జీహెచ్ఎంసీ అప్పులు రూ.6 వేల 238 కోట్లు

జీహెచ్ఎంసీ అప్పులు రూ.6 వేల 238 కోట్లు

హైదరాబాద్, వెలుగు:  బల్దియా రూ.6,238 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలోనూ బల్దియా అప్పులను చూపింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ హామీతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీబీ) ద్వారా రూ.1,332 కోట్లు లోన్లుగా తీసుకోగా,  ప్రభుత్వ హామీ లేకుండా నేరుగా బల్దియా రూ.4,906 కోట్లు అప్పులు చేసినట్లు పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మిగులు బడ్జెట్​తో ఉన్న బల్దియా తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.6 వేల కోట్ల అప్పుల్లో పడింది.

 స్ట్రాటజిక్ ​రోడ్​ డెవలప్​మెంట్​ప్రోగ్రామ్(ఎస్ఆర్​డీపీ) కోసం ఎస్​బీఐ వద్ద 8.65 శాతం వడ్డీ కింద రూ.2,500 కోట్లు, కాంప్రెన్సివ్​ రోడ్​మెయింటెనెన్స్ ​ప్రోగ్రామ్(సీఆర్​ఎంపీ) కోసం 7.20 శాతం వడ్డీతో రూ.1, 460 కోట్లు, మరోసారి ఎస్ఆర్డీపీ పనులకు బాండ్ల ద్వారా రూ. 490 కోట్లు (8.90 శాతం వడ్డితో రూ.200 కోట్లు, 9.38శాతం వడ్డీతో 190 కోట్లు, 10.23 శాతం వడ్డీతో రూ.100 కోట్లు) తీసుకుంది. హడ్కో ద్వారా వాంబే హౌసింగ్​ స్కీమ్ కింద రూ.140 కోట్లను తీసుకోగా.. ఇందులో రూ.100 కోట్లకు 10.15 శాతం, రూ.40 కోట్లకు 9.90 శాతం వడ్డీ చొప్పున చెల్లిస్తుంది. వీటితో పాటు గతేడాది ఆగస్టు తర్వాత నాలాల పనులకు మిగతా నిధులను కూడా అప్పుగా తీసుకుంది. వీటికి సంబంధించి ఏడాదికి రూ.400కోట్లకిపైగా వడ్డీ కడుతోంది. 

వాటర్ బోర్డు, మెట్రో కూడా..

వాటర్ బోర్డు, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్) సంస్థలు కూడా అప్పులు చేశాయి. వివిధ పనులకు లోన్లు తీసుకోగా ఇందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీబీ)ద్వారా  వాటర్ బోర్డు రూ.2,352 కోట్లు, మెట్రో రైల్ సంస్థ రూ.286 కోట్లు అప్పులు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ హామీతో ప్రభుత్వమే చెల్లించే విధంగా ఆ సంస్థలు లోన్లు పొందాయి. 

బడ్జెట్ కేటాయింపులు ఇలా..

ఎనిమిదేళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బల్దియాకు నయా పైసా ఇవ్వలేదు. పేరుకే రాష్ట్ర బడ్జెట్​లో బల్దియాకు కేటాయింపులు చేసినా.. చివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. 2014–15 బడ్జెట్​లో బల్దియాకు రూ.3,75.93 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.288.14 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2015–16 లో రూ.428 కోట్లలో రూ.23 కోట్లు ఇచ్చి సరిపెట్టింది. 2016–17లో రూ.70.30 కోట్లకు రూ.1.32 కోట్లే ఇచ్చింది. 2017–18 బడ్జెట్​లో ప్రణాళికేతర నిధుల కింద రూ.67.28 కోట్లు కేటాయించినా ఒక్క పైసా విడుదల చేయలేదు. 2018–19, 2019–20 బడ్జెట్లలో అసలు నిధులే కేటాయించలేదు. 2020–21 బడ్జెట్​లో సిటీ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం అందులో బల్దియాకు  కేవలం రూ.17 కోట్లు మాత్రమే అందించింది. 2021–22 లో రూపాయి కూడా కేటాయించలేదు. 2022–23 లో కూడా రూ.2,500 కోట్ల నిధులు కావాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసినా నిధులు ఇవ్వలేదు. ఇలా బీఆర్ఎస్​ ప్రభుత్వం బల్దియాకు నిధులు ఇవ్వకపోవడంతో జీహెచ్ఎంసీ అప్పుల పాలైంది.