ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిన కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిన కరోనా మరణాలు
  • మొత్తం 16.84లక్షల మందికి వైరస్‌
  •  ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న వారు 12లక్షల మంది
  •  కోలుకున్న వారు 3లక్షలు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ప్రపంచ మంతటా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. చైనాలోని వూహాన్‌ మార్కెట్‌లో పుట్టిన ఈ కంటికి కనిపించని మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. చైనాలోని వూహాన్‌లో జనవరి 9న మొదటి మరణం నమోదు కాగా.. ఇప్పుడు లక్ష దాటింది. గురువారం ఒక్కరోజే 7,300 మంది చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. శుక్రవారం నాటికి 1,02,136 మంది చనిపోయారు. మరణాల రేటు 6.25 శాతం నమోదైంది. 16.84లక్షల మందికి పాజిటివ్‌ రాగా.. వారిలో 12లక్షల మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. దాదాపు 3.5లక్షల మంది కోలుకున్నారు. ఈ వ్యాధి వల్ల సంభవించే మరణాల్లో 93 శాతం 50 ఏళ్లు పైబడిన వారే అని, వారిలో కూడా సగానికి పైగా 70 ఏండ్ల కంటే ఎక్కువ వయసు వారే అని స్టడీస్‌ చెప్తున్నాయి. కాగా చాలా దేశాల్లో హాస్పిటల్‌లో చనిపోయిన వారి మరణాలు మాత్రమే అధికారికంగా బయటకు వచ్చాయి. ఇళ్లలో చనిపోయిన వారి లెక్క తెలియలేదు.