గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్: అంతరిస్తున్నఅడవులు, జంతువులు

గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్: అంతరిస్తున్నఅడవులు, జంతువులు

అనగనగనగా ఒక అడవి... ః

అందులో మెలితిరిగిన బారెడు దంతాలు, ఒళ్లంతా దట్టంగా వెంట్రుకలతో ఏనుగులు..

కుక్కమూతి, నక్కతోక, చారలతో ఉన్న పులులు..ః

గాడిదకాళ్లు, గుర్రంఒళ్లు, తెల్లనితోక, మెడ నుంచి సగం వీపు వరకు చారలున్న జీబ్రాలు..

చెట్ల మీద.. గుడ్లగూబ ముక్కుతో, నీలం రంగులోని కొన్ని చిలుకలు.. పిచ్చుక ముక్కు, రంగురంగుల ఈకల రెక్కలతో మరికొన్ని చిలుకలు..

అక్కడే చెరువులో చేతులు, కాళ్లకు ఎర్రటి ఐదువేళ్లు, తలపై కోడిపుంజు జుత్తుతో  చేపలు...

... ఇది చదువుతుంటే చందమామ కథల్లోని జంతువులు గుర్తొస్తున్నాయి కదూ!

ఎందుకంటే ఆ జీవులు ఇప్పుడు లేవు. ఒకప్పుడు భూమ్మీద బతికి, కాలక్రమంలోఅంతరించాయి. అందుకు కారణాలేంటి?

వాటిలో మనిషి పాత్ర ఎంత? ఇప్పటివరకు ఎన్ని రకాల జీవులు అంతరించాయి? ఇప్పుడు ఏవేవి ప్రమాదంలో ఉన్నాయి?  అడ్డుకోవాలంటే ఏం చేయాలి? అంతరించిన వాటిని మళ్లీ  తీసుకురావచ్చా? దానికోసం ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో... ఒక సారి చూద్దాం

ఈ ఏడాది సెప్టెంబర్​17న మధ్యప్రదేశ్​లోని కునో నేషనల్​ పార్క్​లోకి ఎనిమిది చిరుతల్ని వదిలిపెట్టారు మన ప్రధానమంత్రి మోడీ. వాటిని ఆఫ్రికాలోని నమీబియా నుంచి స్పెషల్​ జెట్​లో తెప్పించారు. అవి చిరుతపులుల్లో ఒక రకం. అయితే, సుమారు 75 ఏండ్ల కిందట మనదేశంలో కూడా చిరుతలు ఉండేవి. వేటకు సాయంగా ఉంటాయని, వాటిని అప్పట్లో మచ్చిక చేసుకొని పెంచుకునేవాళ్లు కూడా. కానీ, స్వాతంత్ర్యం రావడానికి కొన్నేండ్ల ముందు నుంచి హఠాత్తుగా చిరుతల సంఖ్య తగ్గడం మొదలైంది. చివరికి అవి పూర్తిగా అంతరించినట్లు 1952లో ప్రభుత్వం ప్రకటించింది.   

87 లక్షల జీవజాతులు

జీవులు అంతరించడం భూమి పుట్టినప్పటి నుంచి జరుగుతున్న తంతు. ఎందుకంటే ఈ భూమి లక్షల జీవులకు ఇల్లులాంటిది. ఇక్కడ మనతోపాటు జంతువులు, పక్షులు, కీటకాలు, వృక్షజాతులు(చెట్లు, మొక్కలు, తీగలు), జలచరాలు(నీళ్లలో బతికేవి), సూక్ష్మజీవులు(బ్యాక్టీరియా) వంటివి ఎన్నో ఉన్నాయి. 2011లో ‘పీఎల్​ఓఎస్​​ బయాలజీ’లో వచ్చిన సర్వే ప్రకారం భూమ్మీద సుమారు 87లక్షల జీవజాతులు ఉన్నాయి.

వీటిలో ఇప్పటివరకు కేవలం 12లక్షల జీవులను మాత్రమే సైంటిస్టు​లు గుర్తించగలిగారు. వాటిలోని వేర్వేరు లక్షణాల ఆధారంగా ఒక్కోజాతిగా విభజించారు. అందులో కదిలేవి, కదలలేనివి, కంటికి కనిపించనివి ఉన్నాయి. కచ్చితంగా చెప్పాలంటే.. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ ఒకే రకమైన లక్షణాలు కలిగి, వాటి మధ్య రీప్రొడక్షన్​ జరుపుకోగలిగిన జీవులను ఒకే జాతిగా గుర్తించారు. ఇక, వేర్వేరు లక్షణాలు అనేవి భూమ్మీద ఉన్న రకరకాల పరిస్థితులకు అనుగుణంగా ఆ జీవుల్లో వచ్చేవి. కానీ, ఇప్పుడు ఇలాంటి జీవుల్లో చాలాభాగం అంతరించిపోయే ముప్పు ఎదుర్కొంటున్నాయి.   

ఐదు పెద్ద ప్రమాదాల్లో..   

సైంటిస్టు​లు చెప్తున్న ప్రకారం భూమ్మీద ఐదు పెద్ద ప్రమాదాలు జీవుల అంతు చూశాయి. వాటిలో మొదటిది 440 మిలియన్​​ ఏండ్ల కిందట జరిగింది. అప్పుడు వాతావరణంలో మార్పుల వల్ల భూమి మొత్తం మంచుతో నిండిపోయింది. దాంతో అప్పటి జీవుల్లో 86శాతం చనిపోయాయి. ఆ తర్వాత మళ్లీ సాధారణ స్థితి రావడంతో మిగిలిన జీవులు కొత్త జీవితం మొదలుపెట్టాయి.

ఆ తర్వాత వేర్వేరు కారణాలతో 365 మిలియన్​ ఏండ్ల కిందట, 250 మిలియన్​ ఏండ్ల కిందట, 210 మిలియన్​ ఏండ్ల కిందట ఇలాంటి పెద్ద ప్రమాదాలే జరిగాయి. చివరిసారి 66 మిలియన్​ ఏండ్ల కిందట వచ్చిన ప్రళయం గురించి మాత్రమే సైంటిస్ట్​లు ఆధారాలతో చెప్పగలుగుతున్నారు.  ఆ ప్రళయం అప్పట్లో ఒక భారీ గ్రహశకలం(ఆస్టరాయిడ్) ఢీకొనడం వల్ల వచ్చింది. దీనివల్ల భూమ్మీద 25 కేజీల కన్న ఎక్కువ బరువున్న జీవులన్నీ చనిపోయాయి. వాటిలో డైనోసార్స్ కూడా ఉన్నాయి.​ 

ప్రకృతి.. మనిషి

జీవులు అంతరించడానికి ప్రధాన కారణాలు రెండే. అందులో ఒకటి ప్రకృతి. మరొకటి మనిషి. ఈ రెండిటి వల్ల తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, ఉండడానికి చోటు లేక జీవులు చనిపోతున్నాయి. నిజానికి భూమ్మీద జంతువులు, పక్షులు, చెట్లు, మొక్కలు వంటివి బతకడానికి అనువైన చోటు అడవులే. అక్కడే వాటికి కావాల్సినవన్నీ దొరుకుతాయి. తమ సంతానాన్ని వృద్ధి చేసుకునేందుకు, వేటకు తావు కూడా అక్కడ ఉంటుంది. అందుకే అడవుల్ని వాటికి పుట్టినిల్లగా చెప్తారు. ఇలాంటి ప్రదేశాలు కొన్నేండ్లుగా తగ్గిపోతున్నాయి. దాంతో చాలా జీవులు అంతరిస్తున్నాయి.  

విపత్తులు..

భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్ధలవడం, వరదలు వంటి సహజ విపత్తుల వల్ల జీవులు అంతరించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇలాంటి ప్రకృతి విపత్తుల వల్ల కొన్ని చనిపోగా, మిగిలినవి బతకడానికి అవసరమైన చోటు, తిండి, నీళ్లు దొరకవు. అలాగే వాతావరణంలో మార్పుల్ని అవి తట్టుకోలేవు. ఉదాహరణకు డైనోసార్స్​ భూమ్మీద ఉన్నప్పుడు వాటికి అనువైన వాతావరణం ఉండేది.

అయితే, భూమిని ఆస్టరాయిడ్​ ఢీకొనడం వల్ల భారీగా దుమ్ము, ధూళి గాలిలో కలిసిపోయింది. అవి సూర్యుని నుంచి వచ్చే కాంతిని, వేడిని అడ్డుకున్నాయి. దానివల్ల భూవాతావరణం చల్లగా మారిపోయింది. ఈ మార్పును డైనోసార్స్​ తట్టుకోలేకపోయాయి. చల్లటి ఉష్ణోగ్రతలకు అలవాటుపడలేక ఒక్కటి కూడా మిగలకుండా చనిపోయాయి. అలాగే, అగ్నిపర్వతాలు పేలడం, వరదలు వంటివాటి వల్ల కూడా చాలా జీవులు అంతరించాయి. వాటిలో కోనోడాంట్స్​ అని పిలిచే ఈల్​ ఫిష్​ లాంటి చేపలు, మొదటి తరం మొసళ్లు, చెట్ల మీద తిరిగే కొన్ని రకాల బల్లులు, పెద్ద పెద్ద ఆకులతో ఉండే చెట్లు, మొక్కల రకాలు ఉన్నాయి.    

అడవులు నాశనం 

జీవులు అంతరించడానికి ప్రధాన కారణం అడవులు తగ్గిపోవడం. ఇది మనిషి చేస్తున్న పనుల వల్ల జరుగుతున్నదే. ఇండ్లు, పరిశ్రమలు, వ్యవసాయం, రవాణా కోసమంటూ అడవుల్ని నరికేస్తున్నారు. దీనివల్ల అక్కడి జీవులు అంతరిస్తున్నాయి.  దీనికి అమెజాన్​ అడవుల్లో జరుగుతున్న విధ్వంసమే రుజువు. ప్రపంచానికి ఊపిరితిత్తులు (లంగ్స్ ఆఫ్​ ది ప్లానెట్)గా పేరు పొందిన అమెజాన్ అడవి తొమ్మిది దేశాల్లో 6.7లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. భూమ్మీద బతకడానికి అవసరమైన ఆక్సిజన్​లో చాలా భాగం అక్కడి నుంచే వస్తోంది.

అంతేకాదు, ఆ అడవుల్లో ఎన్నో లక్షల రకాల జంతువులు, చెట్లు, పక్షులు ఉన్నాయి.  కానీ, అభివృద్ధి పేరుతో కొన్నేండ్లుగా అమెజాన్​లో విచ్చలవిడిగా చెట్లు కొట్టేస్తున్నారు. భూమిని చదును చేస్తున్నారు. అందువల్ల అక్కడి జీవుల్లో చాలావరకు అంతరించాయి. అడవులను నరికివేయడం వల్ల ఈ శతాబ్దంలో అంతరించిపోయిన వాటిలో ఫార్మోసన్​ క్లౌడెడ్​ లెపర్డ్​లు, స్పిక్స్​ మకావ్​లు, మౌంట్​ గ్లోరియస్​ టొరెంట్​ ఫ్రాగ్​, క్రిప్టిక్​ ట్రీ హంటర్​లు ముఖ్యమైనవి. 

విచ్చలవిడి వేట

తిండి కోసమో, లేకపోతే వాటి చర్మం, గోళ్లు వంటి వాటికి ఉన్న డిమాండ్​ కోసమో ఇప్పటికీ చాలా చోట్ల మనుషులు విచ్చలవిడిగా జంతువుల్ని వేటాడుతున్నారు. దీనివల్ల ఇప్పటికే చాలా జీవులు అంతరించాయి. టాస్మేనియన్​ టైగర్స్​, పాసెంజర్​ పీజియన్​, పెంగ్విన్ల లాంటి గ్రేట్​ ఓక్​లు, ఆఫ్రికా దక్షిణ ప్రాంతాల్లోని  గుర్రంలాంటి క్వెట్టాలు, ఫాక్​లాండ్​ దీవుల్లోని తోడేళ్లు, జాంజిబార్​ చిరుతలు, కరేబియన్​ మాంక్​ సీల్​లు, కరోలినా పారకీట్స్​ చిలుకలు,  ఆఫ్రికాలోని అట్లాస్​ ఎలుగుబంట్లు, కంగారు లాంటి వాల్​బీలు, సీ మింక్​లు, ఆఫ్రికాలోని జింకల్లాంటి బుబల్​ హార్టెబీస్ట్​లు, స్టెల్లర్స్​ సీ కౌలు అంతరించింది వేట వల్లనే. అంతేకాదు, వేటగాళ్ల వల్ల అంతరించిపోయే లిస్ట్​లో ఇప్పుడు పెద్ద దంతాల ఆసియా ఏనుగులు, కొమ్ముల రైనోలు, అరుదైన నక్షత్ర తాబేళ్లు,  లెమూర్స్​, పంగోలియన్స్​ వంటివి ఉన్నాయి. 

అర్బనైజేషన్​

అమెరికాలో మౌంటెన్​ లయన్​ల సంఖ్య తగ్గడానికి కారణం అక్కడి అర్బనైజేషన్. పర్వతాల్లో ఉండే సింహం దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్ల స్థలాన్ని తన అడ్డగా చేసుకుంటుంది. తాను వేటాడడానికి, జతకట్టడానికి ఆ తావునే ఎంచుకుంటుంది. అయితే,  కొన్నేండ్లుగా మౌంటెన్​ లయన్స్​​ ఉండే చోట పట్టణాలు బాగా విస్తరించాయి. కాలిఫోర్నియా, బ్రిటీష్, కెనడాలో మౌంటెన్​ లయన్స్​ ఉండే చోట్ల 20వ శతాబ్దంలో పట్టణాలు బాగా పెరిగాయి.

లాస్​ఏంజెలెస్​, వాంకోవర్​ సిటీలు దగ్గరలోని అడవుల్లోకి చొచ్చుకుపోయాయి. దాంతో ఆ సిటీల్లోని మౌంటెన్​ లయన్స్​ ఉండే ప్రాంతాలు చిన్నవిగా మారిపోయాయి. అంటే అవి చాలా తక్కువ మౌంటెన్​ లయన్​లకు మాత్రమే సరిపోయేలా మారాయి. అయితే, మౌంటెన్​ లయన్స్​ ఉండే మరికొన్ని ప్రాంతాల్లో అర్బనైజేషన్​ అంతగా లేకపోవడం వల్ల ఆ జాతి అంతరించకుండా నిలిచింది. అడవులు తగ్గిపోవడం మరో  ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతోంది. జంతువులు తిండి కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. మనుషులపై దాడి చేస్తున్నాయి. దాంతో వాటిని మనుషులు చంపేస్తున్నారు. పోలార్​ బేయర్స్​, మౌంటెన్​ లయన్స్, అలిగేటర్స్​ వంటివి ఉండే చోట్లకు మనిషి ఆనుకొని వెళ్లడం ఆ జంతువులకు ముప్పుగా మారింది.     

గ్లోబల్​వార్మింగ్​

జీవులు అంతరించడంలో గ్లోబల్​వార్మింగ్​ది కూడా మెజార్టీ వాటానే. ముఖ్యంగా ఇండస్ట్రీస్, వెహికల్స్​ పెరిగి కాలుష్యం​ ఎక్కువవుతోంది. వాతావరణంలో మార్పులొస్తున్నాయి. నానాటికి పెరిగిపోతున్న టెంపరేచర్లు ప్రభావం జంతువులు, పక్షులు, చెట్లు, మొక్కలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పడుతోంది. వర్షాలు సరిగా పడక, సరిపడ తిండి దొరక్క కొన్ని రకాల జీవులు అంతరిస్తున్నాయి. అలాగే సముద్రమట్టాలు పెరిగి వాటికి సమీపంలోని జీవులు చనిపోతున్నాయి.

కొత్త చీడపీడలు, రోగాలతో జీవుల సంఖ్య తగ్గి, క్రమంగా అంతరిస్తున్నాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియా, పపువా నూగినియా మధ్యలోని టొర్సెస్​ జలసంధికి ఆనుకొని ఉన్న చిన్న దీవిలో ఎలుకల్లాంటి బ్రాంబెల్​ కే మెలొమీస్​ కనిపించేవి. గ్లోబల్​వార్మింగ్​ వల్ల వేడిమి ఎక్కువై అక్కడి సముద్రమట్టం పెరిగింది. ఫలితంగా ఆ చిన్న దీవి నీటిలో 97శాతం మునిగిపోయింది. దాంతో ఆ జాతి మొత్తం అంతరించింది. అలాగే, ఇటీవల గ్లోబల్​వార్మింగ్​తో 77రకాల జీవజాతులు అంతరించినట్లు ఐయూసీఎన్​ చెప్తోంది. అందులో బ్లాక్​ షాఫ్ట్​షెల్​ టర్టిల్​, పియర్​ డేవిడ్స్​ డీర్​, హవాయిన్​ క్రౌ, ఫ్రాంక్లిన్​ ట్రీ, వ్యోమింగ్​ టోడ్​ వంటివి ఉన్నాయి.   

జీన్స్​లో మార్పులు

జీవులు అంతరించడానికి వాటిలో జన్యువైవిధ్యం తగ్గడం కూడా కారణమే. భూమ్మీద ఆయా ప్రాంతాల్లో ఉండే పరిస్థితులను బట్టి ప్రతి జీవి జీన్స్​లోనూ వైవిధ్యం ఉంటుంది. అలాగే, వేర్వేరు ప్రాంతాల్లో ఉండే ఒకే రకం జీవులు కలిసినప్పుడు వాటి సంతానం జీన్స్​లో మార్పులు కనిపిస్తాయి. దీనికి ఉదాహరణ మనుషులే. ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో కనిపించే నలుపు, గోధుమ, ఎరుపు రంగులోని జుట్టు వాతావరణాన్ని బట్టి, వేరే ప్రాంతాల్లోని మనుషులతో కలవడాన్ని బట్టి వచ్చేవే.

అయితే, ఒక ప్రాంతంలోని జీవి అదే ప్రాంతంలోని తమ జాతికే చెందినవాటితో జత కట్టడం వల్ల వాటి జీన్స్​లో పెద్ద మార్పులేమీ ఉండవు. అందువల్ల అవి తరచూ ఒకే రకమైన జబ్బులకు గురై చనిపోతుంటాయి. ఆ వ్యాధులను ఎదుర్కొనే జీన్స్​ వాటిలో పెరగకపోవడమే దీనికి కారణం. అలాగే జంతువుల్లో జన్యువైవిధ్యం, రీప్రొడక్షన్​ తగ్గడానికి మనిషి కూడా కారణమే. జంతువుల్ని వేటాడడం వల్ల వాటిలో రీప్రొడక్షన్​ సామర్థ్యం కలిగిన జీవుల సంఖ్య తగ్గడం అందుకు ఉదాహరణ. అలాగే, వ్యవసాయంలో వస్తున్న మార్పులు కూడా జంతువులు, వృక్షజాతుల్లో జన్యువైవిధ్యం తక్కువగా ఉండడానికి కారణమవుతోంది.    

ఐసీయూ ఎన్​ రెడ్​ లిస్ట్​

భూమ్మీద ఉండే జీవుల పరిరక్షణ, భద్రతను (ఇంటర్నేషనల్​ యూనియన్​ ఫర్​ కన్జర్వేషన్​ ఆఫ్​ నేచర్​‌‌‌‌– ఐయూసీఎన్) చూస్తోంది. ఇది ఏటా ‘ది రెడ్​ లిస్ట్​ ఆఫ్​ త్రెటెండ్​ స్పీసీస్​’ పేరుతో ఒక రెడ్​ లిస్ట్​ విడుదల చేస్తుంది. ఒక జాతి జీవుల సంఖ్య, అవి బతికే ప్రాంతాల హద్దు, రీప్రొడక్షన్​ తీరు, అంతరించడానికి ఉన్న అవకాశాల్ని ఇది​​ చెప్తుంది. ఏదైనా జాతిలోని జీవుల సంఖ్య పదేండ్ల టైంలో 30 నుంచి 50 శాతం తగ్గినప్పుడు, లేదా వాటి అడ్డా 20వేల చదరపు కిలోమీటర్ల కంటే తగ్గినప్పడు, రీప్రొడక్షన్​ చేయగలిగిన జీవుల సంఖ్య పదివేల కంటే తక్కువ అయినప్పుడు వాటిని అంతరించే ముప్పు ఉన్న జాబితాలో  చేరుస్తారు.

 ఎక్కువ సంఖ్యలో, ప్రపంచమంతా విస్తరించి ఉన్న జీవులను తక్కువ ముప్పు ఉన్నవాటిగా చెప్తోంది ఐయూసీఎన్​. ఆ లిస్ట్​లో మనుషులతోపాటు కుక్కలు, పిల్లులు, పావురాలు, ఈగలు, దోమలు వంటివి ఉన్నాయి. అలాగే, రాబోయే కాలంలో అంతరించే ముప్పు ఉన్న వాటిలో దక్షిణ అమెరికా, ఆఫ్రికాలో కనిపించే ఊదారంగు పూల మొక్కలు ఉన్నాయి. ఈ పూలజాతి సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇవి ఉన్న అడవులు తగ్గుతుండడం వాటికి ముప్పుగా మారుతోంది. 

ఆ జీవుల్ని మళ్లీ పుట్టించొచ్చా? 

అంతరించిన జీవుల్ని మళ్లీ పుట్టించడం సాధ్యమే అంటున్నారు సైంటిస్ట్​లు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సైన్స్​ ఎంతో డెవలప్​ కావడమే దీనికి కారణం. అయితే, అంతరించిన జీవుల డీఎన్​ఏ సీక్వెన్సింగ్​ తెలిస్తేనే ఇది సాధ్యమవుతుది. కారణమేంటంటే ప్రతి జీవికీ ప్రత్యేకమైన డీఎన్​ఏ ఉంటుంది. ఆ డీఎన్ఏ జీవితకాలం 521 ఏండ్లు. అంటే ప్రతి వెయ్యేండ్లకు దాదాపు 75శాతం జీవుల డీఎన్​ఏ అంతమవుతుంది.

దీన్నిబట్టి ప్రతి 6.8మిలియన్​ ఏండ్లకు ఒక జాతిలోని ప్రతి ఒక్క జీవి డీఎన్​ఏ కూడా పూర్తిగా అంతరిస్తుంది. అందువల్ల ఎప్పుడో 6.7 మిలియన్​ ఏండ్ల కిందట అంతరించిన డైనోసార్స్​ లాంటి జీవుల్ని మళ్లీ పుట్టించడం లేదా సృష్టించడం అసాధ్యం. కానీ, సుమారు వందేండ్ల కిందట అంతరించిన ‘డోడో’ పక్షిని మళ్లీ బతికించొచ్చు. దీన్నే సైంటిస్ట్​లు డీ–ఎక్టింక్షన్​​ అంటున్నారు. ఇందులో మూడు పద్ధతులు ఉన్నాయి. అవి..

క్లోనింగ్​: అంతరించిన జీవి డీఎన్​ఏను క్లోనింగ్​తో అచ్చం అలాగే తయారుచేయడం. అయితే, దీనికోసం ఆ జీవి డీఎన్​ఏ సీక్వెన్సింగ్​ పూర్తిగా తెలియాలి.  ఈ మధ్యకాలంలో అంతరించిన జీవులను క్లోనింగ్​ పద్ధతిలో మళ్లీ పుట్టించొచ్చు. అలాగే, భవిష్యత్తులో అంతరించే ప్రమాదం ఉన్న జీవుల డీఎన్​ఏను తీసుకొని మళ్లీ వాటిని సృష్టించొచ్చు.

జీనోమ్​ ఎడిటింగ్​: అంతరించిన జీవుల డీఎన్​ఏను పోలి ఉండే డీఎన్​ఏను తయారుచేయడం. దీనికోసం.. అంతరించిన జీవులను పోలి ఉండే జీవుల జీనోమ్​ను మార్పు చేయాలి. ఆ డీఎన్​ఏతో మళ్లీ పాత జీవిని పుట్టించొచ్చు. అయితే, ఈ పద్ధతిలో పుట్టేవి హైబ్రీడ్​ జాతిగా మాత్రమే గుర్తింపు పొందుతాయి.  

బాక్​– బ్రీడింగ్​: ఏదైనా అంతరించిపోయిన జీవికి చెందిన అండాన్ని లేదా గుడ్డును అచ్చం అలాంటి పోలికలో ఉన్న మరొక జీవిలో ప్రవేశపెట్టి కొత్త వాటిని పుట్టించడం. అయితే, జీనోమ్​ ఎడిటింగ్​లా ఇందులోనూ అంతరించిపోయిన జీవి లక్షణాలను పోలి ఉండే మరొక జీవి కావాలి. 

అంతరించడం అంటే?

మనుషుల్లో మాదిరే ప్రతి జాతిలోనూ కొత్తవి పుట్టడం, పాతవి చనిపోవడం మామూలే. అయితే, ఏదైనా ఒక జాతి జీవి ఒక్కటి కూడా భూమ్మీద కనిపించకపోతే దాన్ని బట్టి ఆ జాతి పూర్తిగా అంతరించిందని చెప్తారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం గత ఐదు వందల ఏండ్లలో లక్షకు పైగా జీవరాశులు భూమ్మీద నుంచి మాయమయ్యాయి. వాటిలో అన్ని రకాల జీవులూ ఉన్నాయి. 

తొమ్మిదొందల రకాలు..

సైంటిస్ట్​ల లెక్కల ప్రకారం1500వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు  అంతరించిన జీవుల్లో గుర్తించింది కేవలం 900 రకాల్ని మాత్రమే.  వీటిలో మొలాస్కస్​లు 299 కాగా, పక్షులు 159 రకాలు,  క్షీరదాలు(పాలిచ్చే పెంచేవి) 85, చేపలు 80, ఉభయచరాలు (నీళ్లలో, నేలపై బతకగలిగేవి) 35, సరీసృపాలు(పాము వంటి పాకే జీవులు) 30, క్రస్టేసియన్స్​(పెంకు ఉన్న జీవులు) 11 రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవీ.. 

బంగారు కప్ప: బంగారం రంగులోని ఈ కప్పను మొదటిసారి 1964లో కోస్టారికాలోని అడవుల్లో కనుగొన్నారు.1989 నుంచి దీని జాడ మాయమైంది.వాతావరణంలోని మార్పులు లేదా ఫంగల్​ ఇన్ఫెక్షన్​తో ఈ జీవి అంతరించినట్లు అంచనా. 

బాలి టైగర్​: ఇండోనేసియాలో ఉంటాయివి. వేల ఏండ్లుగా అక్కడివాళ్లతో ఏ ఇబ్బందీ లేకుండా బతికేవి. యూరప్​ వ్యాపారులు, సైనికులు రాకతో వీటి​​ బతుకు కష్టమైంది. వాళ్లు తమ ఆనందం కోసం ఈ పులిని వేటాడేవాళ్లు. దాంతో ఇవి 1937 నాటికి అంతరించాయి. 

కరోలినా పారకీట్​: మనుషుల ఫ్యాషన్​ పిచ్చికి బలైపోయిన జీవి ఇది. ఆకుపచ్చని ఈకలు, మెడ చుట్టూ పసుపు రంగు, తలపై కాషాయ రంగుతో కనిపించే పారకీట్స్​ చిలుక జాతిలో ఒక రకం. ఇవి అమెరికాలో ఉండేవి. వీటి ఈకల్ని మహిళల టోపీల్లో ఫ్యాషన్​గా పెట్టేవాళ్లు. అందుకోసం ఈ చిలుకల్ని చంపేవాళ్లు. అలాగే వీటిని ఇండ్లలో పెంచుకునేవాళ్లు. వీటివల్ల పారకీట్స్​ సంఖ్య తగ్గడం మొదలైంది.1918లో సిన్సినాటి జూలోని చివరి కరోలినా పారకీట్​ చనిపోవడంతో ఈ జాతి పూర్తిగా అంతరించింది.      

చైనీస్​ పాడిల్​ ఫిష్​: డాల్ఫిన్​లాగా పొడుగాటి ముక్కు ఉంటుంది. ఈ చేప 23 అడుగుల వరకు పెరుగుతుంది. బరువు 450 కిలోల వరకు ఉంటుంది. చైనాలోని యాంగ్జీ నది​లో కనిపించేది. అయితే, ఈ నదిపై డ్యామ్​లు కట్టడం, విచ్చలవిడి వేట వల్ల 2003 నుంచి కనుమరుగైంది.

  స్కాంబర్గ్స్​​ డీర్​: థాయి​లాండ్​లో కనిపించేవి. ఈ జింకలు వర్షాకాలంలో మందలుగా ఒకచోట చేరి వేటగాళ్లకు సులువుగా దొరికేవి. అలాగే ఇవి గడ్డిమేసే మైదానాల్లాంటి ప్రాంతాల్ని జనం ఆక్రమించుకున్నారు. దాంతో 1938 నుంచి ఇవి కనిపించలేదు.     

క్వగ్గా: ఇది గుర్రం జాతి. మెడ నుంచి వీపుపై సగం వరకు జీబ్రా చారలు ఉండేవి. తోక, కాళ్లు తెల్లగా ఉండేవి. దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపించేవి. వీటిని బండ్లు లాగడానికి, బరువులు మోయడానికి వాడేవాళ్లు. ఫారినర్స్​కు బహుమతిగా ఇచ్చేవాళ్లు. దాంతో వీటి సంఖ్య తగ్గింది. చివరి క్వగ్గా 1883లో నెదర్లాండ్స్​లోని ఆమ్​స్టర్​డ్యామ్​ జూలో చనిపోయింది. 

ఫన్నెల్​–వెబ్​ స్పైడర్​: ఇది విషపుసాలీడు. ఆస్ట్రేలియాలో కనిపించేది. అర్బనైజేషన్​ పెరగడం దీనికి ముప్పుగా మారింది. విషపు సాలీడు కావడంతో దీన్ని స్థానికులు చంపేసేవాళ్లు. దీని గూళ్లు తొలగించేవాళ్లు. దాంతో 1995 నాటికి ఇవి అంతరించాయి. 

డెసర్ట్​ రాట్​–కంగారూ: ఎలుకకు, కంగారూకు పుట్టినట్లు ఉండే ఈ జీవి ఆస్ట్రేలియా ఎడారుల్లో బతికేది. రెడ్​ ఫాక్స్​ అనే నక్కల కారణంగా1994లో ఇవి అంతరించాయి. 
రౌండ్​ ఐలాండ్​ బరోయింగ్​ బోవా: విషం లేని ఈ పాము (కొండచిలువ) మారిషస్​ దీవుల్లో ఉండేది. ఇక్కడ మనుషులతోపాటు గొర్రెలు, కుందేళ్ల సంఖ్య పెరగడంతో బోవా పాములు బతికే గడ్డి ప్రాంతాలు దెబ్బతిన్నాయి. దాంతో ఇవి1996లో అంతరించాయి.

డార్క్​ ఫ్లయింగ్ ఫాక్స్​: ఇది ఒక రకం గబ్బిలం. మారిషస్​లో ఉండేది. పండ్లను మాత్రమే తినే వీటిని మాంసం, కొవ్వు కోసం అక్కడివాళ్లు వేటాడేవాళ్లు. ఆ తర్వాత విదేశీయులు తుపాకీలతో చంపేవాళ్లు. దాంతో 19వ శతాబ్దం చివరికల్లా ఇవి పూర్తిగా అంతరించాయి.

మనుషుల్లో కొన్ని తెగలూ..
జంతువులు, చేపలు, చెట్లు మాత్రమే కాదు మనుషుల్లోనూ కొన్ని తెగలు అంతరించాయి. అందులో ఎక్కువగా ఆదివాసీ తెగలు ఉన్నాయి. నిజానికి బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో ఆదివాసీ జాతులు ఇప్పటికీ అమెజాన్​ అడవుల్లో ఉన్నాయి. అలాంటి ఒక తెగలోని చివరి వ్యక్తి ఈ ఏడాది ఆగస్టులో చనిపోయాడు. చిన్న చిన్న గుంతల చుట్టూ  గుడిసెలు కట్టుకొని బతికే అతన్ని ‘మ్యాన్​ ఆఫ్​ ది హోల్​’గా పిలిచేవాళ్లు. అతడు దాదాపు 26 ఏండ్లు ఒంటరిగా జీవించాడు. ఎందుకంటే అతని తెగలోని వాళ్లందరూ అప్పటికే చనిపోయారు. దానికి కారణం అక్కడి బంగారు గనులపై కన్నేసిన మైనింగ్​ మాఫియా. 

మనదేశంలోని అండమాన్​ దీవుల్లో ఉండే ‘బో’ తెగ కూడా ఇటీవలే అంతరించింది. ఆ తెగలోని చివరి వ్యక్తి అయిన ‘బో స్సర్’ 85 ఏండ్ల వయసులో 2010లో చనిపోయాడు. దాంతో ఆ తెగ పూర్తిగా అంతరించినట్లు లండన్​లోని ‘సర్వైవల్​ ఇంటర్నేషనల్​’ సంస్థ ప్రకటించింది. ​

టాస్మేనియన్​ టైగర్​కు క్లోనింగ్​!

అంతరించిన జీవులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రపంచ ప్రఖ్యాత కోలోసెల్​ బయోసైన్సెస్​ మొదలుపెట్టింది. మొదట టాస్మేనియన్​ టైగర్​ను క్లోనింగ్​తో మళ్లీ పుట్టించేందుకు 35 మంది సైంటిస్ట్​ల టీమ్​ ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్​ 7, 1936లో చివరి టాస్మేనియన్​ టైగర్ చనిపోగా, అప్పటికే భద్రపరిచిన దాని​ డీఎన్ఏను క్లోనింగ్​ చేశారు. అయితే, ఆ డీఎన్​ఏ కొంచెం పాడవడంతో జీనోమ్​ ఎడిటింగ్​ చేసి, దాన్ని మరొక జీవిలో పెట్టి టాస్మేనియన్​ టైగర్​ను తిరిగి భూమ్మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కోలోసెల్​ బయోసైన్సెస్​ సీఈవో బెన్​లామ్​ చెప్తున్నారు.  

మన కలివికోడి మాయం!

అత్యంత అరుదైన కలివికోడి మనదేశంలో మాత్రమే ఉంటుంది. దీని పేరులో కోడి ఉన్నప్పటికీ నిజానికి ఇదొక పక్షి. చూడ్డానికి తీతువుపిట్టలా ఉంటుంది. పొడుగాటి కాళ్లు,  ముదురు గోధుమ రంగు ఈకలు, మెడలో దండలు వేసినట్లు గీతలు ఉంటాయి. ముళ్లపొదలు ఉండే పచ్చిక మైదానాల్లో ఉండేవి. 1948 నాటికే ఈ పక్షి అంతరించినట్లు సైంటిస్ట్​లు చెప్పారు.

అయితే, 1985లో ఈ పక్షి ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లాలో ఉన్న లంకమల అడవుల్లో కనిపించింది. గాయాలతో ఉన్న ఆ పక్షిని స్థానికుడు ఒకరు పట్టుకొని అటవీ అధికారులకు అప్పగించాడు. విషయం తెలియడంతో పక్షుల మీద రీసెర్చ్​ చేసే​ సలీం అలీ వచ్చి ఆ పక్షిని చూశారు. కలివికోడిగా గుర్తించారు. కానీ, ఆ పక్షి కాసేపటికే చనిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు కలివికోడి జాడ లేదు. అయితే, ఇప్పటికీ లంకమల అడవుల్లో ఆ పక్షి కోసం వెతుకున్నారు. ప్రభుత్వం కూడా ఆ అడవుల్ని అభయారణ్యంగా ప్రకటించింది. 

మనదేశంలో కనిపించకుండాపోయినవి..

బొటానికల్​ సర్వే ఆఫ్​ ఇండియా(బీఎస్​ఐ) ప్రకారం.. ప్రపంచంలోని మొత్తం చెట్లజాతుల్లో 11.5శాతం, జంతుజాతుల్లో 6.49శాతం ఇండియాలో ఉన్నాయి. అయితే, గ్లోబలైజేషన్, అర్బనైజేషన్, డీఫారెస్టేషన్​ వంటి చర్యల వల్ల ఇటీవల దాదాపు 22 రకాల జీవులు అంతరించాయి. వీటిలో వృక్షజాతులను పక్కన పెడితే కనిపించకుండా పోయిన జంతువులు ఇవీ.

జావా రైనోసార్స్:​ ఇవి 4.5 నుంచి 6 అడుగుల ఎత్తులో ఉంటాయి. వీటిలో మగ రైనోలకు ముక్కు పైభాగంలో కొమ్ము ఉంటుంది. ఒకప్పుడు ఆసియాలోని ఈశాన్య దేశాలన్నింటిలోనూ కనిపించే ఈ రకం ఖడ్గమృగాలు ఇప్పుడు కేవలం ఇండోనేషియాలోని జావా దీవుల్లో మాత్రమే ఉన్నాయి. అవి కూడా వందలోపే. విచ్చలవిడిగా వేటాడడం, వీటి ఆవాసాలను ఆక్రమించుకోవడంతో మనదేశంలో ఇవి ఎప్పుడో అంతరించాయి.

పింక్​ హెడెడ్​ డక్​: ముక్కు నుంచి తల, మెడ వరకు పింక్​ కలర్​లో ఉండే ఈ బాతులు మనదేశంలో 1949 నుంచి కనిపించడం లేదు.  మయన్మార్​లో అప్పుడప్పుడూ ఇవి కనిపిస్తుంటాయని చెప్తున్నప్పటికీ రుజువులు మాత్రం లేవు.

ఆసియా చిరుతలు: ఇవి చిరుతపులుల్లో ఒక రకం. ఈ ఏడాది నమీబియా నుంచి తెప్పించింది వీటినే. మనుషులకు కూడా మచ్చికయ్యే ఈ చిరుతలు సుమారు 75 ఏండ్ల కిందటే మనదేశంలో అంతరించాయి. అయితే, ఆఫ్రికా, అరేబియన్​ దేశాల్లో మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. 

ఎనుబోతు: ఇండియన్​ ఆరోచ్​గా పిలిచే ఈ జాతి జంతువులు13వ శతాబ్దంలోనే ఇండియాలో అంతరించాయి. అయితే, అచ్చం ఈ జంతువు పోలికలతోనే ఉండే ‘జెబు’ రకం ఆవులు మనదేశంతోపాటు దక్షిణ అమెరికా, ఆఫ్రికాలో ఉన్నాయి. 

కోలంకి పిట్ట: హిమాలయన్​ క్వాయిల్​గా పిలిచే ఈ పక్షులు వంద ఏండ్ల కిందటే మనదేశంలో అంతరించాయి. ఇవి హిమాలయ పర్వత ప్రాంతాల్లోని దట్టమైన గడ్డిలో ఉంటూ, అక్కడి కీటకాలను తినేవి. ఇవి నివసించే ప్రాంతాల్లో మనుషుల సంచారం పెరగడంతో పూర్తిగా అంతరించినట్లు సైంటిస్ట్​లు చెప్తున్నారు. ::: మహేశ్వర్