మానుకోట మాణిక్యం..దీక్షిత

మానుకోట మాణిక్యం..దీక్షిత

ఇంటర్నేషనల్‌‌‌‌ లెవల్‌‌ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు, వెండి పతకాలను సాధించి మానుకోట కీర్తిని ప్రపంచానికి చాటింది దీక్షిత. అదే స్ఫూర్తితో ఇప్పుడు ఒలింపిక్స్​లో స్వర్ణ పతకం సాధించాలనే లక్ష్యంతో కష్టపడుతోంది. లక్ష్యాన్ని సాధించేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది దీక్షిత. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నింటిని అధిగమించి దూసుకెళ్తోంది.

ఒలింపిక్స్​లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని దీక్షిత ప్రాక్టీస్‌‌ చేస్తోంది. ఆమె ఈ స్థాయికి రావడానికి ఎన్నో అడ్డంకులు, కష్టాలను దాటాల్సి వచ్చింది. దీక్షితది మహబూబాబాద్‌‌ పట్టణం. ఎర్ర కేశవరావు, వినోద దంపతుల పెద్ద కూతురు. దీక్షితకు చిన్నతనం నుంచే ఆటలంటే ఇష్టం. ఆమే మేనమామ శ్రీనివాస్​ ఒక రోజు వాకింగ్‌‌కు​ వెళ్తుంటే శివకుమార్​ అనే పీఈటీ పిల్లలతో కసరత్తులు చేయించడం చూశాడు. శివకుమార్ దగ్గరకు వెళ్లి ‘ఎందుకీ ఎక్సర్​సైజులు’అని అడిగాడు. దానికి బదులుగా శివకుమార్‌‌‌‌.. ‘హకీంపేట స్పోర్ట్స్​ స్కూల్లో ఎంట్రన్స్​కు ట్రైనింగ్‌‌ ఇస్తున్నా’ అని చెప్పాడు. తన మేన కోడలు దీక్షితకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. కాబట్టి హకీంపేటలో చేర్పిస్తే బాగుంటుందని.. దీక్షిత తల్లిదండ్రులను ఒప్పించి ఆయన దగ్గర ట్రైనింగ్‌‌ ఇప్పించాడు. మూడు నెలల తర్వాత నిర్వహించిన ఎంట్రన్స్‌‌ టెస్ట్‌‌లో దీక్షిత ఫస్ట్ వచ్చింది. నాలుగో తరగతి చదువుతున్నప్పుడే 2006లో హైదరాబాద్​లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌‌లో చేరింది. ‘స్కూల్లో చేరిన మొదటి నాలుగేళ్లు ఫిట్‌‌నెస్​పైనే దృష్టి పెట్టా. ఆ తరువాత ట్రైనర్స్‌‌ నా శరీరాకృతి, ఎత్తు చూసి ‘వెయిట్​లిఫ్టింగ్’​ ట్రై చేయమని చెప్పారు. ముందుగా వారం రోజులు వెయిట్‌‌ లిఫ్టింగ్‌‌లో ట్రైనింగ్‌‌ తీసుకున్నా. తర్వాత కరణం మల్లీశ్వరిని ఆదర్శంగా తీసుకుని వెయిట్‌‌లిఫ్టర్‌‌‌‌ అవ్వాలని ఫిక్సయ్యా. అప్పటినుంచి ప్రతి రోజు ఉదయం 3గంటలు, సాయంత్రం 3గంటలు సాధన చేస్తున్నా’ అని చెప్పింది దీక్షిత.

వెయిట్ లిఫ్టింగ్‌‌పై ఆసక్తి

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ఎస్ఎ సింగ్, మాణిక్యాలరావు వద్ద కోచింగ్​ తీసుకుంది. అటు కోచింగ్​ తీసుకుంటూనే నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో మల్లారెడ్డి కాలేజీలో పీజీలో చేరింది. 2018 నవంబర్​లో రైల్వేలో టీటీఈగా ఉద్యోగం తెచ్చుకుంది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూనే ఒలింపిక్స్‌‌కు ప్రిపేర్‌‌‌‌ అవుతోంది.

అంతర్జాతీయ స్థాయిలో..

దీక్షిత ఇప్పటివరకు నేషనల్‌‌ లెవెల్‌‌లో 34, ఇంటర్నేషనల్‌‌ లెవెల్‌‌లో 10 పతకాలను సాధించింది. కిందటేడాది ఆస్ట్రేలియాలో నిర్వహించిన కామన్‌‌ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్‌‌‌‌ కరణం మల్లీశ్వరితో పాటు పలువురు ప్రముఖుల అభినందనలు అందుకుంది.

 

 

నా లక్ష్యం ఒలింపిక్స్​

ఒలింపిక్స్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి, దేశం గర్వించేలా చేయడమే నా లక్ష్యం. ఇప్పుడు అందుకున్న పతకాలన్నీ ఒక ఎత్తు. ఒలింపిక్స్‌‌ ఒక ఎత్తు. ఒలింపిక్స్‌‌లో స్వర్ణం సాధిస్తే దేశానికి ప్రపంచంలో గుర్తింపు వస్తుంది. స్వర్ణం చేజిక్కించుకోవడం కోసం మరిన్ని మెలకువలు నేర్చుకుంటా.

                                                                                                                                            – దీక్షిత