
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న కేబీఆర్ పార్క్ దగ్గర అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించింది జీహెచ్ఎంసీ. మంగళవారం ( జులై 15 ) కేబీఆర్ పార్క్ గేట్ నంబర్ 3 దగ్గర అక్రమంగా నిర్మించి నిర్వహిస్తున్న ఫుడ్ కోర్టును తొలగించారు అధికారులు. గేట్ నంబర్ 2 దగ్గర ఉన్న కాసా డీ లట్టే, గేట్ నంబర్ 3 దగ్గర ఉన్న చిచాస్ రెస్టారెంట్ లను సీజ్ చేశారు అధికారులు. ఎలాంటి ట్యాక్స్ లు కట్టకుండా నిర్వహిస్తున్న రెస్టారెంట్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు.
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహించినా సహించేది లేదని... కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ సిటీలో ఫుట్ పాత్ లపై ఆక్రమణలతో పాదచారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు.
గ్రేటర్‌లోని ఫుట్ పాత్లపై ఎక్కడా నడవలేని పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల ఫుట్‌పాత్‌లు కనుమరుగవుతున్నాయి. గ్రేటర్ లో 9,013 కిలోమీటర్ల మేర రోడ్లుండగా, 430 కిలోమీటర్లు ఫుట్ పాత్ లు ఉన్నాయి. అయినా, ఒకటి, రెండు ప్రాంతాల్లో మినహా ఎక్కడా 100 మీటర్లు ఫుట్‌పాత్‌పై నడవలేని పరిస్థితి నెలకొంది.
గతంలో ఫుట్ పాత్ ల ఆక్రమణ, నిర్వహణపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో డ్యామేజ్అయిన కొన్నిచోట్ల రిపేర్లు చేసి కోర్టుకి ఫొటోలు సమర్పించి చేతులు దులుపుకున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. కాంప్రెన్సీవ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) కింద మెయిన్‌రోడ్ల మెయింటనెన్స్కాలపరిమితి పూర్తి కావడంతో ఇప్పుడు ఫుట్‌పాత్‌ల నిర్వహణ జీహెచ్ఎంసీనే చేయాల్సి వస్తోంది. దీంతో రోడ్లతో పాటు ఫుట్‌పాత్‌లనూ పట్టించుకోవడంలేదు.