టీ20ల్లో మ్యాక్స్‌వెల్ సరికొత్త చరిత్ర: రోహిత్ ఆల్‌టైం రికార్డ్‪నే సమం చేశాడు

టీ20ల్లో మ్యాక్స్‌వెల్ సరికొత్త చరిత్ర: రోహిత్ ఆల్‌టైం రికార్డ్‪నే సమం చేశాడు

ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్ వెల్ క్రీజ్ లో ఉంటే ఏం జరుగుతుందో  క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించడం ఈ ఆసీస్ ఆల్ రౌండర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఫాస్ట్, స్పిన్ తేడా లేకుండా గ్రౌండ్ లో నలువైపులా షాట్స్ ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తాడు. ఇటీవలే జరిగిన వన్డే వరల్డ్  కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై వీరోచిత డబుల్ సెంచరీ ఆసీస్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన మ్యాక్సీ.. తాజాగా భారత్ పై టీ20 అదే మ్యాజిక్ రిపీట్ చేసాడు. 

భారత్ ఆస్టేలియా మధ్య నిన్న గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20 లో మ్యాక్స్ వెల్ శివాలెత్తాడు. 47 బంతుల్లోనే సెంచరీ చేసి ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించాడు. 48 బంతుల్లో 104 పరుగులు చేసిన మ్యాక్స్ వెల్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 8 సిక్సులున్నాయి. మ్యాక్స్ వెల్ కు టీ 20ల్లో ఇది నాలుగో సెంచరీ. దీంతో ఈ ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డ్  సమం చేసాడు. రోహిత్ 140 ఇన్నింగ్స్ లో 4 సెంచరీలు చేస్తే.. ఈ ఆసీస్ వీరుడు 92 ఇన్నింగ్స్ లోనే 4 సెంచరీలు చేసాడు. 

ఇక ఈ మ్యాచ్ లో భార‌త్ నిర్దేశించిన 223 ప‌రుగుల ఛేద‌న‌లో ఆసీస్ ఆఖ‌రి బంతికి విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్‌లో కంగారూల జట్టు 21 పరుగులు అవసరం కాగా.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో మ్యాక్స్‌వెల్‌ - మాథ్యూ వేడ్ జోడి చివరి ఆరు బంతులను  4, 1, 6, 4, 4, 4 భారత్ కు షాకిచ్చారు. మ్యాక్స్‌వెల్‌(104 నాటౌట్; 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) కు తోడు ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్‌, 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. 

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా.. తిలక్ వర్మ(31) సూర్య కుమార్ యాదవ్ (39) రాణించారు. 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను గైక్వాడ్, తిలక్ వర్మ నాలుగో వికెట్ కు అజేయంగా 141 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.