ఉద్యోగులకు మస్తు  జీతాలు ఇస్తున్నం

V6 Velugu Posted on Sep 15, 2021

  • దేశంలో మన దగ్గరే ఎక్కువ శాలరీలు: మంత్రి హరీశ్
  • ఏడాదిలోనే 50 వేల మందికి ప్రమోషన్లు ఇచ్చినం
  • కరోనాతో లక్ష కోట్ల నష్టం.. పీఆర్సీ అందుకే లేటైంది


హుజూరాబాద్/జమ్మికుంట/ఇల్లందకుంట/వీణవంక, వెలుగు: దేశంలోనే అతి ఎక్కువగా జీతాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పారు. హుజూరాబాద్​లో మంగళవారం నిర్వహించిన టీఎన్జీవో కృతజ్ఞతా సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలో బీజేపీ 7.5 శాతం పీఆర్సీ ఇస్తే తెలంగాణ 30 శాతం ఇచ్చిందని హరీశ్ వెల్లడించారు. ఉద్యోగులందరి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. రాష్ట్రం వచ్చాక 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని,  ఏడాదిలోనే 50 వేల మందికి ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. ఉద్యోగులతో పనులు చేయించుకోవడంలో,  వేతనాలు ఇవ్వడంలో తెలంగాణ ముందుందన్నారు. కరోనా వల్ల రాష్ట్రానికి లక్ష కోట్ల నష్టం వచ్చిందని.. అందుకే పీఆర్సీ ఆలస్యం జరిగిందని చెప్పారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగాలకు కోత పెడుతోందని హరీశ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీలు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం నిర్ణయించారని చెప్పారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారని తెలిపారు.
నా భరతం పడితే ఏం వస్తది..
‘నీ భరతం పడుతా అని ఈటల అంటడు.. నా భరతం పడితే ఏం వస్తుందో చెప్పాలి’ అని హరీశ్ ప్రశ్నించారు. బీజేపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంకలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలు, చేనేత కార్మికులకు వివిధ పథకాల చెక్కులు పంచారు. ‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కో మహిళా సంఘానికి 5 లక్షల పైగా రుణాలిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చేనేత కార్మికులకు భరోసా దొరికింది. బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికుల పథకాలు ఊడగొట్టి.. నోటి కాడి బుక్కను ఎత్తగొట్టింది. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేసింది. హుజూరాబాద్ లో పద్మశాలీ భవన్ కోసం ఎకరా స్థలం, రూ.కోటి ఇచ్చాం. జమ్మికుంటలో కూడా ఎకరా స్థలం ఇస్తాం. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి..’ అని హరీశ్ కోరారు.

Tagged Employees, Minister Harish rao, Salaries,

Latest Videos

Subscribe Now

More News