జీఎంఆర్‌‌ నష్టం రూ. 2,341 కోట్లు

జీఎంఆర్‌‌ నష్టం రూ. 2,341 కోట్లు

హైదరాబాద్‌‌, వెలుగు :జీఎంఆర్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌  మార్చి 2019తో ముగిసిన నాలుగో క్వార్టర్లో రూ. 2,341 కోట్ల కన్సాలిడేటెడ్‌‌ నష్టం పొందింది. విద్యుత్‌‌ రంగంలోని కొన్ని ప్రాజెక్టులు, ఇన్‌‌ఫ్రా రంగంలోని కొన్ని ప్రాజెక్టుల వల్లే ప్రధానంగా ఈ నష్టం వచ్చినట్లు కంపెనీ తెలిపింది. అంతకు ముందు ఏడాది చివరి క్వార్టర్లో జీఎంఆర్‌‌ ఇన్‌‌ఫ్రాకు రూ. 4.81 కోట్ల నికర లాభం వచ్చింది. మార్చి 2019 తో అంతమైన క్వార్టర్లో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 2,293 కోట్లు. అంతకు ముందు ఏడాది చివరి క్వార్టర్‌‌లోని రూ. 2,234 కోట్లతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువే. జీఎంఆర్‌‌ ఎనర్జీ లిమిటెడ్‌‌, దాని సబ్సిడరీలు, జేవీలలో పెట్టిన పెట్టుబడులలో రూ. 1,243 కోట్లను నష్టాలుగా జీఎంఆర్‌‌ గ్రూప్‌‌ పరిగణనలోకి తీసుకుంది.మరో అసోసియేట్‌‌ కంపెనీ  జీఎంఆర్‌‌ ఛత్తీస్‌‌గఢ్‌‌ ఎనర్జీ లిమిటెడ్‌‌లోని పెట్టుబడులకుగాను రూ. 970 కోట్లను నష్టంగా పరిగణించారు.

దీంతో ఈ విధంగా వచ్చిన నష్టాల మొత్తం రూ. 2,212 కోట్లకు చేరింది. జీఎంఆర్‌‌ ఛత్తీస్‌‌గఢ్‌‌ ఎనర్జీ లిమిటెడ్‌‌ బొగ్గు ఆధారంగా నడిచే పవర్‌‌ ప్లాంట్‌‌ను నెలకొల్పింది. ఈ కంపెనీకి ఎలాంటి దీర్ఘకాల పవర్‌‌ పర్చేజ్‌‌ ఎగ్రిమెంట్లూ లేవు. దీంతో వాణిజ్య ఉత్పత్తి మొదలుపెట్టినప్పటి నుంచీ  నష్టాలలోనే నడుస్తోంది. మార్చి 2019 నాటికి ఈ కంపెనీ ఎక్యుములేటెడ్‌‌ నష్టాలు రూ. 4,229 కోట్లకు పెరిగాయి. ఇక జీఎంఆర్‌‌ ఎయిర్‌‌పోర్ట్‌‌ విభాగం మార్చి 2019 క్వార్టర్లో రూ. 1,357 కోట్ల ఆదాయం మీద రూ. 271 కోట్ల లాభం ఆర్జించింది.  ఢిల్లీ ఎయిర్‌‌పోర్ట్‌‌లో పాసెంజర్‌‌ ట్రాఫిక్‌‌ 2018–19లో 5 శాతం పెరిగి 6.92 కోట్లకు చేరిందని, ఈ ఎయిర్‌‌ పోర్టు రూ. 885 కోట్ల నగదు లాభం ఆర్జించిందని జీఎంఆర్‌‌ గ్రూప్‌‌ తెలిపింది. హైదరాబాద్‌‌ ఎయిర్‌‌పోర్ట్‌‌ పాజింజర్‌‌ ట్రాఫిక్‌‌ భారీగా 16 శాతం అధికమై 2.14 కోట్లకు చేరిందని వెల్లడించింది. ఫిలిప్పీన్స్‌‌లోని మక్టాన్‌‌ సెబు ఎయిర్‌‌పోర్టు 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 359 కోట్ల నగదు లాభం సంపాదించింది.