గొర్లు ఇవ్వండి.. లేకపోతే డీడీలైనా వాపస్ చేయండి

గొర్లు ఇవ్వండి.. లేకపోతే డీడీలైనా వాపస్ చేయండి
  •  ఆఫీసర్లకు అప్లికేషన్లు పెట్టుకుంటున్న గొల్ల కురుమలు
  •   బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే 
  •   అటకెక్కిన గొర్రెల స్కీమ్
  •   ప్రభుత్వం మారడంతో స్కీమ్ కొనసాగింపుపై లబ్ధిదారుల్లో అనుమానాలు
  •   డీడీ కట్టేందుకు తెచ్చిన డబ్బులపై 
  •    మిత్తీ పెరిగిపోతోందని ఆవేదన

కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో గొల్లకురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ స్కీమ్ ను తీసుకొచ్చిన బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పథకం కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిత్తీకి పైసలు తెచ్చి డీడీలు కట్టామని, గొర్రెలు త్వరగా ఇవ్వాలని, లేదంటే డీడీలైనా వాపస్ చేయాలని కోరుతున్నారు. ఇటీవల ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 120 మందికిపైగా డీడీలు వాపస్ కోరుతూ అప్లికేషన్లు పెట్టుకోవడం గమనార్హం. 

రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతలో 3.40 లక్షల మందికి గొర్రెల యూనిట్లు అందాల్సి ఉండగా..గత సర్కార్ హయాంలోనే 1.16 లక్షల మంది రూ.43,750 చొప్పున డీడీలు తీశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు గొల్లకురుమలు వాటా ధనంగా చెల్లించిన డబ్బుల్లో నుంచే గొర్రెలు కొని 34 వేల యూనిట్లు పంపిణీ చేశారు. ఇంకా సుమారు 82 వేల మంది ఆర్నెళ్లు, ఏడాది క్రితమే రూ.43,750 చొప్పున డీడీలు కట్టి గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారు. 

బీఆర్ఎస్ హయాంలోనే అటకెక్కిన స్కీమ్

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిసారే 2017లో గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఇందులోభాగంగా లబ్ధిదారులకు ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలును ఇచ్చేలా స్కీమ్ రూపొందించింది. మొదట్లో ఒక యూనిట్ కాస్ట్ రూ.1.25 లక్షలుగా ఉండేది. దీంతో లబ్ధిదారుల వాటా రూ.31,250 చెల్లించాల్సి వచ్చేది. తర్వాత మూడేండ్లలో గొర్రెల ధరలు పెరగడం, యూనిట్ కాస్ట్ పెంచాలని డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో మునుగోడు బై ఎలక్షన్స్​కు ముందు యూనిట్ ధరను ప్రభుత్వం రూ.1.75 లక్షలు చేసింది. 

దీంతో లబ్ధిదారుడి వాటా ధనం రూ.43,750కి చేరింది. అయితే ఈ స్కీమ్ లను కేవలం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల బయటే అమలు చేసిన ప్రభుత్వం..రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 7 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది. వీరంతా సొసైటీల్లో సభ్యులే. ఇందులో మొదటి విడతలో మూడున్నర లక్షల మందికి, రెండో విడతలో మూడున్నర లక్షల మందికి యూనిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత పూర్తి చేయడానికే రెండేండ్లకుపైగా పట్టింది. 

రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.6,085 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన పశుసంవర్థక శాఖ.. ముందుగా లబ్ధిదారుల నుంచి వారి వాటా ధనాన్ని సేకరించడం ప్రారంభించింది. ఇలా గత ప్రభుత్వం హయాంలోనే 82 వేల మంది నుంచి సుమారు రూ.358 కోట్లు డీడీలుగా సేకరించింది. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో మాత్రమే ఆయా నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు గొర్రెలు యూనిట్లు పంపిణీ చేసి.. మిగతా నియోజకవర్గాల్లో లబ్ధిదారులను పట్టించుకోలేదు. సాధారణ ఎన్నికల ముందైనా ఇస్తారనుకుంటే వివిధ కారణాలతో పంపిణీ చేయలేదు. 

సర్కార్ మారడంతో అనుమానాలు.. 

రాష్ట్రంలో ఉపఎన్నికలు వచ్చినప్పుడల్లా రెండో విడత గొర్రెల పంపిణీ త్వరలో పూర్తి చేస్తామని అప్పటి  బీఆర్ఎస్​ప్రభుత్వ పెద్దలు ప్రకటించడం, ఎన్నికలు అయిపోగానే పట్టించుకోకపోవడం జరిగేది. తాజాగా రాష్ట్రంలో సర్కార్ మారడంతో రెండో విడత గొర్రెల స్కీమ్ అమలుపై గొల్లకురుమలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరగా గొర్రెలయినా ఇవ్వాలని లేదంటే డీడీల డబ్బులయినా చెల్లించాలని సర్కార్ ను కోరుతున్నారు. నిత్యం స్థానిక వెటర్నరీ డాక్టర్లకు ఫోన్ చేయడం, లేదంటే జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసులకు వెళ్లి అడగడం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అధికారులు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

అప్పు తీసుకొచ్చి డీడీ కట్టిన

గత ప్రభుత్వం రెండో విడత గొర్రెలు ఇస్తామంటే రూ.47,500 అప్పు తీసుకొచ్చి డీడీ కట్టిన. ఇప్పటివరకు గొర్ల లోన్ పై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అప్పు తెచ్చిన కాడ మిత్తి పెరిగిపోతుంది. ప్రభుత్వం స్పందించి గొర్రెలు పంపిణీ చేయాలి. లేదంటే డీడీ కట్టిన డబ్బులు వాపస్ఇ వ్వాలి.
- ఆరకాల ప్రణయ్, పెద్దలింగాపూర్, రాజన్న సిరిసిల్ల