బీచ్‌లో మైనర్ల గ్యాంగ్‌రేప్.. పిల్లల్ని బయటకు ఎందుకు పంపారన్న సీఎం

బీచ్‌లో మైనర్ల గ్యాంగ్‌రేప్.. పిల్లల్ని బయటకు ఎందుకు పంపారన్న సీఎం

పనాజీ: గోవాలో ఇద్దరు మైనర్ బాలికలు గ్యాంగ్‌రేప్‌కు గురవ్వడం సంచలనంగా మారింది. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన నలుగురిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి కావడం గమనార్హం. బీచ్‌కు ఇద్దరు బాలులతో కలసి వెళ్లిన బాలికలను గుర్తించిన సదరు ఉద్యోగి, అతడి ఫ్రెండ్స్.. వారితో తాను పోలీసునని చెప్పుకున్నాడు. అంతేగాక బాలుల్ని తీవ్రంగా కొట్టి బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సౌత్ గోవాకు 30 కిలో మీటర్ల దూరంలోని బెనాలిమ్‌లో జరిగింది. ఈ ఘటనకు కారకులైన నలుగురు నిందితులను పోలీసుల పట్టుకున్నారు. అయితే ఈ విషయంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించిన తీరు వివాదాస్పదం అవుతోంది. 

పిల్లల బాధ్యతను పేరెంట్స్ చూసుకోవాలె

రాత్రి పూట పిల్లల్ని ఎందుకు బయటకు పంపారని పిల్లల పేరెంట్స్‌ను సీఎం సావంత్ క్వశ్చన్ చేశారు. ‘14 ఏళ్ల పిల్లలు ఓ రాత్రి మొత్తం బీచ్‌లో ఉండటం కరెక్టేనా? దీనిపై తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పిల్లలు వినడం లేదని చెప్పి మన బాధ్యతను ప్రభుత్వం, పోలీసులపై నెట్టలేం కదా? తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత పేరెంట్స్‌దే. ముఖ్యంగా మైనర్లు రాత్రి పూట బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి’ అని సావంత్ పేర్కొన్నారు.  దీనిపై విపక్షాలు విమర్శలకు దిగాయి.

రక్షణ కల్పించలేకుంటే సీఎంగా దిగిపోండి
సీఎం సావంత్ వ్యాఖ్యలపై గోవా ఫార్వర్డ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. రాత్రి పూట బయట తిరగడానికి మనం ఎందుకు భయపడాలని కాంగ్రెస్ నేత అల్టోన్ డీ కోస్టా ప్రశ్నించారు. నేరాలకు పాల్పడే వారు జైళ్లలో ఉండాలని.. చట్టాలను పాటించే పౌరులు స్వేచ్ఛగా బయట తిరగాలన్నారు. ‘పౌరులకు సేఫ్టీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పోలీసులదే. ప్రజలకు రక్షణ కల్పించలేనప్పుడు సీఎంకు ఆ పదవిలో, కుర్చీలో  కూర్చునే హక్కు ఉండదు’ అని గోవా ఫార్వర్డ్ పార్టీ నేత వైజాయ్ సర్దేశాయ్ అన్నారు. పిల్లలు రాత్రి పూట బయట తిరిగితే పేరెంట్స్‌ను నిందించడం కరెక్ట్ కాదని స్వతంత్ర్య ఎమ్మెల్యే రోహన్ ఖాంటే చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా గోవా సేఫ్ కాదని చెబుతున్నారా అని ఫైర్ అయ్యారు.