ఆడపిల్లలు పుట్టారని…భార్యా బిడ్డలను అమ్మేశాడు

ఆడపిల్లలు పుట్టారని…భార్యా బిడ్డలను అమ్మేశాడు

ఆడపిల్లలు పుట్టారని రూ.3 లక్షలకు భార్యాపిల్లలతో పాటు ఇంటిని అమ్మేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పౌరహక్కుల ప్రజా సంఘం (పీయూసీఎల్ ) ప్రధానకార్యదర్శి జయ వింధ్యా ల కోరారు. బాధితురాలు ఇజరత్ పర్వీన్ తో కలసి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ‘చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని నూరినగర్ లో ఉండే ఫజల్ రెహ్మాన్,ఇజరత్ పర్వీన్ ను రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు . కొడుకు పుట్టలేదని అత్తమామలు, భర్త కలిసి వేధించారు. షాద్ నగర్ లో పని కోసం వెళ్లిన రెహ్మాన్ మూడు నెలలుగా కనిపించడం లేదు. మూడు రోజుల క్రితం బేగంపేటకు చెందిన సర్ఫరాజ్ ఖాన్, అంజద్ ఖాన్ తోపాటు మరో వ్యక్తి తో వచ్చి నిన్ను, నీ పిల్లలను, ఇల్లును నీ భర్త మూడు లక్షలు అమ్మేశాడని, తీసుకెళ్లేం దుకు వచ్చాం ’అని చెప్పడంతో ఆమె పెద్దగా కేకలు వేసింది. చుట్టు పక్కల ఉన్నవాళ్లు రావడంతో పరారయ్యారు. ఈ ఘటనపై స్థానికుల సాయంతో ఆమె చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ఇలా ఎంతోమంది నిరుపేద మహిళలకు అన్యాయం జరుగుతున్నా పోలీసులు రక్షణ కల్పించడం లేదు. న్యాయం చేయడంలో అలసత్వం వహిస్తున్నారు . వెంటనే బాధితురాలి భర్త రెహ్మాన్ తోపాటు తనను కొనుగోలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి” అని కోరారు.