ఎమ్మెల్యేలకే పెత్తనం.. కేసీఆర్ తప్పుడు నిర్ణయమే: కేటీఆర్

ఎమ్మెల్యేలకే పెత్తనం..  కేసీఆర్ తప్పుడు నిర్ణయమే: కేటీఆర్
  • నియోజక వర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అనడంతోనే సమస్య 
  • వేరే లీడర్లు వేలు పెట్టొద్దన్నరు
  • దీంతో ప్రాబ్లమ్స్ మా వరకు రాలే
  • మూడేండ్లుగా కేసీఆర్ బయటికి రాకున్నా ప్రజల్లో అభిమానం తగ్గలే
  • పైసలిస్తే..గణేశ్ నిమజ్జనాల దగ్గర కేసీఆర్ పాటలు పెట్టుకుంటరా?
  • చెల్లెలు కవితకు కేటీఆర్ కౌంటర్
  • బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: తమ ప్రభుత్వంలో ఎవరి నియోజకవర్గంలో వారే ముఖ్యమంత్రి అంటూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల తప్పు జరిగిందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్ అన్నారు. మంత్రిగా ఎవరున్నా.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలదే నడిచిందని, దాంతో చాలా సమస్యలు తమ దృష్టికి రాకపోవడం వల్ల పరిష్కరించలేకపోయామని చెప్పారు. సోమవారం తెలంగాణ​ భవన్​లో బుల్లెట్ రైలు భూ బాధితులతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్​ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మన ప్రభుత్వంల కేసీఆర్​ ఒక నిర్ణయం తీసుకున్నరు. మంత్రి ఎవరున్నా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలదే నడ్వాలే అన్నరు. నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి.. వేరే వాళ్లు వేలు పెట్టొద్దని చెప్పిన్రు..  ఇదే మనం చేసిన తప్పు.. దీని వల్ల ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ బహదూర్​ గూడ లాంటి భూ సమస్యలను మా దృష్టికి తేలేదు.. కేసీఆర్ దృష్టికి వచ్చి ఉంటే వెంటనే పరిష్కారం చేసే వారు’ అని కేటీఆర్​వివరించారు.

పట్టాలు ఇప్పించకపోతే రాళ్లతో కొట్టాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారని, ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు ఎవరిని కొట్టాలి? అంటూ కేటీఆర్​ ప్రశ్నించారు. పోలీసులు ఆందోళనకారుల ఫొటోలు తీస్తే.. మీరు పోలీసుల ఫొటోలు తీసి కేసీఆర్​కు పంపించాలని సూచించారు. తులం బంగారం ఇస్తామని, నెలకు రూ.2,500 చొప్పున మహిళలకు ఇస్తామని హామీలు ఇచ్చి మోసం చేసి గద్దెనెక్కిన వారి ఫొటోలు పోలీస్ స్టేషన్లలో పెట్టాలన్నారు. 

హైడ్రాకు, సీఎం రేవంత్​ రెడ్డికి పెద్దలు ఆక్రమించిన భూములు, ఇండ్లు కనిపించట్లేదని కేటీఆర్​విమర్శించారు. ఎయిర్ పోర్ట్ కోసం తీసుకున్న 5, 500 ఎకరాల భూముల్లో చాలా ఖాళీగా ఉందని, ఆ భూములను బుల్లెట్ ట్రైన్ కోసం వాడుకోవచ్చని కేటీఆర్ చెప్పారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని.. కానీ, ఎవరైనా వచ్చి భూములు అడిగితే మాత్రం నిలదీయాలని రైతులకు సూచించారు.

సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే బహదూర్ గూడ భూములను కాపాడుతామని కేటీఆర్​ అన్నారు.  ఫ్యూచర్ సిటీలో ఎవరూ పెట్టుబడులు పెట్టవద్దని, పెడ్తే నష్టపోతారని హెచ్చరించారు.  ఏడాదిన్నర తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, ఎమ్మెల్యేగా కార్తీక్ రెడ్డి చేతుల మీదుగా బహుదూర్ గూడ రైతులకు పట్టాలు ఇప్పిస్తామని కేటీఆర్​ జోస్యం చెప్పారు. అనంతరం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బహదూర్​ గూడ భూముల విషయంలో చట్టాన్ని మార్చి అయినా పేదలకు న్యాయం చేస్తామని అన్నారు. 

‘భూ సేకరణ చేయాలంటే ఒక  పద్ధతి ఉంటుంది. కేసీఆర్ పాస్ బుక్స్ ఇచ్చిన భూమిని రేవంత్ రెడ్డి అక్రమంగా తీసుకుంటున్నారు. మీ భూమి మీద మీకు హక్కు లేకుండా చేయడం ఎందుకు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదవాడికి ఒక న్యాయం, పెద్దోళ్లకు ఒక న్యాయం చేస్తోంది’ అని సబిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు​ రావడం వల్ల ఆనాడు పట్టాలు సిద్ధం అయ్యాక ఇవ్వలేకపోయామని చెప్పారు.  

పైసలిస్తే పాటలు పెడ్తరా ?
గణేశ్ నిమజ్జనోత్సవాల్లో కేసీఆర్ పాటలకు డబ్బులిచ్చి డ్యాన్సులు చేయిస్తున్నారంటూ కల్వకుంట్ల కవిత చేసిన వాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పైసలు ఇస్తే పాటలు పెడ్తరా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పేద ప్రజల కోసం ఎంతో మంచి చేశారని, గరీబోనికి అండగా నిలబడ్డాడని పేర్కొన్నారు. 

కాబట్టే, ఆయన పాలనను గుర్తుచేసుకుంటూ యూత్ స్వచ్ఛందంగా ట్యాంక్‌బండ్‌పై కేసీఆర్ పాటలు పెట్టి సంబురాలు చేసుకున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ గద్దె దిగిపోయి మూడేండ్లయినా.. గరీబోళ్లకు ఆయన చేసిన మేలును ప్రజలు మర్చిపోలేదన్నారు.