దివ్యాంగురాలైన బిడ్డ కోసం రోబో తయారీ

దివ్యాంగురాలైన బిడ్డ కోసం రోబో తయారీ
  • దివ్యాంగురాలైన కూతురు కోసం ఓ కూలి సృష్టి
  • వాయిస్​ కమాండ్​తో ఆహారాన్ని తినిపించే ‘మా రోబో’

పణజి: మంచంపై కదలలేని స్థితిలో భార్య.. దివ్యాంగురాలైన బిడ్డ.. కూలికి పోతేగాని ఇల్లు గడవని పరిస్థితి.. ఇలాంటి సిట్యుయేషన్లలో ఎవరైనా దిగాలు పడిపోయి, కుంగిపోతుంటారు. కానీ గోవాకు చెందిన బిపిన్​ కదం మాత్రం సరికొత్త రోబోను సృష్టించాడు. కూతురుకు అన్నం తినిపించేందుకు తనే సొంతంగా ఒక రోబోను తయారుచేసిండు. టెక్నాలజీ గురించి ఏమీ తెల్వకున్నా ఏడాదిపాటు కష్టపడి మరీ దీనికి రూపకల్పన చేశాడు. ప్రస్తుతం ఎవరి సహాయం లేకుండానే బిపిన్​ కూతురు రోబో సాయంతో అన్నం తింటోంది.

భార్య చెప్పిన మాటలతో..

నలభై ఏండ్ల బిపిన్ కదం గోవాలోని పొండా తాలుకా బెతోరా గ్రామంలో రోజువారీ కూలీ.. పనిచేయకుంటే రోజు గడవని పరిస్థితి. కూతురేమో పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఇప్పుడు పద్నాలుగేండ్లున్నా కాళ్లు, చేతులు కదపలేదు. ఏం తినాలన్నా అమ్మపై ఆధారపడాల్సిందే. రెండేండ్ల క్రితం బిపిన్ భార్య అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. దీంతో బిపిన్ పని నుంచి వచ్చి కూతురుకు అన్నం తినిపించి వెళ్లేవాడు. కూతురుకు అన్నం పెట్టలేకపోతున్నానని భార్య బాధపడడంతో కూతురు సొంతంగా తినేందుకు ఏంచేయాలని బిపిన్​ ఆలోచన చేశాడు. కూతురుకు అన్నం తినిపించే రోబో కోసం వెతకగా అలాంటిదిలేదని తెలిసింది. దీంతో అలాంటి రోబో తయారీకి తనే పూనుకున్నడు. ఇందుకోసం ఇంటర్నెట్​లో సాఫ్ట్​వేర్ బేసిక్స్ నేర్చుకున్నాడు.

12 గంటలు పని.. ఆ తర్వాత రీసెర్చ్

‘‘ఎలాంటి బ్రేక్​ లేకుండా 12 గంటలు పనిచేసేవాడిని. ఆ తర్వాత నా టైమంతా రోబోను ఎలా తయారు చేయాలనే రీసెర్చ్ కే కేటాయించాను. 4 నెలలు రీసెర్చ్ చేసి రోబోను డిజైన్ చేశా. ఇప్పుడు పని నుంచి ఇంటికి వచ్చేటప్పటికి నా కూతురు నవ్వుతూ నా ముందు ఉంటే ఎంతో ఎనర్జీ వచ్చినట్టు అవుతోంది”అని బిపిన్​ అన్నాడు. రోబోకు ‘మా రోబో’ అని పేరుపెట్టాడు బిపిన్. రోబో ముందుభాగంలో ఒక ప్లేట్​ ఉంటుంది. అందులో ఆహారం ఉంచుతారు. పాప వాయిస్ కమాండ్​తో రోబో పనిచేస్తుంది. కూరలు, పప్పన్నం, ఇతర పదార్థాల గురించి చెపితే వాటిని తినిపిస్తుంది. తన కూతురులాంటి వారికోసం రోబోలను తయారు చేస్తానన్నారు. గోవా రాష్ట్ర ఇన్నొవేషన్​ కౌన్సిల్ మా రోబోను పరిశీలించి బిపిన్​ ను మెచ్చుకుంది.