కౌలు రైతులకు 'రైతు బంధు' ఇవ్వాలి

కౌలు రైతులకు 'రైతు బంధు' ఇవ్వాలి
  • ప్రధాన మంత్రి ఫసల్ భీమా అమలు చేయాలి
  • మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కౌలు రైతులకు కూడా 'రైతు బంధు' అమలు చేయాలని బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయం కేసీఆర్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మహాదేవపూర్ మండలం అంబట్ పల్లి లో అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు పుట్ట రవి కుటుంబాన్ని వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...'రైతు బంధు' రాకపోవడంతో రవి లాంటి ఎంతో మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల మెగా కృష్ణారెడ్డి అపర కోటీశ్వరుడైతే...కాళేశ్వరం ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు పేదవాళ్లుగా మిగిలిపోయారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు  ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సునీల్ రెడ్డి, కార్యకర్తలు, తదితరులు ఆయన వెంట ఉన్నారు. 

మరిన్ని వార్తల కోసం :

బాబు బడికి వెళ్లు

సీఎం అభ్యర్థిగా చన్నీ ఓకే అన్న సిద్ధూ