మళ్లీ పెరిగిన రష్యా ఆయిల్ దిగుమతులు

మళ్లీ పెరిగిన రష్యా ఆయిల్ దిగుమతులు

న్యూఢిల్లీ: రష్యా నుంచి భారత చమురు దిగుమతులు మళ్లీ పుంజుకున్నాయి. మూడు నెలల విరామం తరువాత ఈ నెల​ నుంచి కొనుగోళ్లు పెరిగాయి.  జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోజుకు 2 మిలియన్ బ్యారెల్స్​కు పైగా ఉన్న రష్యా ఆయిల్​ దిగుమతులు సెప్టెంబర్​ నాటికి 1.6 మిలియన్ బ్యారెల్స్​కు తగ్గాయి.  అక్టోబర్​ ప్రారంభంలో ఈ దిగుమతులు మళ్లీ పుంజుకున్నాయి. 

పశ్చిమ మార్కెట్లలో డిమాండ్ తగ్గడం, రవాణా సౌలభ్యం మధ్య రష్యా ఆయిల్​పై రాయితీలు పెరగడం ఇందుకు కారణం. కెప్లర్ డేటా ప్రకారం, అక్టోబర్​లో దిగుమతులు రోజుకు సుమారు 1.8 మిలియన్ బ్యారెల్స్​కు చేరుకున్నాయి. ఇది గత నెలతో పోలిస్తే రోజుకు 2.50 లక్షల బ్యారెల్స్ ఎక్కువ.   రష్యా ముడి చమురు దిగుమతులను నిలిపివేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంగీకరించినట్లు అమరికా ​ఇటీవల ప్రకటించింది. 

దిగుమతులు నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదని భారతీయ రిఫైనరీలు స్పష్టం చేశాయి. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రష్యా దాడి చేసిన తర్వాత, పశ్చిమ దేశాలు మాస్కోపై ఆంక్షలు విధించాయి. దీంతో తక్కువ ధరకు లభించే రష్యా ఆయిల్​ను భారత్​ కొంటోంది.  2020 నాటికి మొత్తం ఆయిల్​ దిగుమతుల్లో కేవలం 1.7 శాతం ఉన్న రష్యా వాటా ఈ ఏడాది 40 శాతానికి పెరిగింది.   ఇరాక్​ రోజుకు సుమారు 1.01 మిలియన్ బ్యారెల్స్​తో రెండవ అతిపెద్ద సరఫరాదారుగా ఉంది.