ఎస్వీబీసీకి విశ్వవాప్త గుర్తింపు... 15 వ వార్షికోత్సవ సభలో వెల్లడి

ఎస్వీబీసీకి విశ్వవాప్త గుర్తింపు... 15 వ వార్షికోత్సవ సభలో వెల్లడి

నాలుగేళ్లు టీటీడీ  ధర్మకర్తల మండలి హయాంలో  వివిధ ఆధ్మాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేసిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ)కు  విశ్వవ్యాప్త గుర్తింపు లభించిందని టీటీడీ ఛైర్మన్‌  వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో ఎస్వీబీసీ ద్వారా మరింత విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపారు. 

టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) 15వ వార్షికోత్సవం శుక్రవారం ( జులై 10) తిరుపతిలో జరిగింది.  కరోనా సమయంలో కూడా భక్తుల కోసం ఎస్వీబీసీ చక్కటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసిందని  టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఎస్వీబీసీ ద్వారా ప్రసారం అయిన సుందరకాండ, భగవద్గీత లాంటి పారాయణాలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయన్నారు ఈవో ధర్మారెడ్డి.  దీంతో  ఛానల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులు పెరిగారని, ఎస్వీబీసీ యూట్యూబ్‌, ఆన్‌లైన్‌ రేడియో కూడా భక్తుల ఆదరణ పొందుతున్నాయని చెప్పారు. హిందీ, తమిళం, కన్నడ భాషలకు ఆయా కేంద్రాల్లో స్టూడియోలు నిర్మించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భక్తులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు. ఎస్వీబీసీ ఛానన్ లో పనిచేసే ఉద్యోగుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు వైవీ సుబ్బారెడ్డి. 

ALSO READ :పులి నోట్లో నుంచి బయటపడిన చిన్నారి.. కోలుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నాడు

ఎస్వీబీసీ ఎండి , ఉద్యోగుల సమష్టి కృషితో ఛానల్‌ కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందని   వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఛానల్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.  టీటీడీ సంస్థలతోపాటు సంస్కృత విశ్వవిద్యాలయంలోని పండితులు, ప్రవచనకర్తలు, మేధావులతో  చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. జూలై 3 నుంచి ప్రసారమవుతున్న  శ్రీమద్‌ భాగవతం ప్రవచనానికి విశేషమైన స్పందన వస్తోందని, యూట్యూబ్‌తోపాటు ఛానల్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని చెప్పారు. 

ఉద్యోగులు  ఛానల్‌ను ప్రగతిపథంలో నడిపిస్తున్నారని ఎస్వీబీసీ ఛైర్మన్‌ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర  చెప్పారు. ఛానల్ సీఈవో శ్రీ షణ్ముఖ్‌కుమార్‌ వార్షిక నివేదికను చదివి వినిపించారు. 15వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు నిర్వహించిన వివిధ క్రీడాపోటీల విజేతలకు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి  బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు నందకుమార్‌, టీటీడీ జేఈవో సదా భార్గవి, ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీబీసీ బోర్డు సభ్యురాలు  వసంత కవిత, సలహాదారు నాగదుర్గారావు పాల్గొన్నారు