తిక్క కుదిరింది : రీల్ కోసం డేంజర్ స్టంట్ చేసిన వీళ్లిద్దరూ అరెస్ట్

తిక్క కుదిరింది : రీల్ కోసం డేంజర్ స్టంట్ చేసిన వీళ్లిద్దరూ అరెస్ట్

రీల్ కోసం.. పది అంతస్తుల ఎత్తులో ఉండి డేంజర్ స్టంట్ చేసిన వాళ్లను గుర్తించిన అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు మహారాష్ట్ర పూణె పోలీసులు. అమ్మాయి గాల్లో వేలాడుతూ.. అబ్బాయి చెయ్యి పట్టుకుని ఉండగా.. మరో వ్యక్తి రీల్ చేయటం.. అది సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

ఈ క్రమంలోనే ఈ రీల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. స్టంట్ చేసిన వారిని గుర్తించారు. 27 ఏళ్ల మిహిర్ గాంధీ, 23 ఏళ్ల మీనాక్షిగా గుర్తించారు. వీళ్లిద్దరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఐపీసీ సెక్షన్ 336 కింద కేసు బుక్ చేశారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు వెల్లడించారు పోలీసులు. కోర్టులో నేరం రుజువు అయితే ఆరు నెలల కంటే తక్కువ శిక్షతో జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు పోలీసులు. నేర తీవ్రత తక్కువ స్థాయిది కావటంతో స్టేషన్ బెయిల్ పై పంపించటం జరిగిందని వివరించారు. రీల్ ను షూట్ చేసిన మరో యువకుడు పరారీలో ఉన్నాడని.. అతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు పోలీసులు.

ఈ డేంజర్ స్టంట్ లో అమ్మాయి పట్టుతప్పినట్లయితే.. రోడ్డుపై పడేదని.. అప్పుడు ప్రాణాలకు ముప్పు వచ్చేదని వివరించిన పోలీసులు.. ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని యువతకు వార్నింగ్ ఇచ్చారు. రీల్స్ కోసం.. సోషల్ మీడియాలో వైరల్ కోసం ఎవరూ ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయొద్దని పిలుపునిచ్చారు.