అన్నదమ్ములతో వాకింగ్‌కు వెళ్లిన యువతి కిడ్నాప్‌..

అన్నదమ్ములతో వాకింగ్‌కు వెళ్లిన యువతి కిడ్నాప్‌..

నోయిడా: అన్నదమ్ములతో కలిసి వాకింగ్‌కు వెళ్లిన యువతిని కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. గ్రేటర్ నోయిడాలోని ఎన్‌హెచ్‌91పై ఈ రోజు (గురువారం) తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీనిపై కంప్లైంట్ చేసినా పోలీసులు సరిగా స్పందించలేదంటూ బాధితురాలి కుటుంబసభ్యులు.. కిడ్నాప్‌ జరిగిన స్థలంలో నిరసనకు దిగారు.

గ్రేటర్‌‌ నోయిడాలోని బదల్పూర్‌‌ ఏరియాలో ఉండే 20 ఏండ్ల యువతి, తన ఇద్దరు అన్నదమ్ములు, ఒక సోదరితో కలిసి గురువారం తెల్లవారు జామున వాకింగ్‌కు వెళ్లారు. అయితే కొంత దూరం వెళ్లాక ఎన్‌హెచ్‌91పై కొందరు దుండగులు కారులో వచ్చి.. ఆ యువతిని కిడ్నాప్ చేశారు. దీనిపై తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పోలీసులకు ఆమె కిడ్నాప్‌పై సమాచారం అందించారు. అయితే కొన్ని గంటలు గడిచినా పోలీసులు తమ కంప్లైంట్‌పై స్పందించలేదని, తమ బిడ్డను కాపాడేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపిస్తూ బాధితురాలి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు ఎన్‌హెచ్‌91పై కిడ్నాప్ జరిగిన చోటే ధర్నాకు దిగారు. దీంతో ఆ ఏరియాలో ట్రాఫిక్‌ జామ్ అయింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

తాము దూరదూరంగా నడుస్తుండడం వల్ల తమ సోదరి కిడ్నాప్‌కు గురయ్యిందని ఆ యువతి అన్నదమ్ములు చెప్పారు. తమతో పాటు చిన్న చెల్లెలు నడుస్తోందని, సడన్‌గా వచ్చిన కారులో నుంచి ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని, తాము అడ్డుకోవడంతో పరారయ్యారని అన్నారు. అయితే కొంచెం దూరంలో ఉన్న తమ మరో సోదరిని కిడ్నాపర్లు మొదట వేధించారని, తాము చూసి కాపాడుకునే ప్రయత్నం చేసే లోపే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్పారు.

అయితే ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఐదు టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని సెంట్రల్ నోయిడా డీసీపీ వెల్లడించారు. చుట్టుపక్కల జిల్లాల పోలీసు అధికారులను కూడా అలెర్ట్ చేశామని చెప్పారు.