అల్లమెల్లిగడ్డలు పిరమైనయ్.. కిలో రూ.200 పైనే

అల్లమెల్లిగడ్డలు పిరమైనయ్..  కిలో రూ.200 పైనే
  • ఏప్రిల్​లో అల్లం రూ. 80, ఎల్లిగడ్డ 50.. దిగుబడి తగ్గడంతో పెరిగిన రేట్లు 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నయ్. ఇప్పటికే టమాటా ధర భారీగా పెరగ్గా, ఇప్పుడు అల్లమెల్లిగడ్డ కూడా పిరమైనయ్. ప్రస్తుతం టమాటా కిలో రూ.200 ఉండగా, అల్లమెల్లిగడ్డ కిలో రూ.200కు పైనే పలుకుతున్నయ్. కిలో అల్లం రూ.200 నుంచి రూ.250 వరకు ఉండగా, ఎల్లిగడ్డ కిలో రూ.200 నుంచి రూ.220 వరకు ఉంది. అల్లం, వెల్లుల్లి దిగుబడి తగ్గడంతోనే రేట్లు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఎండాకాలంలో అకాల వర్షాలు కురవడంతో అప్పట్లో అల్లం, వెల్లుల్లి పంటలను రైతులు కోయలేదు. ఇప్పుడు కోద్దామంటే వానలు పడుతున్నాయి. వర్షాల సమయంలో పంటలు కోస్తే పాడైపోతాయని, అందుకే రైతులు వేచిచేస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. దీంతో అల్లం, వెల్లుల్లి దిగుబడి తగ్గిందని.. ఇంకొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అటు టమాట, ఇటు అల్లమెల్లిగడ్డ రేట్లు పెరగడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.   

ఏప్రిల్ లో కిలో అల్లం రూ.80 ఉండగా, వెల్లుల్లి రూ.50 ఉంది. రెండూ కలిపి కిలో రూ.100కే ఇచ్చారు. మే నాటికి అల్లం రూ.150కి చేరగా, వెల్లుల్లి రూ.80కి చేరింది. ఆ తర్వాత జూన్ లో అల్లం రూ.180, వెల్లుల్లి రూ.100  నుంచి రూ.120 పలికింది. ఇక జులైలో వెల్లుల్లి సైతం రూ.200కు చేరింది. ప్రస్తుతం అల్లం కిలో రూ.200 నుంచి రూ.250 వరకు ఉండగా, వెల్లుల్లి కిలో రూ.200 నుంచి రూ.220 వరకు ఉంది. మంచి రకం అల్లం, వెల్లుల్లి అయితే రెండూ కలిపి కిలో రూ.450 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. సాధారణ రకమైతే రూ.400కు ఇస్తున్నారు. 

మార్కెట్ లోకి నకిలీ మాల్..  

అల్లమెల్లిగడ్డ రేట్లు పెరగడంతో మార్కెట్ లో నకిలీ మాల్ ఎక్కువైంది. తక్కువ ధరకే అల్లం, వెల్లుల్లి పేస్ట్ అంటూ నకిలీ మాల్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. గల్లీల్లోని దుకాణాల్లో ఊరూపేరూ లేని కంపెనీల ప్రొడక్టులను అమ్ముతున్నారు. అల్లం, వెల్లుల్లి పేస్ట్ డబ్బాలు రూ.10 నుంచి రూ.20కే విక్రయిస్తున్నారు. ఇలాంటి నకిలీ ప్రొడక్టులను తింటే అనారోగ్యం పాలయ్యే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

నగరంలో రోజూ డిమాండ్ 70 టన్నులు.. 

హైదరాబాద్ లో ఉన్న డిమాండ్ కు తగ్గట్టు అల్లం, వెల్లుల్లి సరఫరా కావడం లేదు. నగరానికి ఎక్కువగా జహీరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మహారాష్ట్ర, కర్నాటక నుంచి అల్లం, వెల్లుల్లి సరఫరా అవుతుంది. సిటీలో రోజూ 70 టన్నుల అల్లం, వెల్లుల్లికి డిమాండ్ ఉండగా.. ప్రస్తుతం 50 నుంచి 60 టన్నుల వరకే దిగుమతి అవుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. అదికూడా ఎక్కువ శాతం వేరే రాష్ట్రాల నుంచే వస్తున్నదని, దీంతో ట్రాన్స్ పోర్టు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని అంటున్నారు. అందుకే ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. 

ఇంత రేట్లు ఎప్పుడూ లేవ్.. 

అల్లమెల్లిగడ్డ రేట్లు.. గతంలో ఇంత ఎప్పుడూ లేవ్. డిమాండ్ కి తగట్టు సరఫరా లేకపోవడంతోనే రేట్లు పెరుగుతున్నయ్. మేం జహీరాబాద్ నుంచి అల్లమెల్లిగడ్డ తీ సుకొస్తం. కానీ ఇప్పుడక్కడ దొరకడం లేదు. 

 ఇమ్రాన్, వ్యాపారి, హైదరాబాద్