కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్

జెనీవా/సియోల్: ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు కరో నా మరణాలు తగ్గుతుండగా.. మరోవైపు అనేక దేశాల్లో కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నయి. గత వారం (మార్చి 7 నుంచి 13 వరకు) రోజుల్లో కరోనా మరణాలు 17% తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) వీక్లీ రిపోర్టులో వెల్లడించింది. అయితే, కొత్త కేసులు మాత్రం 8% పెరిగాయని తెలిపింది. గత వారంలో 1.10 కోట్లకుపైగా కొత్త కేసులు నమోదు కాగా, 43 వేల మంది చనిపోయారని పేర్కొంది. చైనా, సౌత్ కొరియా, వియత్నాం, జర్మనీ తదితర దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయంది. దీనికి స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంటే కారణమని వివరించింది. సౌత్ కొరియాలో కూడా కరోనా వ్యాప్తి మళ్లీ భారీగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే కొరియాలో 4 లక్షల మందికి కరోనా కన్ఫమ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఏమిటీ స్టెల్త్ ఒమిక్రాన్? 

ఒమిక్రాన్ (బీ.1.1.529) వేరియంట్ నుంచి పుట్టిన మూడు సబ్ వేరియంట్​లలో స్టెల్త్ ఒమిక్రాన్ (బీ.ఏ.2) కూడా ఒకటి. ఒరిజినల్ ఒమిక్రాన్ కంటే దీనిలో ఎక్కువ మ్యుటేషన్లు ఉండటంవల్ల ఇది ఒకటిన్నర రెట్లు స్పీడ్​గా వ్యాపిస్తోందని రీసెర్చర్లు చెప్తున్నారు. ప్రస్తుతం దీనిని డబ్ల్యూహెచ్​వో ‘వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్’ లిస్టులో ఉంచింది. బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్లకే దీనినుంచి పూర్తి ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తున్నారు.