
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలోని కీలక అంశాలను పోలీసులు బయటపెట్టారు.
బీఆర్ఎస్ అవసరాల కోసం నిధులు సమీకరణకు సహకరించాలని కూడా తమకు ఆదేశాలున్నాయని కస్టడీ విచారణలో భాగంగా భుజంగరావు దర్యాప్తు బృందానికి వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి వచ్చే ఆదేశాలను ప్రభాకర్ రావు ద్వారా తమకు అందేవని . రాధాకిషన్ రావుకు సిటీలోని ప్రైవేట్ కంపెనీలు, బిజినెస్ వ్యక్తుల సివిల్ సెటిల్ మెంట్లపై మంచి అవగాహన ఉందని చెప్పారు. అందుకే నిధుల సమీకరణ విషయంలో ఆయన కీలకంగా పనిచేసేవాడు. రాధాకిషన్ రావు ప్రతిమ, యశోద హాస్పిటల్ యాజమాన్యాలతో సమన్వయం చేస్తూ టాస్క్ ఫోర్స్ ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థుల డబ్బును చేయవేయడంలో కీలకంగా పనిచేశాడన్నారు.
సైబరాబాద్ లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు, అతని భాగస్వాములతో తన ఆఫీస్ లో తానే మాట్లాడాను. ఏ గొడవలు లేకుండా ఉండడానికి బీఆర్ఎస్ కు 15 కోట్లు ఫండ్ ఇవ్వడానికి శ్రీధర్ రావు ఒప్పుకున్నాడని. 13 కోట్లను బీఆర్ఎస్ కు ఎలక్టొరల్ బాండ్లతో చెల్లించాడని. ప్రభాకర్ రావు బంధువైన రవీందర్ రావుతో శ్రీధర్ రావుకు గొడవలు ఉండడం వల్ల అతని యాక్టివిటీపై ప్రణీత్ రావు నిఘా పూర్తిగా ఉండేదన్నారు. బీఆర్ఎస్ కు ఫండ్ ఇచ్చిన తర్వాత కూడా శ్రీధర్ రావుకు కేసులు వెంటాడడానికి కారణం ప్రభాకర్ రావు వ్యక్తిగత జోక్యం వల్లేనని చెప్పారు భుంజగరావు.
ప్రభాకర్ రావు తరచూ తనతో మాట్లాడేవాడని తనకు తెలిసిన సమాచారాన్ని బట్టి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న బీఆర్ఎస్ నేత శంభీపూర్ రాజు, కడియంతో గొడవలున్న టి.రాజయ్య, తాండూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న పట్నం దంపతులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల క్రిష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అందరీ మీదా, ఎన్టీవీ చౌదరి, ఏబీఎన్ రాధాక్రిష్ణ, జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ నేత జువ్వాడి నర్సింగరావు, అచ్చంపేట వంశీక్రిష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంపీ అర్వింద్ కు చెందిన స్టాఫ్, ఈటల రాజేందర్, బండి సంజయ్, చాలామంది బిజినెస్ మెన్, రియల్టర్ల పైనా నిఘా పెట్టినట్లు తనకు తెలిసిందన్నారు.
ట్యాపింగ్ నిఘా భయంతో చాలామంది లీడర్లు, జ్యూడీషియరీ వ్యక్తులు, అధికారులు వాట్సాప్, సిగ్నల్, స్నాప్ చాట్ లాంటివి వాడడం మొదలుపెట్టారని.. దీంతో ఐడీడీఆర్ ను ట్రాక్ చేసి ఆ డేటా ను కూడా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు టీమ్ సేకరించిందని తెలిపారు భుజంగరావు.