బంజారాహిల్స్​లో.. ప్రజా పాలనకు ఏర్పాట్లు పూర్తి

బంజారాహిల్స్​లో.. ప్రజా పాలనకు ఏర్పాట్లు పూర్తి
  •     బంజారాహిల్స్​లో ప్రారంభించనున్న మంత్రి పొన్నం
  •      గ్రేటర్​లో మొత్తం 150 డివిజన్లలో 600 కౌంటర్లు
  •     30 సర్కిళ్లకు ప్రత్యేక అధికారులు, వలంటీర్లు

హైదరాబాద్,వెలుగు : ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం 8 గంటలకు బంజారాహిల్స్​లోని వార్డు నం.12లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రజా పాలన ప్రోగ్రామ్ నేపథ్యంలో బుధవారం ఇంటింటికి దరఖాస్తులను పంపిణీ ప్రారంభించారు.  గ్రేటర్​లోని 150 వార్డుల్లో మొత్తం 600 కౌంటర్ల ద్వారా అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఒక్కో వార్డులో 4 కౌంటర్లను ఏర్పాటు చేస్తుండగా, ఒక టీమ్ లీడర్​తో పాటు ఏడుగురు సిబ్బంది ఉండనున్నారు. 

రేషన్ కార్డుకు మరో కౌంటర్​ను ప్రత్యేకంగా  ఏర్పాటు చేస్తుండగా.. దరఖాస్తు ఫామ్ నింపడం, ఇతర వివరాలకు ప్రత్యేకంగా వలంటీర్లను నియమించారు. ప్రతివార్డులో ఒక్కో రోజు ఒక్కో చోట దరఖాస్తులను తీసుకుంటారు. 30 సర్కిళ్లకు కేటాయించిన ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. అర్జీదారుడి నుంచి దరఖాస్తు తీసుకొని వెంటనే రశీదు అందజేస్తామని కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. వచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్​లో ఎంట్రీ చేస్తామన్నారు. అర్జీదారుడి పేరు, అడ్రెస్, మొబైల్ నంబర్​ను రిజిస్టర్​లో రాస్తామన్నారు. కౌంటర్ల వద్ద తాగునీరు, షామియానా, అవసరమైన చోట కుర్చీలు ఏర్పాటు చేయాలని గ్రౌండ్ లెవెల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కమిషనర్ తెలిపారు. అయితే

అన్ని ఏర్పాట్లపై రోనాల్డ్ రాస్ వరుస సమావేశాలు నిర్వహించినా, ప్రోగ్రామ్ తొలి రోజు అందుబాటులో ఉండడం లేదు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి పిలుపు రావడంతో ఆయన గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. మొదటి రోజు ప్రత్యేక అధికారులే పర్యవేక్షణ చేయనున్నారు. 

వాటర్ బోర్డు ఆధ్వర్యంలో తాగునీరు

ప్రజాపాలన ప్రోగ్రామ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో దరఖాస్తులు స్వీకరించే కౌంటర్ల వద్ద వాటర్​బోర్డు అధికారులు తాగునీటిని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. భారీ సంఖ్యలో జనం తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి తాగునీటి సదుపాయాన్ని కల్పించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి సంబంధిత జనరల్ మేనేజర్లను ఆదేశించారు.  జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.