కమిషనర్ కర్ణన్ దూకుడు.. వచ్చీ రాగానే ఫీల్డ్​ విజిట్లు.. అధికారులతో సమావేశాలు

కమిషనర్ కర్ణన్ దూకుడు..  వచ్చీ రాగానే ఫీల్డ్​ విజిట్లు.. అధికారులతో సమావేశాలు
  • ఉదయం 5.30 గంటలకే జోనల్ కమిషనర్లు, సర్కిల్ ఆఫీసర్లు ఫీల్డ్​లో ఉండాలని ఆదేశం
  • లేకపోతే జడ్సీలు కారణాలు చెప్పాల్సిందేనని ఆర్డర్​ 
  • 6.30 గంటల్లోపు అటెండెన్స్ పూర్తి చేయాలని ఆదేశాలు
  • శాఖల వారీగా అధికారులు, సిబ్బంది పనితీరుపై ఆరా 

హైదరాబాద్ సిటీ/ఎల్బీనగర్, వెలుగు: జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ కర్ణన్ అప్పుడే దూకుడు పెంచారు. ఫీల్డ్ విజిట్లతోపాటు అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు. గురువారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో అధికారులంతా ఉదయం 5.30 గంటల నుంచే ఫీల్డ్ లో ఉండాలని, జోనల్ కమిషనర్లు, సర్కిల్ స్థాయి డిప్యూటీ కమిషనర్లు సహా ఇతర అధికారులందరికీ ఇది వర్తిస్తుందని తేల్చిచెప్పారు. 

జోనల్ అధికారులు అందుబాటులో లేకపోతే ఎందుకు ఉండడం లేదో తనకు కారణాలు చెప్పాలని, సర్కిల్ స్థాయి అధికారులైతే జోనల్ కమిషనర్లకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 6.30 గంటల లోపు జోనల్ కమిషనర్ల నుంచి మొదలుపెడితే సర్కిల్ స్థాయి అధికారుల అటెండెన్స్ పూర్తి చేయాలని కంట్రోల్ రూమ్ అధికారులకు ఆర్డర్స్​ఇచ్చారు.  

తెల్లవారుజామునే ఫీల్డ్​లో ఎందుకంటే..

ఉన్నతాధికారులు తెల్లవారుజామున ఫీల్డ్ లో ఉంటే కింది స్థాయి అధికారులు, సిబ్బంది పనులను వేగంగా చేస్తారని కర్ణన్​అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నగరంలో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోతోంది. దీన్ని సీరియస్​గా తీసుకోవాలని కమిషనర్​అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. 

గురువారం బండ్లగూడలోని పలు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ ఒకచోట చెత్త పేరుకుపోవడం చూసి వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. దీనికి పరిష్కారం అధికారులు తెల్లవారుజామున ఫీల్డ్ లో ఉండడమేనని ఆయన నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 15 రోజులు చూసి ఫీల్డ్ లోకి రాని ఆఫీసర్లపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.  

త్వరలో ఆకస్మిక తనిఖీలు 

జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్​మొదలుకుని, జోనల్, సర్కిల్ ఆఫీసుల వరకు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు? ఎప్పటి నుంచి ఉన్నారు? వారి పనితీరు.. ఇలా అన్ని విషయాలను కమిషనర్​కర్ణన్​ఆరా తీస్తున్నారు. ఎక్కువకాలంగా ఉంటూ పనితీరు బాగాలేనట్టయితే అక్కడి నుంచి తప్పించి పని చేసేవారిని పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఫీల్డ్​విజిట్లతో పాటు ఆఫీసును ఆకస్మిక తనిఖీ చేయబోతున్నట్టు తెలిసింది.

వానా కాలంలో గా పూర్తవ్వాలి:  కర్ణన్​

అసంపూర్తిగా ఉన్న నాలాలు, స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కమిషనర్​కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ తో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. నాగోల్ సాయినగర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు కొనసాగుతున్న స్టార్మ్ వాటర్ బాక్స్ డ్రెయిన్ పనులు, ఉప్పల్ ఎస్ఆర్డీపీ నేషనల్ హైవే ఫ్లైఓవర్ పనులను, ఎల్బీనగర్ బైరామల్ గూడ ఫ్లైఓవర్ కింద బ్లాక్ లో క్రీడలను ప్రోత్సహించేందుకు చేపట్టిన పనులు పరిశీలించారు. 

స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, నాలాల పనులను వానా కాలానికి ముందే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఉప్పల్ చౌరస్తా వద్ద ఎస్ఆర్డీపీ ఫ్లైఓవర్ పనుల ఆలస్యానికి గల కారణాలు తెలుసుకున్నారు. హయత్ నగర్, ఉప్పల్ డిప్యూటీ కమిషనర్లు తిప్పర్తి యాదయ్య, ఆంజనేయులు, ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ ఈఈలు ఉన్నారు.