో నిర్మాణం

సిటీలో ఇప్పటివరకు మొత్తం రూ.20 కోట్లు ఖర్చు చేసి మోడల్ మార్కెట్లు నిర్మించారు. అన్ని రకాల వసతులతో షాపులు ఏర్పాటు చేశారు. పార్కింగ్, టాయిలెట్స్ పెట్టారు. గ్రౌండ్ ఫ్లోర్​లో కూరగాయలు, తినుబండారాలు, ఫార్మసీ, ఏటీఎంలు, టాయిలెట్లకు, ఫస్ట్​ఫ్లోర్​లో నాన్​వెజ్, గ్రోసరీ, డ్రై ఫ్రూట్స్, పప్పు దినుసుల షాపులకు కేటాయించాలని నిర్ణయించారు. కానీ జనావాసాలకు దూరంగా ఉండటంతో  నిర్మాణం పూర్తయిన మోడల్ మార్కెట్లు కూడా ఖాళీగా దర్శమిస్తున్నాయి. కొన్నిచోట్ల ఎన్నిసార్లు వేలం వేసినా వ్యాపారాలు ముందుకు రావడం లేదు.

రెంట్​ మరీ ఎక్కువగా ఉంది

తార్నాక డివిజన్ శాంతినగర్​లో మార్కెట్ ని ర్మించి నాలుగేండ్లు అయింది. షాపుల కోసం దరఖాస్తు చేసుకున్నాం. అయితే రెంట్లు అధి కంగా ఉన్నాయి. దీంతో రెండేండ్లుగా ఎవరూ చేరడం లేదు. రోడ్లపై వ్యాపారం చేయడం ఇబ్బందిగా ఉంది. డైలీ సామాన్లు మోసుకుని వెళ్లి సంతల్లో విక్రయించాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు అద్దెలు తగ్గించి షాపులు కేటాయిస్తే బాగుంటుంది.
 - చంద్రశేఖర్, చిరువ్యాపారి, తార్నాక

అంగన్​వాడీ సెంటర్లు,బస్తీ దవాఖానలు పెడ్తున్నం

తార్నాక డివిజన్​శాంతినగర్​లో నిర్మించిన మోడల్​మార్కెట్​కు టెండర్లు పిలిచాం. అయితే దక్కించుకున్నవారిలో కొద్ది మంది మాత్రమే వ్యాపారం చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. దీంతో షాపుల కేటాయించలేదు. సిటీలోని చాలా చోట్ల ఇదే సమస్య ఉంది. అందుకు ఖాళీగా ఉన్నాయి. ఎక్కువ కాలం అలాగే ఉంటే బిల్డింగ్స్​పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటిలో అంగన్​వాడీ సెంటర్లు, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. తార్నాక మోడల్​మార్కెట్​లో అంగన్​వాడీ కేంద్రం పెట్టాలని చూస్తున్నాం. 
 - దశరథ్, సికింద్రాబాద్​ సర్కిల్ ,డిప్యూటీ కమిషనర్