ఇన్​స్టాలో పరిచయం..ప్రేమ పేరుతో వేధింపులు

ఇన్​స్టాలో పరిచయం..ప్రేమ పేరుతో వేధింపులు
  •  బీ ఫార్మసీ స్టూడెంట్ సూసైడ్
  • నాలుగో అంతస్తు నుంచి దూకిన తేజస్విని
  • సంగారెడ్డి జిల్లా దోమడుగులో ఘటన 

పటాన్ చెరు (గుమ్మడిదల), వెలుగు: బీ ఫార్మసీ చదువుతున్న యువతికి ఇన్​స్టాగ్రామ్​లో ఓ యువకుడు పరిచయమయ్యాడు..తర్వాత  ప్రేమించమన్నాడు..వెంటపడ్డాడు.. కాదన్నందుకు వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు ఎక్కువవ్వడంతో యువతి బిల్డింగ్ నాలుగో అంతస్తు పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో ఈ ఘటన శుక్రవారం జరిగింది.

 జిన్నారం సీఐ సుధీర్ కుమార్ కథనం ప్రకారం...దోమడుగుకు చెందిన బీ ఫార్మసీ స్టూడెంట్ తేజస్విని (21)తో అదే గ్రామానికి చెందిన శ్రీహరి ఇన్​స్టాగ్రామ్​లో 5 నెలల  క్రితం పరిచయమయ్యాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ చాటింగ్ కొనసాగుతోంది. కొద్ది రోజులుగా ప్రేమిస్తున్నాంటూ తేజస్వినిని శ్రీహరి వేధించడం మొదలుపెట్టాడు. పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. విషయం పెద్దల దృష్టికి వెళ్లడంతో పంచాయితీ పెట్టినా వేధింపులు ఆగ‌‌లేదు. 

శ్రీహరి వేధింపులు ఎక్కువవ్వడంతో మనస్తాపానికి గురైన తేజస్విని గురువారం రాత్రి తాను ఉంటున్న బిల్డింగ్ నాల్గో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు సురారంలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్టు అక్కడి డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు న‌‌మోదు చేసుకుని ద‌‌ర్యాప్తు చేపట్టారు. కాగా, ఆత్మహత్యకు గ్రామంలోని గంజాయ్ బ్యాచ్ కారణమని బంధువులు ఆందోళ‌‌న‌‌కు దిగారు. 

అక్కడికి వచ్చిన పోలీసుల సమక్షంలో యువతి తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆందోళన చేశారు. శ్రీహరి జులాయిగా తిరుగుతూ తరచూ అమ్మాయిలను వేధించేవాడని ఆరోపించారు. బాధిత కుటుంబసభ్యులకు సీఐ నచ్చజెప్పి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్ రెడ్డితో కలిసి సమాచారం సేకరించి దర్యాప్తును చేస్తున్నట్టు సీఐ తెలిపారు.