నూతన పార్లమెంట్‌ భవనం నిర్మించాలనే ప్రతిపాదన పీవీ హయంలోనే వచ్చింది : గులాం నబీ ఆజాద్‌ 

నూతన పార్లమెంట్‌ భవనం నిర్మించాలనే ప్రతిపాదన పీవీ హయంలోనే వచ్చింది : గులాం నబీ ఆజాద్‌ 

పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనుండటాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయంపై డెమోక్రటిక్‌ ప్రోగ్రసివ్‌ ఆజాద్‌ పార్టీ (డీపీఏపీ) చీఫ్‌ గులాం నబీ ఆజాద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

నూతన పార్లమెంట్‌ భవనం నిర్మించాలనే ప్రతిపాదన గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే వచ్చిందని.. కానీ, పలు కారణాల వల్ల అది సాధ్యం కాలేదని గుర్తు చేశారు. కానీ, ఇప్పటికైనా పార్లమెంట్‌ నూతన భవనం నిర్మాణం జరగడం మంచిదేనన్నారు. 

బుధవారం (మే 24న)  గులాం నబీ ఆజాద్ జమ్మూలో మీడియాతో మాట్లాడారు. విపక్షాలు పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు తీసుకున్న నిర్ణయంపై స్పందించారు.  ఈ వ్యవహారంపై తానేమీ మాట్లాడబోనన్నారు.  పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి రావడం, రాకపోవడం అనేది ఆయా పార్టీల ఇష్టమని చెప్పారు. పార్లమెంట్‌ నూతన భవనం నిర్మించాలన్న ఆలోచన 1991-92లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే వచ్చిందని.. అప్పుడు లోక్‌సభ స్పీకర్‌గా శివరాజ్‌ పాటిల్‌ ఉండగా... తాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నానని చెప్పారు. 

భవిష్యత్తులో పార్లమెంట్‌ స్థానాల సంఖ్య పెరిగితే ఎక్కువ మంది ఎంపీలకు సరిపడేలా ఉండాలన్న లక్ష్యంతో సువిశాలంగా నూతన భవన నిర్మాణ ప్రణాళికను ఆ సమయంలోనే రూపొందించి విస్తృతంగా చర్చించామన్నారు. అయితే.. పలు కారణాల రీత్యా ఆ ప్రతిపాదన కోల్డ్‌ స్టోరేజీలోకి వెళ్లిపోయిందన్నారు. 

మే 28న జరిగే పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు 19 రాజకీయ పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. ప్రధాని ప్రారంభిస్తే తాము కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామని తాజాగా ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పారు.