
- గ్లోబల్ వార్మింగ్‌తో ఎవుసానికి దెబ్బ
- గతి తప్పుతున్న కాలాలు
హైదరాబాద్, వెలుగు : ఒకప్పుడైతే.. ఎప్పుడు వానొస్తది, ఎప్పుడు రాదనే విషయాన్ని రైతులు మొగుల్ని చూసి ఇట్టే గుర్తుపట్టెటోళ్లు. కానీ, ఇప్పుడు అట్ల లేదు. వానలు ఎప్పుడు కురుస్తయో.. వడగండ్లు ఎప్పుడు పడ్తయో చెప్పలేని పరిస్థితి. మునుపు కాలం కూడా మంచిగైతుండె.. ఇప్పుడు కాలం కాని కాలంలో వానలు మోపైతున్నయ్. ఎండకాలంలో వడగండ్లు పడ్తున్నయ్. రైతులను ఆగం పట్టిస్తున్నయ్. లక్షల ఎకరాల పంటను ముంచేస్తున్నయ్. ఇటు, ఎండలు కూడా మండిపోతున్నయ్. రాష్ట్రంలో నాలుగైదేండ్ల నుంచి ఇదే పరిస్థితి. దానికి కారణం.. ప్రత్యక్షంగా, పరోక్షంగా గ్లోబల్ వార్మింగేనని సైంటిస్టులు చెప్తున్నారు. మన రాష్ట్రమొక్కటే కాదు.. ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలపైనా ఆ ఎఫెక్ట్ ఉందని అంటున్నారు.
సముద్రాలు వేడెక్కుతున్నయ్
గ్లోబల్ వార్మింగ్‌ను అటు సముద్రాలు, ఇటు భూమిపై పెరుగుతున్న టెంపరేచర్ల ఆధారంగా లెక్కిస్తారు. పసిఫిక్ మహాసముద్రంతోపాటు మన దగ్గర హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. వాటికి తోడు వెస్టర్న్ డిస్టర్బెన్స్ (మధ్యధరా రీజియన్ నుంచి మన దేశం మీదికి వీచే గాలులు, వర్షాలు) వల్ల అల్ప పీడనాలు ఏర్పడడం, బంగాళాఖాతం నుంచి కూడా పడమటివైపు తేమ గాలులు వీచి వాతావరణంలో ఫ్రీజింగ్ లెవెల్స్ పెరిగి వడగండ్లు ఏర్పడుతున్నాయి.
ఆ ప్రభావం సెంట్రల్, నార్త్ ఇండియాతో పాటు తెలంగాణ, ఏపీపైనా ఉంటున్నది. ఈ కారణంగానే మార్చి, ఏప్రిల్ నెలల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈసారి మార్చి ప్రారంభం నుంచే దేశంలో పశ్చిమ గాలుల ప్రభావం తీవ్రంగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన సైంటిస్ట్ అక్షయ్ దేవరాస్ తెలిపారు. కేవలం వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఉంటే నార్త్ ఇండియా వరకే ప్రభావం ఉండేదని, అరేబియా సముద్రం వేడెక్కడం, బంగాళాఖాతం నుంచి తేమ గాలులు రావడం వంటి కారణాల వల్ల దేశమంతా కాలంకాని కాలంలోనూ వర్షాలు విస్తరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు మధ్యదరా సముద్ర ప్రాంతంతో పాటు మిడిల్ ఈస్ట్ నుంచి కూడా వేడి గాలులు వీస్తున్నాయని, దాని వల్ల అరేబియా సముద్రం వేడెక్కుతున్నదని సైంటిస్టులు చెప్తున్నారు. మున్ముందు ఇది మరింత తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.
ఎండాకాలంలో వానలూ ఎక్కువే
ఎండాకాలంలో టెంపరేచర్స్‌తో పాటు వానలు కూడా ఎక్కువగా కురుస్తున్నాయి. ఈ ఏడాది మార్చి మధ్య నుంచి ఏప్రిల్‌లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 7 రోజులు వర్షాలు పడ్డాయి. మార్చి 16, 18, 19, 25, ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో వర్షాలు పడ్డాయి. వాటికి తోడు వడగండ్లు బీభత్సం సృష్టించాయి. ఈ 3 వారాల్లోనే సాధారణం కన్నా 40% ఎక్కువ వర్షపాతం నమోదైంది. అంటే ఎండాకాలంలో పడాల్సిన దాని కన్నా ఎక్కువ వర్షం కురిసింది. ఇక, ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు పడిన వర్షాల్లో 60 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది.
రైతులకు కడగండ్లు
అకాల వర్షాలు, వడగండ్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. 2020లో 14 లక్షల ఎకరాలు, 2021లో 12 లక్షలు, 2022లో 10 లక్షలు, ఈ ఏడాది ఇప్పటి వరకు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ ఏడాది అకాల వర్షాలకు 2.2 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా కట్టినా.. దానికి రెట్టింపు పంటలు నష్టం జరిగినట్లు అనధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అకాల వర్షాల వల్ల వివిధ పంటలకు తెగుళ్లు సోకుతున్నాయి. వరి పంటకు ఆరంభంలో మొగి పురుగు తెగులు సోకగా.. ఇప్పుడు అకాల వర్షాల వల్ల అగ్గి తెగులు, మెడ విరుపు తెగులు సోకుతున్నది. దీంతో పైరు ఎదుగుదల తగ్గి గింజలు తాలుగా మారుతున్నాయి. ఫలితంగా దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఇటు మామిడి, ఇతర పంటలకు కూడా తెగుళ్లు సోకుతున్నాయి.
మరి నివారణేంటి..?
కాలుష్యం, వాతావరణ మార్పులకు కారణమవుతున్న కర్బన ఉద్గారాల (ఎమిషన్స్)ను గణనీయంగా తగ్గించుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోనూ పొల్యూషన్ పెరిగిపోతున్నది. పాత వెహికల్స్‌తో వచ్చే పొగ వల్ల హైదరాబాద్ వాతావరణం ఖరాబైతున్నది. ఇండస్ట్రీల నుంచే వచ్చే పొగతోనూ కాలుష్యం భారీగా పెరుగుతున్నది. నదుల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నట్టు ఇటీవలే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిపోర్ట్ కూడా తేల్చింది. ఈ నేపథ్యంలోనే ఆ ఎమిషన్స్‌ను కంట్రోల్ చేసుకోగలిగితే వాతావరణ మార్పులను కొంతలో కొంతైనా తగ్గించుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెల్లమెల్లగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు మారడం లేదా ప్రత్యామ్నాయ ఇంధనాలవైపు మళ్లడం వంటివి చేయాలని, పచ్చదనాన్ని పెంపొందించడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.
రాష్ట్రంలో పెరిగిపోతున్న వేడి
గత 50 ఏండ్ల నుంచి దేశంలో హీట్‌వేవ్స్ పెరుగుతున్నట్టు బెనారస్ హిందూ యూనివర్సిటీలోని క్లైమేట్ చేంజ్ రీసెర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్కు చెందిన సైంటిస్టులు అంచనా వేశారు. హీట్వేవ్స్కు తెలంగాణ, ఏపీ హాట్‌స్పాట్స్‌గా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు. 20 ఏండ్ల నుంచి తెలంగాణ, ఏపీలో వేడి భారీగా పెరిగిపోతున్నదని చెప్తున్నారు. వచ్చే 50 ఏండ్లలో ఇది మరింత ముదిరే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కొన్నేండ్లలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో 2020లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 45 డిగ్రీలకుపైగా రికార్డ్ అయింది. నిరుడు మేలో రాష్ట్రంలో అత్యధికంగా 45 డిగ్రీలకుపైనే టెంపరేచర్లు రికార్డయితే.. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే 43 డిగ్రీలను దాటేసింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. హైదరాబాద్‌లోనూ క్లైమేట్ జోన్లో మార్పులు వస్తున్నట్టు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 50 ఏండ్లలో సౌదీ అరేబియాను మించి టెంపరేచర్లు నమోదయ్యే ముప్పు ఉందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెంపరేచర్లు ఎక్కువగా నమోదవుతున్న రోజుల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నాయి.