
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రతిపక్ష నేతలకు దర్యాప్తు సంస్థలతో బీజేపీ నోటీసులు ఇప్పిస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం గాంధీ భవన్ లో వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులనేవి ఎన్నికల స్టంట్ లో భాగమని, దీనిని చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. బీఆర్ఎస్ ఎంత ప్రచారం చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు.