గురుకులాల్లో రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వండి: హైకోర్టు నోటీసులు

గురుకులాల్లో రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వండి: హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో నియామకాలకు సంబంధించి హైకోర్టు నోటీసులకు కౌంటర్​ దాఖలు చేయాలని నియామక బోర్డును గురుకుల సంస్థ ఆదేశించింది. గురుకులాల్లోని బోధనా సిబ్బంది రిక్రూట్​మెంట్​లో మహిళా రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేస్తున్నారో చెప్పాలంటూ ప్రభుత్వంతోపాటు బోర్టుకు  ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.  గురుకులాల్లోని 3,026 పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల బోర్డు నోటిఫికేషన్‌‌ ఇచ్చింది.  నియామక బోర్డు ఏప్రిల్‌‌ 5న జారీ చేసిన ఐదు నోటిఫికేషన్లపై కె.శ్రీను మరొకరు దాఖలుచేసిన పిటిషన్లపై జస్టిస్‌‌ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌‌ లాయర్‌‌ ఎస్‌‌. చంద్రయ్య వాదిస్తూ.. నియామకాల్లో మహిళ, వికలాంగుల, ఎక్స్‌‌ సర్వీస్‌‌ మెన్‌‌ తదితర రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయకుండా వర్టికల్‌‌గా చేయడం వ్యతిరేకమన్నారు. వర్టికల్‌‌ రిజర్వేషన్ల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఐదు నోటిఫికేషన్లకు సంబంధించిన పోస్టుల భర్తీలో రాజేష్‌‌ కుమార్‌‌ దారియా వర్సెస్‌‌ రాజస్థాన్‌‌ పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కౌంటర్‌‌ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. విచారణను అక్టోబర్‌‌ 16కి వాయిదా వేసింది.