భారత సంతతి అమెరికా లీడర్ ప్రమీల​కు వార్నింగ్

భారత సంతతి అమెరికా లీడర్ ప్రమీల​కు వార్నింగ్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో సామాన్యులకే కాదు చట్ట సభల సభ్యులకూ రేసిస్టు కామెంట్లు, బెదిరింపులు తప్పట్లేదు. ప్రతినిధుల సభ మెంబర్, మన దేశ మూలాలున్న ప్రమీలా జయపాల్​కు కూడా గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని జయపాల్​ స్వయంగా వెల్లడించారు. తనకు వచ్చిన ఫోన్​ కాల్​ సంభాషణలకు సంబంధించిన వాయిస్​ మెసేజ్​లను ఆమె సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. అందులో జయపాల్​ను ఉద్దేశించి ఆగంతుకుడు జాత్యంహకార వ్యాఖ్యలు చేశాడు. ముందు ముందు ఆమె జీవితం దుర్భరం చేస్తానని బెదిరించాడు. మీ ఇండియాకు వెళ్లిపోవాలని హెచ్చరించాడు. అభ్యంతరకర భాషలో తిడుతూ తిరిగి వెళ్లిపొమ్మన్నాడు.

దీనిపై జయపాల్​ స్పందించారు. దేశంలో రేసిజంను, హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ ట్వీట్ చేశారు. చెన్నైలో పుట్టిన ప్రమీలా జయపాల్ తన పదహారేండ్ల వయసులో కుటుంబంతో అమెరికాకు వలస వెళ్లారు. చదువు పూర్తయ్యాక డెమోక్రాటిక్​ పార్టీలో చేరారు. ఇప్పుడు సియాటెల్​ నుంచి హౌస్​ ఆఫ్​ రిప్రంజెటేటివ్స్​కు సియాటెల్​ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా, పోయిన వేసవిలో సియాటెల్​లోని జయపాల్​ ఇంటిముందు ఓ అపరిచితుడు రివాల్వర్​తో పట్టుబడ్డాడు. పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. నిందితుడి పేరు బ్రెట్ ఫోర్​సెల్​గా తేలింది.

మరోవైపు, ఈ నెల మొదట్లోనూ కాలిఫోర్నియాలో ఇండియన్​ అమెరికన్​ఒకాయన జాతి వివక్షకు గురయ్యాడు. కిందటి నెలలో నలుగురు ఇండియన్​ అమెరికన్​ మహిళలు టెక్సస్​లో ఇలాగే అవమానపడ్డారు. మెక్సికన్​ అమెరికన్​ మహిళ వీళ్లపై అసభ్యకరమైన భాషలో విరుచుకుపడింది. డాలస్​లోని ఓ పార్కింగ్​ ప్లేస్​లో ఈ ఘటన చోటుచేసుకుంది.