ప్రతిపక్షాలన్నీ కలిసినా లాభం ఉండదు: గులాం నబీ ఆజాద్

ప్రతిపక్షాలన్నీ కలిసినా లాభం ఉండదు: గులాం నబీ ఆజాద్

శ్రీనగర్: వచ్చే ఏడాది జరగబోయే లోక్​సభ ఎన్నికలకు ముందు దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకం అయినా ఎలాంటి లాభం ఉండదని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ అన్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సమావేశానికి తనను పిలవలేదని, వెళ్లట్లేదని చెప్పారు. కొన్ని పార్టీలకు సొంత రాష్ట్రంలోనే బలం ఉందని, వేరే ఏ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలు లేరని అన్నారు. అలాంటప్పుడు పొత్తుల వల్ల బెనిఫిట్ కలుగుతుందని తాను అనుకోవట్లేదన్నారు. బెంగాల్​లో టీఎంసీ, ఏపీలో జగన్​మోహన్​రెడ్డికి సొంత రాష్ట్రాల్లోనే బలం ఉందని, ఈ రెండు పార్టీలు కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకుంటే అదనంగా ఒరిగేదేమీ ఉండదని, గెలిచే సీట్ల సంఖ్య మారదని అన్నారు.

అయితే, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అపొజిషన్ పార్టీలన్నీ ఏకం కావాలని తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం పట్టు కోల్పోయిందన్నారు. ఇంతకుముందు కేంద్ర నాయకత్వమే రాష్ట్రాలను నడిపించిందని, ఇప్పుడు రాష్ట్రాలే కేంద్ర నాయకత్వాన్ని నడిపిస్తున్నాయని గులాం నబీ ఆజాద్ చెప్పారు.