- ‘వన్ టైమ్ స్కీమ్’ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన
- స్వచ్ఛ , స్వీపింగ్, ఫాగింగ్ వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్
- కమిటీలో 18 అంశాలు, 6 టేబుల్ ఐటమ్స్‌కు ఆమోదం
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో18 అంశాలతో పాటు 6 టేబుల్ ఐటమ్ లకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఇందులో ప్రదానంగా కూకట్ పల్లి జోన్ లోని కేపీహెచ్ బీ ఫోర్ల్ ఫేజ్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో కొంత భాగాన్ని జీహెచ్ఎంసీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ కోసం కేటాయించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే 2025–-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘వన్ టైమ్ స్కీమ్’ కోసం ఉత్తర్వులు జారీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపేందుకు ఆమోదించారు.
అలాగే, ఈ ఆర్థిక సంవత్సరానికి రోడ్లను డెవలప్ చేసేందుకు ‘ప్రధాన రోడ్ల అభివృద్ధి’ పథకం కింద అదనంగా ఖర్చు చేసేందుకు ప్రభుత్వ అనుమతి పొందేందుకు ఆమోదించారు. బల్కంపేట టెంపుల్ రోడ్ నుంచి సనత్‌నగర్ వరకు ఉన్న ఫతేనగర్ ఫ్లైఓవర్ పునరుద్ధరణ పనులకు పరిపాలనా ఆమోదం రాటిఫికేషన్ కోసం అనుమతించింది. ఖైరతాబాద్ జోన్‌లోని 10 స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్వహణ, కార్యకలాపాల కోసం టెండర్లను ఆహ్వానించేందుకు సభ్యులు అనుమతించారు.
శేరిలింగంపల్లిలోని ఖాజాగూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను రిపేర్లు, నిర్వహణ కోసం ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ వరకు పర్యాటక ప్రాంతాల పరిశుభ్రత, సంరక్షణ కోసం మూడేండ్ల అవుట్‌సోర్సింగ్ ప్రాజెక్టును నిర్వహించేందుకు ఎక్సోరా సంస్థను నియమించడానికి అనుమతించారు. పలు రోడ్ల వైడెనింగ్ తో పాటు ఫ్లో ఓవర్ల నిర్మాణానికి సంబంధించి 141 ఆస్తుల సేకరణకు కమిటీ సభ్యులు ఆమోదించారు. వీటితో పాటు మరిన్ని అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
ల్యాబ్ ఏర్పాటు తర్వాత తనిఖీలు ముమ్మరం...
రూ. 5 కోట్ల వ్యయంతో కేపీహెచ్ బీలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లో శ్యాంపిల్స్ పరీక్షలు త్వరగా పూర్తి చేసి, వీలైనంత త్వరగా రిపోర్టులు వచ్చే విధంగా అత్యాధునిక మెషినరీని వినియోగించనున్నారు. కల్తీ, కుళ్లిన ఆహారంతో పాటు కాలం చెల్లిన సరుకులతో తయారు చేసిన ఫుడ్ శ్యాంపిల్స్ రిపోర్టులు 48 గంటల్లో వచ్చేలా ఫుడ్ టెస్టింగ్ కోసం ప్రపంచ స్థాయి టెక్నాలజీతో తయారు చేసిన మెషినరీ ఏర్పాటు చేయనున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ఫుడ్ శ్యాంపిల్స్ పరీక్షలకు నాచారంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ (ఎన్ఐఎన్) మాత్రమే ఉండడంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పంపిన శ్యాంపిల్స్ కి నెలలు గడుస్తున్నా రిపోర్టులు రావడం లేదు. దీంతో చర్యలు తీసుకోలేకపోతున్నారు. జోన్ కి ఒకటి చొప్పున ఆరు ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ, ముందుగా కూకట్ పల్లి జోన్ లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు శ్యాంపిళ్లను కూడా ఎక్కువ సంఖ్యలో లిఫ్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఆ వాహనాలపై నిఘా
స్టాండింగ్ కమిటీలో ఆరు టేబుల్ ఐటమ్(అప్పటికప్పుడే తీసుకునే నిర్ణయాలు)లకు సభ్యులు ఆమోదించారు. అబిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని 56 సెల్లార్ దుకాణాల కోసం టెండర్ ప్రక్రియను ప్రారంభించేందుకు ఆమోదించారు. కుత్బుల్లా పూర్ సర్కిల్ ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ లీజ్‌ను మరో మూడేండ్లకు పొడిగించేందుకు ఓకే చెప్పారు. జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటోలు, స్వీపింగ్ వాహనాలు, ఫాగింగ్ వాహనాలు తదితర వాటి పనితీరుపై నిఘా పెట్టేందుకు జీపీఎస్ఆధారిత ‘వెహికిల్ ట్రాకింగ్ సిస్టం’ ఏర్పాటు చేసి నిర్వహించేందుకు సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేయడానికి ఆమోదించారు.
ఫిర్యాదుల నిర్వహణ కోసం 50 సీట్ల ఇన్‌బౌండ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడంతోపాటు కాల్ సెంటర్ సర్వర్ మౌలిక వసతులను కల్పించేందుకు ఆమోదించారు. గెలీలియో నగర్ (కాప్రా సర్కిల్–1)లోని ఓపెన్ స్పేస్‌లో స్పోర్ట్స్ అరినా అభివృద్ధి చేయడంతో పాటు జీహెచ్ఎంసీ చట్టం సంబంధిత సెక్షన్ ప్రకారం, జీహెచ్ఎంసీ హిల్ లాక్ భూములను ఆస్తుల యజమానుల ఒప్పందంతో అందరికి అనుకూలంగా మార్చుకోడానికి ఆమోదించారు.
