టీ.. ఛాయ్ 265 రూపాయలా.. ఏంది సామీ ఈ రేటు

 టీ.. ఛాయ్ 265 రూపాయలా.. ఏంది సామీ ఈ రేటు

సాధారణంగా చాయ్ ధర ఎంత ఉంటుంది. రూ. 5  లేదా రూ. 10 .  పోనీ రూ. 20.  మహా అయితే..వంద రూపాయలు ఉంటుందేమో. కానీ ఓ చోట మాత్రం చాయ్ ఏకంగా బిర్యానీ రేటును మించి ఉంది. ఒక్క చాయ్ కి బిల్లు ఎంత వేశాడో తెలుసా..అక్షరాలా 265 రూపాయలు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ కలిపి వేశాడు. పోనీ జీఎస్టీ ఎక్కువ వేశాడంటే అదీ లేదు. రెండు జీఎస్టీలు కలిపి రూ. 6.31  చొప్పున మొత్తం రూ. 12.62 పైసలు ఛార్జ్ చేశాడు. దీని ప్రకారం టీ ధర రూ. 252 అన్నమాట. 

టీ ధర రూ. 265 ఎక్కడంటే..

దేశంలోని కొన్ని ఎయిర్ పోర్టుల్లో ధరలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. మరికొన్ని ఎయిర్ పోర్టుల్లో అయితే ఏదైనా తినాలన్నా..ఏదైనా తాగాలన్నా..వాటి ధరలు చూసి  అమ్మో అనాల్సిందే. అక్కడ ఆహారం, నీరు, టీ ధరలు ఆకాశాన్నంటుతాయి. అయితే గోవాలోని డబోలిమ్ విమానాశ్రయంలోనూ టీ ధరలు చుక్కలు తాకుతున్నాయి. అక్కడ ఒక్క టీ ధర ఏకంగా రూ. 265. ఈ విషయాన్ని బీజేపీ గోవా ప్రతినిధి ట్విట్టర్లో తెలిపారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన బిల్లును సైతం పోస్ట్ చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రికి ట్యాగ్ చేశారు.  ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను అభ్యర్థించారు.